వార్తామాలై – పదమూడవ భాగం (వార్తై 35 – 37)

శ్రీ:     శ్రీమతే శఠకోపాయ నమః    శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః    

పూర్తి శ్రేణి

<< పూర్వపు భాగం 

వార్తామాలై లో మన పూర్వాచార్యుల ద్వారా అందించబడిన మన తత్వశాస్త్రానికి, సంప్రదాయానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నంపిళ్ళైకి అత్యంత ప్రియమైన శిష్యులైన పిన్బళగరామ్ పెరుమాళ్ జీయర్  ఈ ఉపదేశాలను, ఆయా ఆచార్యుల జీవితాలలో జరిగిన ముఖ్యమైన సంఘటనలతో సహా సంక్షిప్తంగా క్రోడీకరించారు. వీరు 6000 పడి గురుపరంపరా ప్రభావం అనే గ్రంథాన్ని రచించారు.

ఐతిహ్యాలను చదవడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అయితే, మన సిద్ధాంతానికి సంబంధించిన లోతైన విశ్లేషణను అర్థం చేసుకోవడం కొంత కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా, అనేక వార్తలలో విశ్లేషించబడిన చిత్, అచిత్, ఈశ్వరన్ అనే తత్త్వాలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి శాస్త్రజ్ఞానం, వేదాంత మౌలికాంశాల అవగాహన అవసరం.

ఈ గ్రంథాన్ని ప్రచురించినందుకు, అలాగే ఇందులోని సంక్లిష్టమైన తత్త్వవిషయాలకు విపులమైన వివరణను అందించినందుకు పుత్తూర్ స్వామివారికి కృతజ్ఞతలు.

ఈ క్రింది వ్యాసం, శ్రీ ఉ.వే. సారథి తోతాద్రి స్వామివారు వార్తామాలై గ్రంథంపై తమిళంలో అనుగ్రహించిన కాలక్షేప ఉపన్యాసానికి తెలుగు అనువాదం. ఈ అవకాశాన్ని కల్పించినందుకు, అంతేకాకుండా ఈ విషయాలను ప్రచురించడంలో నిరంతరం సహకరిస్తున్నందుకు స్వామివారికి కృతజ్ఞతలు.

వార్తై అనగా ఆచార్యులు తమ శిష్యులకు అనుగ్రహించిన ఉపదేశం. ఈ ఉపదేశాలు ఆచార్య పరంపర ద్వారా తరువాతి తరాలకు అందించబడి, అనంతరం సంక్షిప్తంగా క్రోడీకరించబడ్డాయి.

ఈ సందర్భంలో కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు ఒకే తత్త్వవిషయం వేర్వేరు వార్తలలో, స్వల్పమైన వివరణా భేదాలతో పునరావృతమవుతుంది. దీనికి కారణం, ఆయా ఆచార్యులు ఒకే విషయాన్ని వివరించేటప్పుడు, దానిలోని ప్రత్యేకమైన అంశాలను నొక్కి చెప్పడానికి వేర్వేరు కోణాలపై దృష్టి సారించడం.

వార్తై 35

సారాంశం:

  • తిరుమంత్రం ప్రమాణం, ప్రమేయం, ప్రమాత అనే మూడింటిని తెలియజేస్తుంది.
  • ప్రణవం ఆత్మ స్వరూపాన్ని తెలియజేస్తుంది. ఇది ప్రమాణాన్ని సూచిస్తుంది.
  • తిరుమంత్రంలోని “నమః” శబ్దం ప్రమేయాన్ని తెలియజేస్తుంది.
  • తిరుమంత్రంలోని “నారాయణాయ” శబ్దం ప్రమాతను సూచిస్తుంది.

వార్తై 35

ప్రమాణ ప్రమేయ ప్రమాతాక్కళై చేఱ అనుసన్ధిక్కుమ్పడి;  ఆత్మావుక్కు స్వరూపమ్  అనన్యార్హ శేషత్వమ్ ఏతత్ప్రకాశకమ్  ప్రణవమ్; అనన్యార్హ శేషత్వ ప్రతిసమ్బన్ధి  పెరుమాళ్ పోరున్దవిట్ట తిరువడిగళ్. ఆత్మావుక్కు స్వరూపమ్  అనన్య శరణత్వమ్; ఏతత్ప్రకాశకమ్  నమస్సు; అనన్య శరణత్వ ప్రతిసమ్బన్ధి  పెరుమాళ్ అమైత్త తిరుక్కై. 

ఆత్మావుక్కు స్వరూపమ్  అనన్య భోగత్వమ్ ఏతత్ప్రకాశకమ్  నారాయణ పదమ్; అనన్య భోగత్వ ప్రతిసమ్బన్ధి  పెరుమాళ్ తిరుముఱువల్. ఇదుక్కు క్కరుత్తు  తానఱిగై; చైతన్యమఱుగై; సాధనాన్తరమ (సాధ్యాన్తరమ్?) అఱుగై. అదావదు  వేరఱుగై, వ్యాపారాన్తరమ్ అఱుగై, విషయాన్తరమ్ అఱుగై. 

గత వార్తై లో తిరుమంత్రం యొక్క ప్రధాన అర్థం వివరించబడింది. మన ఆచార్యులు మనకు తిరుమంత్రం, ద్వయ మహామంత్రం, చరమశ్లోకం అనబడే మూడు రహస్యాలను ఉపదేశిస్తారు. వీటిలో తిరుమంత్రం మొదటిది. దీనిని ‘పెరియ తిరుమంత్రం’ లేదా ‘అష్టాక్షరి’ అని కూడా అంటారు. శాస్త్రాలు తిరుమంత్రాన్ని అత్యంత ప్రాధానమైన మంత్రంగా గౌరవిస్తాయి. నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ మరియు ఇతర ఆళ్వార్లు అనేక చోట్ల తిరుమంత్రం యొక్క అర్థాన్ని వివరించారు. అదేవిధంగా, మన ఆచార్యులు కూడా తిరుమంత్రం యొక్క అర్థాలను వివరించారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన సంస్కృత గ్రంథమైన అష్టశ్లోకీలో పరాశర భట్టర్ తిరుమంత్రం, ద్వయమంత్రం, చరమశ్లోకం అర్థాలను వివరించారు.

పెరియవాచ్చాన్ పిళ్ళై తిరుమంత్రాన్ని వివరించే అనేక గ్రంథాలను రచించారు. అదేవిధంగా, పిళ్ళై లోకాచార్యులు యాదృచ్ఛిక పడి, శ్రియఃపతి పడి, పరంద పడి, ముముక్షుప్పడి, తని ప్రణవం, తని ద్వయం, తని చరమం మొదలైన గ్రంథాలను రచించారు. ఈ గ్రంథాలన్నింటిలో రహస్యత్రయం యొక్క అర్థాలు వివరించబడ్డాయి.

ప్రమాణ ప్రమేయ ప్రమాతాక్కళై చేఱ అనుసన్ధిక్కుమ్పడి

తిరుమంత్రంలో ప్రమాణం, ప్రమేయం, ప్రమాతలను అనుసంధానం చేసి ధ్యానించాలి. ప్రమాణం అంటే జ్ఞానాన్ని కలిగించేది. మనం జ్ఞానాన్ని పొందే సాధనాన్ని ప్రమాణం అంటారు. ఉదాహరణకు, గ్రంథాలను ప్రమాణాలుగా పరిగణిస్తారు.

ప్రమేయం అంటే జ్ఞానం ద్వారా పొందవలసినది. జ్ఞానాన్ని పొందడం ద్వారా మనం ఏమి సాధించబోతున్నామో దానిని ప్రమేయం అంటారు. ప్రమాత అంటే ప్రమేయాన్ని తెలియజేసేవారు అంటే ఆచార్యులు. 

తిరుమంత్రం ఎంపెరుమాన్‌ను గురించి తెలియజేస్తుంది. నారాయణ అనే నామం ఆయనకు ముఖ్యమైన నామం. ఎంపెరుమాన్ మొదటి ఆచార్యుడు (ప్రథమాచార్యుడు) కనుక, ఆయనను ప్రమాత అని కూడా అంటారు.

తిరుమంత్రం అనంతమైన విషయాలను కలిగి ఉన్న సముద్రం వంటిది. ఇక్కడ అందించబడిన వివరణ దానిలోని గంభీరమైన అర్థాన్ని తెలియజేస్తుంది. ఆచార్యులు అనేక చోట్ల దీనిని విశ్లేషించి వివరించారు. తిరుమంత్రంలో ప్రమాణం, ప్రమేయం, ప్రమాత అనే మూడు అంశాలు ఎలా ఉన్నాయో తెలియజేశారు.

ఆత్మావుక్కు స్వరూపమ్  అనన్యార్హ శేషత్వమ్

ఆత్మ యొక్క స్వరూపం అనన్యార్హ శేషత్వం.

శేషత్వం అంటే సేవకునిగా ఉండటం, కైంకర్యపరత్వం. అనన్యార్హ శేషత్వం అంటే పరమాత్మను తప్ప మరెవరికీ సేవకునిగా ఉండకపోవడం.

ఏతత్ప్రకాశకమ్  ప్రణవమ్

ప్రకాశకం అంటే తెలియజేసేది లేదా వెలుగులోకి తెచ్చేది.

ప్రణవం జీవాత్మ పరమాత్మకు సేవకుడని, జీవాత్మ ‘అనన్యార్హ శేషుడు’ అని తెలియజేస్తుంది. అంటే, జీవాత్మ పరమాత్మకు మాత్రమే సేవకుడిగా ఉంటాడు.

అనన్యార్హ శేషత్వ ప్రతిసమ్బన్ధి  పెరుమాళ్ పోరున్దవిట్ట తిరువడిగళ్

ప్రతిసంబంధి అంటే మనం ఏదైనా ఇచ్చినప్పుడు దానిని స్వీకరించేవారు. ఉదాహరణకు, ఒక కన్యను వివాహంలో ఇచ్చినప్పుడు, ఆమెను స్వీకరించే వరుడు ప్రతిసంబంధి అవుతాడు.

జీవాత్మలందరికీ అనన్యార్హ శేషత్వం ఉంటుంది. జీవాత్మలు భగవానుడిని తప్ప మరెవరికీ సేవకులు కారు. జీవాత్మ ఎవరికైనా సేవకుడైతే, ఆ వ్యక్తికి సేవ చేయాలి. అయితే, మన సేవను స్వీకరించేవారు ఎంపెరుమాన్ యొక్క తిరువడులు మాత్రమే.

అందువల్ల, మన స్వరూపం అనన్యార్హ శేషత్వం. ప్రణవం ఈ తత్త్వాన్ని తెలియజేస్తుంది. మన కైంకర్యం ఎంపెరుమాన్ యొక్క తిరువడులకే చేయాలని బోధిస్తుంది.

ప్రణవం (ఓం) జీవాత్మకు భగవానుడితో ఉన్న శేషత్వ సంబంధాన్ని తెలియజేస్తుంది. కాబట్టి, ప్రణవం ప్రమాణం అవుతుంది.

ప్రమేయం అంటే మనం పొందవలసినది, అనుభవించవలసినది. తిరుమంత్రంలోని ‘నమః’ అనే పదం ఈ ప్రమేయాన్ని తెలియజేస్తుంది.

ఆత్మావుక్కు స్వరూపమ్  అనన్య శరణత్వమ్

ఆత్మ యొక్క స్వరూపం వివిధ సంబంధాల ద్వారా వివిధ విధాలుగా వ్యక్తమవుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒకేసారి భర్తగా, తండ్రిగా, కుమారుడిగా ఉండవచ్చు. ఆయా సంబంధాల ప్రకారం ఈ స్థితులన్నీ నిజమైనవే. కాబట్టి, అవి ఒకదానికొకటి విరుద్ధమైనవి కావు. అదేవిధంగా, అనన్యార్హ శేషత్వం, అనన్య శరణత్వం రెండూ ఆత్మ యొక్క స్వరూపాలే. అనన్య శరణత్వం అంటే భగవానుడిని మాత్రమే ఆశ్రయంగా విశ్వసించడం. భగవానుడిని తప్ప మరెవరినీ రక్షకునిగా భావించకపోవడమే అనన్య శరణత్వం. భగవానుడే మనకు పరమాశ్రయం.

ఏతత్ప్రకాశకమ్  నమస్సు

తిరుమంత్రంలోని ‘నమః’ అనే పదం పైన చెప్పిన స్వరూపాన్ని తెలియజేస్తుంది. అంటే, భగవానుడికి మాత్రమే ప్రత్యేకంగా సేవకులుగా ఉండటం, ఆయనపైనే పూర్తిగా ఆధారపడటం అనే విషయాలను బోధిస్తుంది. మనం భగవానుడికి మాత్రమే సేవకులమని, ఆయనపైనే ఆధారపడాలని తెలియజేస్తుంది. మనలను రక్షించగలవాడు ఆయనొక్కడే. ‘నమః’ అనే పదంలో ‘మః’ అంటే ‘నాకు’, ‘న’ అంటే ‘కాదు’ అని అర్థం. కాబట్టి, నమః అంటే ‘నాకు కాదు’ అని అర్థం చేసుకోవచ్చు. జీవాత్మలందరూ ఇదే స్థితిలో ఉంటారు. భగవానుడు మాత్రమే సర్వోన్నతుడు. అందువల్ల, జీవాత్మలు తమ కోసం తాము ఉనికిలో లేరు; భగవానుడి కోసమే ఉన్నారు. ఆయనే మనకు పరమాశ్రయం, రక్షకుడు.

అనన్య శరణత్వ ప్రతిసమ్బన్ధి  పెరుమాళ్ అమైత్త ఇరుక్కై. 

అనన్య శరణత్వం అంటే భగవానుడిని తప్ప మరెవరినీ రక్షకునిగా భావించకపోవడం. ప్రతిసంబంధి అంటే స్వీకరించేవారు. ఎంపెరుమాన్ తన అభయహస్తాన్ని చూపిస్తూ, మన భయాలను తొలగిస్తానని తెలియజేస్తాడు. భగవానుడు మనలను తప్పక రక్షిస్తాడనే సంపూర్ణ విశ్వాసంతో మనం ఉన్నప్పుడు, ఆ విశ్వాసాన్ని స్వీకరించేది భగవానుడి దివ్యహస్తమే. ఆయన ‘మా శుచః’ (చింతించకు) అని అభయమిస్తాడు. శ్రీభగవద్గీత 18.66లో భగవానుడు “సర్వధర్మాన్ పరిత్యజ్య మామ్ ఏకమ్ శరణమ్ వ్రజ | అహమ్ త్వా సర్వపాపేభ్యో మోక్షయిశ్యామి మా శుచ: ||

అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్ను ఒక్కడినే శరణుగా పొందు. నేను నిన్ను సమస్త పాపాల నుండి విముక్తుడిని చేస్తాను. దుఃఖించకు. అనేక దివ్యదేశాలలో ఎంపెరుమాన్ యొక్క అరచేతిపై ‘మా శుచః’ అనే పదాలు చెక్కబడి ఉండటాన్ని చూడవచ్చు. దీనికి కారణం, ఆయన దివ్యహస్తాలే మన భయాలను తొలగించే కార్యాన్ని నిర్వహించడం. కాబట్టి, భగవానుడి దివ్యహస్తాలు అనన్య శరణత్వానికి ప్రతిసంబంధి. అంటే, ఆయన ఒక్కడినే రక్షకునిగా విశ్వసించే మన విశ్వాసాన్ని స్వీకరించేవి ఆయన దివ్యహస్తాలే.

ఆత్మావుక్కు స్వరూపమ్  అనన్య భోగత్వమ్ 

అనన్య భోగత్వం కూడా జీవాత్మ యొక్క మరొక స్వరూపం. అనన్య భోగత్వం అంటే భగవానుడిని తప్ప మరేదానినీ నిజమైన భోగ్యవస్తువుగా భావించకపోవడం. అంటే, భగవానుడే మనకు ఆనందాన్ని ఇచ్చే ఏకైక పరమభోగ్యుడు. నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 5.1.8లో: “శేలేయ్ కణ్ణియరుమ్ పెరుమ్ శెల్వముమ్ నన్మక్కళుమ్ మేలాత్తాయ్ తన్దైయుమ్ అవరే ఇని ఆవారే” అని సాయించారు. ఈ పాశురంలో నమ్మాళ్వార్, అందమైన కన్నులు కలిగిన స్త్రీలు, గొప్ప సంపద, సత్పుత్రులు, ఉన్నతులైన తల్లిదండ్రులు- వీటన్నింటికీ ఎంపెరుమానే రూపమవుతాడని తెలియజేస్తున్నారు. అంటే, “నాకు అన్నీ ఎంపెరుమానే” అని భావం. ప్రాపంచిక సంబంధాల ద్వారా మనిషి పొందే ఆనందాన్నే ఆళ్వార్ ఎంపెరుమాన్ ద్వారా పొందుతున్నారని దీని ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా, ఆళవందార్లు నమ్మాళ్వార్లని “మాతా పితా యువతయ స్తనయా విభూతి: సర్వం యదేవ నియమేన మదన్వయానామ్ ఆద్యస్యన: కులపతే ర్వకుళాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళమ్ ప్రణమామి మూర్ధ్నా ” అని కీర్తించారు. “నమ్మాళ్వార్ యొక్క దివ్యపాదాలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ దివ్యపాదాలే నాకు తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, సంపద మొదలైన సర్వమూ. వారు మన శ్రీవైష్ణవ సమాజానికి నాయకులు. మగిళ పుష్పాలతో అలంకరించబడి, ఎల్లప్పుడూ ప్రకాశించే ఆ దివ్యపాదాలకు నేను నమస్కరిస్తున్నాను.” ఆళవందార్లు, నమ్మాళ్వారే తమకు తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, సంపద మొదలైన సర్వమూ అని తెలియజేస్తున్నారు.

ఆనందం కోసం మనం ప్రాపంచిక వస్తువుల వైపు చూడవలసిన అవసరం లేదని ఆచార్యులందరూ తెలియజేస్తున్నారు. భగవానుడి నుండే మనకు సమస్త ఆనందమూ లభిస్తుంది. భగవానుడు మనకు ఇచ్చే ఆనందం, ఇతర ఆనందాలన్నింటికంటే ఎంతో ఉన్నతమైనది. ఉదాహరణకు, మనకు 10 రూపాయలు అవసరమైనప్పుడు, ఎవరైనా 10,000 రూపాయలు ఇస్తానని చెబితే, మనకు 10 రూపాయలు రాలేదని దుఃఖించము కదా! అలాగే, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి మొదలైన సంబంధాల ద్వారా పొందే ఆనందం, భగవానుడి ద్వారా పొందే ఆనందంతో పోలిస్తే చాలా స్వల్పమైనది. నిజానికి, ప్రాపంచిక వస్తువులలో లభించే ఆనందమంతా భగవానుడి అనంతమైన ఆనందంలో ఇమిడి ఉంటుంది.

ఏతత్ప్రకాశకమ్  నారాయణ పదమ్; 

నారాయణ అనే పదం భగవానుడు మనకు సమస్త ఆనందాన్ని ప్రసాదిస్తాడని తెలియజేస్తుంది. నారాయణుడు అంటే సమస్త దివ్యగుణాలు, శుభత్వం, సంపదలను కలిగి ఉన్నవాడు. కాబట్టి, నారాయణ అనే పదం అనన్య భోగత్వాన్ని ప్రకాశింపజేస్తుంది.

అనన్య భోగత్వ ప్రతిసమ్బన్ధి  పెరుమాళ్ తిరుముఱువల్. 

భగవానుడు తన ‘పున్మురువల్’ (ముఖంపై కనిపించే దివ్యమందహాసం) ద్వారా మనకు సమస్త ఆనందాలను ప్రసాదిస్తానని తెలియజేస్తాడు. ఆ దివ్యమందహాసమే అనన్య భోగత్వానికి ప్రతిసంబంధి, అంటే దానికి ప్రతిస్పందన. కులశేఖర ఆళ్వార్ పెరుమాళ్ పెరుమాళ్ తిరుమొళి 4.9లో “పడియాయ్ క్కిడన్దు ఉన్ పవళవాయ్ కాణ్బేనే” అంటారు. ఎంపెరుమాన్ యొక్క పగడంలాంటి ఎర్రని నోటిపై కనిపించే దివ్యమందహాసాన్ని దర్శించి ఆనందించడానికి, తాను ఒక మెట్టులా పడి ఉండాలని ఆళ్వార్ కోరుకుంటున్నారు. అంటే, అచేతన వస్తువులా ఉండాలని కోరుకున్నప్పటికీ, ఎంపెరుమాన్ యొక్క చిరునవ్వును అనుభవించగల జ్ఞానం తనకు ఉండాలని కోరుతున్నారు.

జీవాత్మ అచిత్తువత్ పారతంత్ర్యాన్ని కలిగి ఉంటుంది. అంటే, ఒక అచేతన వస్తువు వలె పూర్తిగా పరాధీనంగా ఉండటం. ఎంపెరుమాన్ ముఖంపై కనిపించే దివ్యమందహాసం ఈ పరాధీనతను ప్రకాశింపజేసి, దానిని ధృవీకరిస్తుంది.

ఇదుక్కు క్కరుత్తు తానఱిగై; చైతన్యమఱుగై; సాధనాన్తరమ్ అఱుగై

తానఱిగై : తనను తాను తెలుసుకోవడం. ఆత్మకు చైతన్యం ఉంటుంది. ఈ చైతన్యం యొక్క ముఖ్యమైన ప్రయోజనం, ఆత్మ భగవానుడికి సేవకుడని తెలుసుకోవడం. ఈ విషయాన్ని ప్రణవం ద్వారా తెలుసుకుంటాము. ప్రణవం యొక్క ఉద్దేశం జీవాత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేయడమే.

చైతన్యమఱుగై: మనలను మనమే రక్షించుకోగలమనే భావనను తొలగించుకోవడం.

ఈ తత్త్వాన్ని ‘నమః’ అనే పదం తెలియజేస్తుంది. మనలను మనమే రక్షించుకునే శక్తి మనకు లేదని నమః బోధిస్తుంది. ఒకవేళ మనకు ఆ శక్తి ఉన్నప్పటికీ, మనలను మనమే రక్షించుకోకూడదు. ఎందుకంటే, సేవకుడిని రక్షించవలసినవాడు యజమాని మాత్రమే. సేవకులమైన మనకు ఆ పని చేసుకునే అర్హత లేదు.

సాధనాన్తరమఱుగై: భగవానుడు తప్ప మరొక సాధనం మనకు లేదని అర్థం.

మన పరమప్రయోజనం భగవానుడికి కైంకర్యం చేయడమే. స్వర్గసుఖాలు, ప్రాపంచిక భోగాలు లేదా కైవల్యాన్ని అనుభవించాలనే కోరికలను పూర్తిగా విడిచిపెట్టి, ఈ లక్ష్యాన్ని తప్ప మరే ఇతర ఆలోచననూ కలిగి ఉండకూడదు. నారాయణ అనే పదమే ఇతర భోగాలన్నింటినీ విడిచిపెట్టాలని తెలియజేస్తుంది.

అదావదు  వేరఱుగై, వ్యాపారాన్తరమ్ అఱుగై, విషయాన్తరమ్ అఱుగై. 

ఇదే విషయాన్ని ఇప్పుడు మరో విధంగా వివరిస్తున్నారు.

గతంలో తానఱిగై, చైతన్యమఱుగై, సాధనాంతరమఱుగై అని వివరించబడింది. అంటే, భగవానుడికి సేవకుడిగా తన స్వరూపాన్ని తెలుసుకోవడం, తనను తాను రక్షించుకునే హక్కును విడిచిపెట్టడం, భగవానుడినే ఏకైక రక్షకునిగా అంగీకరించడం. ఈ జ్ఞానం ద్వారా, నారాయణాయ అనే పదం భగవానుడికి కైంకర్యం చేయడం తప్ప మనకు మరొక ప్రయోజనం లేదని తెలియజేస్తుంది.

వేరఱుగై

జీవాత్మకు అహంకారం, మమకారం అనే రెండు దోషాలు ఉంటాయి.

అహంకారం అంటే శరీరమే ఆత్మ అని భావించడం.

మమకారం అంటే ఆత్మ స్వతంత్రమైనదని, సమస్తమూ తనకే చెందుతాయని భావించడం.

ఈ భావనలను తొలగించుకోవడమే ‘వేరఱుగై’.

అహంకారం, మమకారం తప్పు ప్రవర్తనకు దారితీస్తాయి. కాబట్టి, మనం శరీరం కాదు, ఆత్మ అని; మనం స్వతంత్రులం కాదు, భగవానుడికి సేవకులమని సరిగ్గా తెలుసుకోవాలి. ఈ విషయాన్నే ప్రణవం స్పష్టంగా తెలియజేస్తుంది.

వ్యాపారాన్తరమ్ అఱుగై

వ్యాపారాంతరం అంటే ఇతర కార్యాలు లేదా ప్రయత్నాలు.

మనలను మనమే రక్షించుకోవడానికి ప్రయత్నించాలనే ఆలోచనను విడిచిపెట్టాలి. దీనిని ‘నమః’ అనే పదం తెలియజేస్తుంది.

విషయాన్తరమ్ అఱుగై

భగవానుడిని తప్ప మిగిలిన అన్ని విషయాలు, వస్తువులు ఇతర విషయాలే.

భగవానుడిని అనుభవించడం, ఆయనకు కైంకర్యం చేయడం మన పరమలక్ష్యం. పంచభూత మయమైన ప్రకృతి సంబంధమైన సంపద, భూమి మొదలైన వస్తువులను అనుభవించాలనే ఆసక్తి నుండి దూరంగా ఉండాలి. ఈ విషయాన్ని నారాయణ అనే పదం ద్వారా తెలుసుకుంటాము.

ఈ విధంగా, తిరుమంత్రంలోని మూడు అంశాలైన ప్రమాణం, ప్రమేయం, ప్రమాతలను ఈ వార్థైలో వివరించారు.

ప్రణవం ప్రమాణంగా పనిచేసి, జీవాత్మ యొక్క నిజమైన స్వరూపం గురించి జ్ఞానాన్ని అందిస్తుంది.

‘నమః’ అనే పదం ప్రమేయాన్ని సూచిస్తుంది. అంటే, మనలను రక్షించవలసినవాడు భగవానుడు ఒక్కడే అని తెలియజేస్తుంది.

చివరగా, ‘నారాయణాయ’ అనే పదం ప్రమాతను సూచిస్తూ, ఎంపెరుమాన్ యొక్క స్వరూపాన్ని తెలియజేస్తుంది.

వార్తై 36

తిరుమన్త్రమ్ స్వరూపమ్ శొల్లుగిఱదు  ఎన్ఱు తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ అనుసన్ధిత్తు అరుళువర్; తిరుమన్త్రమ్ ప్రాప్యమ్ శొల్లుగిఱదు ఎన్ఱు పిళ్ళై తిరునఱైయూర్ అరైయర్ అనుసన్ధిత్తు అరుళువర్; ఇవ్వాత్మావినుడైయ అనన్యార్హత్వమ్ శొల్లుగిఱదు ఎన్ఱు నఞ్జీయర్ అనుసన్ధిత్తు అరుళువర్; ఇవ్వాత్మావినుడైయ పారతన్త్ర్యమ్ శొల్లుగిఱదు ఎన్ఱు ఎమ్బార్ అనుసన్ధిత్తు అరుళువర్; తిరుమన్త్రమ్ మూన్ఱు పదత్తాలుమ్  జ్ఞాన వైరాగ్య భక్తిగళై వెళియిడుగిఱదు ఎన్ఱు ముదలియార్ అనుసన్ధిత్తు అరుళువర్;

తిరుమన్త్రమ్ మూన్ఱు పదత్తాలుమ్ అభిజన విద్యా వృత్తఙ్గళై  వెళియిడుకిఱతెన్ఱు ఆళవన్దార్ అనుసన్ధిత్తు అరుళువర్; తిరుమన్త్రమ్ అర్థపఞ్చకత్తైయుమ్ శొల్లుగిఱదెన్ఱు నమ్పిళ్ళై అనుసన్ధిత్తు అరుళువర్; చతుర్థి పాణిగ్రహణముమ్ ఉడన్ మణ నీరుమ్ కలవియుమ్ శొల్లుగిఱదెన్ఱు పిళ్ళై యుఱఙ్గావిల్లి దాసర్ అనుసన్ధిత్తు అరుళువర్

స్వరూపత్తిల్ ఉణర్తియైయుమ్, స్వరక్షణత్తిల్ అశక్తియైయుమ్, ఎమ్పెరుమానై పేణుగైయైయుమ్ శోల్లు గిఱదెన్ఱు ముదలియాణ్డాన్ అనుసన్ధిత్తు అరుళువర్.

మన ఆచార్యులు ఒకే విషయానికి వివిధ అర్థాలను తెలియజేశారు. ఏదైనా ఒక అర్థం సంప్రదాయానికి విరుద్ధంగా ఉంటే, దానిని తిరస్కరించవచ్చు. అయితే, మన ఆచార్యులు ఎన్నడూ సంప్రదాయానికి విరుద్ధమైన వ్యాఖ్యానాలను చేయలేదు. వారు ఒకే విషయాన్ని వివిధ కోణాలలో పరిశీలించి, మనం ఆనందించడానికి వీలుగా అందమైన అర్థాలను వివరించారు. మన ఆచార్యులు ఒకరి భావానికి మరొకరి భావం విరుద్ధం కాకుండా, తిరుమంత్రంలో అనేక అర్థాలను తెలియజేశారు.

తిరుమన్త్రమ్ స్వరూపమ్ శొల్లుగిఱదు ఎన్ఱు తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ అనుసన్ధిత్తు అరుళువర్

భగవద్ రామానుజుల జ్ఞానపుత్రుడైన తిరుక్కురుగైపిరాన్ పిళ్ళాన్ స్వామివారు తిరుమంత్రం జీవాత్మ స్వరూపాన్ని తెలియజేస్తుందని అనుగ్రహించారు.

(వారు భగవద్ రామానుజుల కుమారుని వలె వారి పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉండేవారు. గొప్ప జ్ఞానవంతులైనందున, భగవద్ రామానుజులచే ‘జ్ఞానపుత్రుడు’ అని పిలువబడ్డారు.  తిరుక్కురుగైపిరాన్ పిళ్ళాన్ స్వామివారు తిరువాయ్మొళికి 6000 పడి వ్యాఖ్యానాన్ని కూడా అనుగ్రహించారు.)

అనుసన్ధిత్తు అరుళువర్ – ఈ సత్యాలను లోతుగా మననం చేసి, ఇతరుల ప్రయోజనం కోసం వాటిని ఉపదేశించారు.

ముముక్షుప్పడి లో పిళ్ళై లోకాచార్య స్వామివారు తిరుమంత్రం క్రింది విషయాలను తెలియజేస్తుందని వివరించారు:

  • జీవాత్మ స్వరూపం, ఆ స్వరూపానికి తగిన ఫలితం.
  • శేషత్వం, పారతంత్ర్యం, కైంకర్యం.

(జీవాత్మకు మూడు రకాల స్వరూపాలు ఉన్నాయి, అనన్యార్హ శేషత్వం, అనన్య శరణత్వమ్, అనన్య భోగ్యత్వమ్. ప్రణవం, నమః, నారాయణాయ అనే మూడు పదాల ద్వారా జీవాత్మ స్వరూపాన్ని తెలియజేయడమే తిరుమంత్రం యొక్క ఉద్దేశం. ఈ మూడు పదాలు మూడు అర్థాలను తెలియజేస్తాయి.)

(పిళ్ళై తిరునఱైయూర్ అరైయర్ స్వామివారి గురించి శ్రీవచన భూషణంలోని 80వ సూత్రంలో ఇలా చెప్పబడింది:

“ఉపాయత్తుక్కు పిరాట్టియైయుమ్, ద్రౌపదియైయుమ్, తిరుక్కణ్ణమఙ్గై ఆణ్డానైయుమ్ పోలే ఇరుక్క వేణుమ్. ఉపేయత్తుక్కు ఇళైయపెరుమాళైయుమ్, పెరియ ఉడైయారైయుమ్, పిళ్ళై తిరునఱైయూర్ అరైయరైయుమ్, చిన్తయన్తియైయుమ్ పోలే ఇరుక్క వేణుమ్”

ఉపాయ విషయంలో శ్రీ మహాలక్ష్మి, ద్రౌపది, తిరుక్కణ్ణమంగై ఆణ్డాన్ వలె ఉండాలి. ఉపేయ విషయంలో ఇళయపెరుమాళ్, పెరియ ఉడైయార్, పిళ్ళై తిరునఱైయూర్ అరైయర్, చింతయంతి అనే గోపిక వలె ఉండాలి.)

ఈ సూత్రం ఉపాయాన్ని, ఉపేయాన్ని అర్థం చేసుకున్నవారు ఎలా ప్రవర్తిస్తారో ఉదాహరణలతో తెలియజేస్తుంది.

పిళ్ళై తిరునఱైయూర్ అరైయర్ స్వామివారు శ్రీరంగానికి సమీపంలోని తొట్టియం తిరునారాయణపురంలో నివసించేవారు. వారు తమ కుటుంబంతో కలిసి ఎంపెరుమాన్‌కు మంగళాశాసనం చేసేవారు.

ఆ సమయంలో, ఇతర మతాలకు చెందిన కొందరు వ్యక్తులు ఆలయానికి నిప్పు పెట్టారు. దాంతో ఎంపెరుమాన్ దివ్యమంగళ విగ్రహానికి అగ్ని ప్రమాదం సంభవించే పరిస్థితి ఏర్పడింది. వెంటనే పిళ్ళై తిరునఱైయూర్ అరైయర్ స్వామివారు పెరుమాళ్‌ను రక్షించడానికి ఆయనను కౌగిలించుకున్నారు. ఈ ప్రయత్నంలో వారు తమ ప్రాణాలను కోల్పోయారు. తమ తండ్రిని రక్షించడానికి ఆయనను కౌగిలించుకున్న వారి పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు.

శాస్త్రంలో భగవద్విషయంలో నిమగ్నులై ఉండగా ప్రాణాలు విడిచినవారు మోక్షాన్ని పొందుతారని చెప్పబడింది. అలాంటి చర్యను ఒక ఉపాయంగా పరిగణించే అవకాశం ఉంది.

అయితే, పిళ్ళై తిరునఱైయూర్ అరైయర్ స్వామివారు మోక్షాన్ని పొందడానికి ఉపాయంగా భావించి ఈ కార్యాన్ని చేశారా అనే ప్రశ్న తలెత్తుతుంది.

దీనికి పిళ్ళై లోకాచార్య స్వామివారు సమాధానమిస్తూ, పిళ్ళై తిరునఱైయూర్ అరైయర్ స్వామివారు ఈ కార్యాన్ని కేవలం ప్రేమతోనే చేశారని వివరిస్తారు. ఎందుకంటే, ఎంపెరుమాన్ దివ్యమంగళ విగ్రహానికి ఏదైనా అపాయం కలగడాన్ని భక్తులు సహించలేరు.

శాస్త్రంలో ఒక కార్యాన్ని ఉపాయంగా చెప్పినందున, దానిని ఉపాయంగా భావించి ఆచరించకుండా ఉండటానికి బదులుగా, ఎంపెరుమాన్‌ను రక్షించడానికి భక్తుడు తన ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడతాడు.

మనం ఆ కార్యాన్ని చేయకుండా ఆగిపోతే, అది భక్తిలో ప్రాథమిక దశలో ఉన్నట్లవుతుంది. కానీ భక్తిలో ఉన్నత స్థాయికి చేరుకున్నవారు, “ఎంపెరుమాన్ దివ్యమంగళ విగ్రహానికి ప్రమాదం కలుగుతోంది. నా ప్రాణాలు పోయినా సరే, ఆయనను రక్షించడానికి నేను కార్యాచరణ చేయాలి” అని భావిస్తారు.]

తిరుమన్త్రమ్ ప్రాప్యమ్ శొల్లుగిఱదు ఎన్ఱు పిళ్ళై తిరునఱైయూర్ అరైయర్ అనుసన్ధిత్తు అరుళువర్

ప్రాప్యం అంటే ఉపేయం, అనగా చేరుకోవలసిన అంతిమ లక్ష్యం. ఆ లక్ష్యం ఎంపెరుమాన్‌ను చేరుకొని ఆయనకు కైంకర్యం చేయడం. ఈ విషయాన్ని తిరుమంత్రం అద్భుతంగా వివరిస్తుంది.

పిళ్ళై తిరునఱైయూర్ అరైయర్ స్వామివారు ఎల్లప్పుడూ ఎంపెరుమాన్‌ను ఎలా రక్షించాలి, ఆయనకు ఎలా సేవ చేయాలి అనే విషయాలనే మననం చేసేవారు. వారి మనస్సు నిరంతరం కైంకర్యంలో నిమగ్నమై ఉండేది. అందువల్ల, ఈ ప్రాప్యం తిరుమంత్రంలో తెలియజేయబడిందని వారు వివరించారు. తిరుమంత్రంలోని నారాయణ పదం, నారాయణునికి కైంకర్యం చేయడమే మన అంతిమ లక్ష్యమని తెలియజేస్తుంది. (ప్రాప్యం అనే ఇదే భావం శ్రీవచన భూషణంలో కూడా వివరించబడిందని మనం ఇంతకుముందు చూశాము. అక్కడ ప్రాప్యం విషయంలో తిరుకణ్ణమన్గై ఆణ్డాన్ స్వామివారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పబడింది. వేర్వేరు గ్రంథాలలో ఇదే భావాన్ని చూడటం ద్వారా, ఈ విషయాలలో మన ఆచార్యుల ఆలోచనలు ఎంత అద్భుతంగా సమన్వయంతో ఉన్నాయో మనం ఆస్వాదించవచ్చు.)

ఇవ్వాత్మావినుడైయ అనన్యార్హత్వమ్ శొల్లుగిఱదు ఎన్ఱు నఞ్జీయర్ అనుసన్ధిత్తు అరుళువర్;

గతంలో మాధవాచార్యులుగా ప్రసిద్ధి చెందిన నంజీయర్ స్వామివారు, పరాశర భట్టర్ స్వామివారిచే సంస్కరించబడక ముందు మరొక సిద్ధాంతాన్ని అనుసరించేవారు. పరాశర భట్టర్ స్వామివారిచే సంస్కరించబడిన తరువాత, ఆయన శిష్యులై సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. పరాశర భట్టర్ తరువాత ఆచార్య పరంపరలో తదుపరి ఆచార్యులుగా వెలుగొందారు.

నంజీయర్ స్వామివారు, జీవాత్మ భగవానునికి తప్ప మరెవరికీ చెందినది కాదనే విషయాన్ని తిరుమంత్రం స్థాపిస్తుందని అనుగ్రహించారు.

వేర్వేరు ఆచార్యులు తిరుమంత్రంలో అనేక అర్థాలను గుర్తించి ఆనందించినప్పటికీ, అందులోని అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి జీవాత్మ కేవలం భగవానుని కోసమే ఉనికిలో ఉంటుందనేది.

ఇక్కడ అర్హత్వం అంటే ఒకరికి అర్హమైనదిగా లేదా చెందినదిగా ఉండటం. అనన్య అర్హత్వం అంటే భగవానునికి మాత్రమే చెందడం; మరెవరికీ చెందకపోవడం.

ఇవ్వాత్మావినుడైయ పారతన్త్ర్యమ్ శొల్లుగిఱదు ఎన్ఱు ఎమ్బార్ అనుసన్ధిత్తు అరుళువర్

జీవాత్మ యొక్క పారతంత్ర్య స్వరూపాన్ని తిరుమంత్రం వివరిస్తుందని ఎంబార్ స్వామివారు అనుగ్రహించారు. అంటే, జీవాత్మ ఒకరికి మాత్రమే చెందుతూ, పూర్తిగా ఆయన ఇష్టానుసారంగా నడుచుకోవడం దాని సహజ స్వరూపం.

[పారతంత్ర్యానికి భరతాళ్వాన్ ఒక గొప్ప ఉదాహరణ. ముముక్షుప్పడిలో తిరుమంత్రం అర్థాన్ని వివరిస్తూ, ప్రణవంలో శేషత్వం, నమఃలో పారతంత్ర్యం, నారాయణాయలో కైంకర్యం తెలియజేయబడతాయని చెప్పబడింది.]

తిరుమన్త్రమ్ మూన్ఱు పదత్తాలుమ్  జ్ఞాన వైరాగ్య భక్తిగళై వెళియిడుగిఱదు ఎన్ఱు ముదలియార్ అనుసన్ధిత్తు అరుళువర్

ఇక్కడ ముదలియార్  అంటే అత్యున్నత జ్ఞానం కలిగినవారిగా గౌరవించబడే వ్యక్తి. మన సంప్రదాయంలో శ్రీమన్నాథమునులు పెరియ ముదలియార్  అని ప్రసిద్ధి చెందారు. ఇక్కడ ముదలియార్  అనే పదం నాథమునులను సూచిస్తుంది. నాథమునులు స్వామివారి ప్రకారం, తిరుమంత్రంలోని మూడు పదాలు జ్ఞానం, వైరాగ్యం, భక్తిని తెలియజేస్తాయి. జ్ఞానం అంటే జీవాత్మ భగవానునికి దాసుడనే జ్ఞానం. దీనినే శేషత్వ జ్ఞానం అంటారు. ఈ జ్ఞానం ప్రణవంలో తెలియజేయబడుతుంది. ప్రణవంలోని అకారం పరమాత్మను సూచిస్తుంది. ఉకారం అనన్యార్హత్వాన్ని తెలియజేస్తుంది. ఆయకారం కైంకర్యాన్ని సూచిస్తుంది. మకారం జీవాత్మను సూచిస్తుంది. జీవాత్మ పరమాత్మకు మాత్రమే చెందుతుందనే జ్ఞానం ప్రణవంలో వివరించబడుతుంది.

వైరాగ్యం అంటే ప్రాపంచిక విషయాలపై ఆసక్తి లేకుండా ఉండటం, భగవానునిపై మాత్రమే సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండటం. అంటే, భగవానుడే మనకు ఏకైక రక్షకుడని విశ్వసించడం.

కూరత్తాళ్వాన్ స్వామివారు ఎంపెరుమాన్‌ను ఎన్నడూ ఏదీ అడగని మహనీయులుగా ప్రసిద్ధి చెందారు. కష్టాలు ఎదురైనప్పుడు కూడా, అవి గత కర్మల ఫలితమని, ఎంపెరుమానే వాటిని మనకు ప్రసాదించినందున వాటిని సహించాల్సిందేనని భావించేవారు.

వారి పిల్లలు వివాహ వయస్సుకు వచ్చినప్పుడు, వారికి మంచి భార్యలు లభించేలా ఎంపెరుమాన్‌ను ప్రార్థించమని వారి భార్య కోరారు. అందుకు కూరత్తాళ్వాన్ స్వామివారు, “ఎంపెరుమాన్ ఆస్తి గురించి మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మన పిల్లలు ఆయన ఆస్తి. కాబట్టి ఆయనే అన్నీ చూసుకుంటారు” అని సమాధానమిచ్చారు.

ఎంపెరుమాన్ తన సంతానాన్ని రక్షిస్తాడని, వారిని ఎన్నడూ విడిచిపెట్టడని వారికి సంపూర్ణ విశ్వాసం ఉండేది.

నమః అనే పదం మనమందరం రక్షించబడవలసినవారమని, భగవానుడు మాత్రమే రక్షకుడని తెలియజేస్తుంది. అందువల్ల, నమః పదం వైరాగ్యాన్ని తెలియజేస్తుందని చెప్పబడింది.

భక్తి ఎంతో ముఖ్యమైనది. దాని ప్రాముఖ్యత నారాయణాయ అనే పదంలో వివరించబడుతుంది. ఇందులోని ‘ఆయ’ ప్రత్యయం కైంకర్యాన్ని సూచిస్తుంది.

కైంకర్యం చేయాలంటే మనకు దానిపై కోరిక, భక్తి ఉండాలి. మన సంప్రదాయంలో కైంకర్యం చేయాలనే కోరికనే భక్తిగా బోధిస్తారు.

ఈ విధంగా, ప్రణవం, నమః, నారాయణాయ అనే మూడు పదాల ద్వారా వరుసగా జ్ఞానం, వైరాగ్యం, భక్తి తెలియజేయబడతాయి.

తిరుమన్త్రమ్ మూన్ఱు పదత్తాలుమ్ అభిజన విద్యా వృత్తఙ్గళై  వెళియిడుకిఱతెన్ఱు ఆళవన్దార్ అనుసన్ధిత్తు అరుళువర్ 

యామునాచార్యులుగా ప్రసిద్ధి చెందిన ఆళవందార్ స్వామివారు తిరుమంత్రాన్ని మననం చేస్తూ, దాని మూడు పదాలు మూడు గుణాలను తెలియజేస్తాయని వివరించారు. అవి, అభిజన అంటే ఉన్నత వంశంలో జన్మించడం, విద్య అనగా ఉన్నతమైన జ్ఞానం, వృత్తం అంటే సత్ప్రవర్తన.

ఆళవందార్ స్వామివారి ప్రకారం, ఈ మూడు లక్షణాలు తిరుమంత్రంలో అంతర్లీనంగా తెలియజేయబడుతున్నాయి.

పరమాత్మ అయిన భగవానుడు అకారంతో, జీవాత్మ మకారంతో సూచించబడతారు. వీరిద్దరి మధ్య నవవిధ సంబంధం, అంటే తొమ్మిది రకాల సంబంధాలు ఉన్నాయని చెప్పబడింది.

ఈ తొమ్మిది సంబంధాలను పిళ్ళై లోకాచార్య స్వామివారు ఈ శ్లోకంలో వివరించారు:

“పితాచ రక్షకశ్శేషీ భర్తాజ్ఞేయో రమాపతిః | స్వామ్యాధారో మమ ఆత్మా చ భోక్తాచాద్యమనూదితః”

ఈ సంబంధాలలో పితా–పుత్ర సంబంధం కూడా ఒక ముఖ్యమైన సంబంధంగా చెప్పబడింది. అభిజన – భగవానుని సంతానంగా ఉండటాన్ని మించిన ఉన్నత వంశం మరొకటి లేదు. ఒక వ్యక్తి రాజు కుమారుడైతే, ఆ రాజకుమారునికి ఎంతో గర్వం ఉంటుంది. అదేవిధంగా, జీవాత్మలందరూ భగవానుని బిడ్డలుగా ఉన్నందున, ఈ సంబంధాన్ని “అభిజన” అని పేర్కొన్నారు. విద్య- భగవానుడే మనకు ఉపాయమని తెలుసుకోవడమే అత్యున్నత జ్ఞానం. ఈ పరమ జ్ఞానం ‘నమః’ అనే పదంలో నిక్షిప్తమై ఉంది. నమః అనే పదం భగవానుడే మనకు ఏకైక ఉపాయమని, మరే ఇతర విషయాన్నీ ఉపాయంగా అంగీకరించకూడదని తెలియజేస్తుంది.

వృత్తం – మనం చేసే పనులన్నీ కైంకర్య రూపంలోనే చేయాలి. ఈ విషయాన్ని ‘నారాయణాయ’ అనే పదం తెలియజేస్తుంది. నారాయణాయ అనే పదం కైంకర్యాన్ని భగవానునికి మాత్రమే చేయాలని సూచిస్తుంది.

ఈ విధంగా, ప్రణవం, నమః, నారాయణాయ అనే మూడు పదాలు వరుసగా అభిజాత్యాన్ని (ఉన్నతమైన జన్మ), విద్యను (భగవానుడే మనకు రక్షకుడనే జ్ఞానం), వృత్తాన్ని (ప్రతిదానినీ భగవానునికి కైంకర్యంగా చేయడం) తెలియజేస్తాయి.

ఇవన్నీ ఆళవందార్ స్వామివారు అనుగ్రహించిన అర్థాలు.

తిరుమన్త్రమ్ అర్థపఞ్చకత్తైయుమ్ శొల్లుగిఱదు ఎన్ఱు నమ్పిళ్ళై అనుసన్ధిత్తు అరుళువర్

తిరుమంత్రం అర్థపంచకాన్ని తెలియజేస్తుందని నంపిళ్ళై స్వామివారు అనుగ్రహించారు.

ముముక్షుప్పడి 22వ సూత్రంలో కూడా ఇదే విషయం వివరించబడింది:

“అఱియ వేణ్డుమ్ అర్థమెల్లామ్ ఇదుక్కుళ్ళే ఉణ్డు”

మనము తెలుసుకోవలసిన సమస్త రహస్యార్థాలు ఇందులోనే ఉన్నాయి.

ఒక ముముక్షువు తెలుసుకోవలసిన ఐదు ముఖ్యమైన అర్థాలు ఇవి:

  1. పరమాత్మ స్వరూపం – పరమాత్మ స్వరూపం.
  2. జీవాత్మ స్వరూపం – జీవాత్మ స్వరూపం.
  3. ఉపాయ స్వరూపం – జీవాత్మ పరమాత్మను చేరుకోవడానికి ఉపయోగపడే ఉపాయం యొక్క స్వరూపం.
  4. ఉపేయ స్వరూపం – పరమాత్మను చేరుకున్న తరువాత జీవాత్మ చేయవలసిన కార్యం లేదా చేరుకోవలసిన లక్ష్యం.
  5. విరోధి స్వరూపం – జీవాత్మ తన అంతిమ లక్ష్యాన్ని సాధించకుండా అడ్డుకునే అవరోధాల స్వరూపం.

మనం తెలుసుకోవలసిన సమస్త విషయాలు ఈ ఐదు అంశాలలో ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ తిరుమంత్రంలో ఉన్నాయి.

మకారం జీవాత్మ స్వరూపాన్ని వివరిస్తుంది. అకారం పరమాత్మ స్వరూపాన్ని వివరిస్తుంది. నమః అనే పదం ఉపాయ స్వరూపాన్ని, విరోధి స్వరూపాన్ని తెలియజేస్తుంది. నారాయణాయ అనే పదం ఫల స్వరూపాన్ని వివరిస్తుంది.

ఈ సందర్భంలో ఈ విషయాలను గుర్తుంచుకోవచ్చు.

(వివిధ ఆచార్యుల అభిప్రాయాలను ఒకే గ్రంథమైన వార్తామాలైలో పిన్బళగియ పెరుమాళ్ జీయర్ స్వామివారు ఎంత అందంగా సంకలనం చేశారో గమనించడం ఎంతో ఆనందదాయకం. ఈ వార్తామాలై ద్వారా మనం ఆ భావాలన్నింటినీ ఆస్వాదించగలుగుతున్నాము)

పాణిగ్రహణముమ్ ఉడన్ మణ నీరుమ్ చతుర్థి కలవియుమ్ శొల్లుగిఱదు ఎన్ఱు పిళ్ళై ఉఱఙ్గావిల్లి దాసర్ అనుసన్ధిత్తు అరుళువర్

 పిళ్ళై ఉఱఙ్గావిల్లి దాసర్ స్వామివారు భగవద్ రామానుజుల అత్యంత ప్రియమైన శిష్యులలో ఒకరు. వారు మొదట ఒక రాజు ఆస్థానంలో మల్లయోధునిగా ఉండేవారు. తరువాత ఎంపెరుమానార్ వారిని సంస్కరించి తన శిష్యునిగా స్వీకరించారు.

పిళ్ళై ఉఱఙ్గావిల్లి దాసర్ స్వామి వారి దంపతులు ఎంపెరుమానార్ పట్ల ఎంతో అనురక్తిని కలిగి ఉండేవారు. ఎంపెరుమానారే తమకు సర్వస్వమని భావిస్తూ తమ జీవితమంతా గడిపారు. వారు అత్యున్నతమైన కైంకర్యపరులు.

తిరుమంత్రానికి సంబంధించిన అర్థాలను వారు ఎలా వివరించారో ఈ వాక్యం తెలియజేస్తుంది.

జీవాత్మలందరూ స్త్రీల వంటివారు. భగవానుడు మాత్రమే పురుషోత్తముడు. పురుషోత్తముడైన భగవానునికి, జీవాత్మకు మధ్య జరిగే వివాహమే తిరుమంత్రం.

ముముక్షుప్పడి లోని 113వ సూత్రంలో, “ఎట్టిళైయాయ్ మూన్ఱు శరడాయిరుప్పదొరు మఙ్గళ సూత్రమ్ పోలే తిరుమన్త్రమ్” అని చెప్పబడింది.

తిరుమంత్రం ఎనిమిది పోగులు, మూడు తాళ్లతో కూడిన మంగళసూత్రం వంటిది.

ఇక్కడ కూడా ఇదే భావం తెలియజేయబడింది.

తిరుమంత్రంలోని ప్రణవం పాణిగ్రహణాన్ని సూచిస్తుంది. పాణిగ్రహణం అంటే చేయి పట్టుకోవడం.

జీవాత్మకు, పరమాత్మకు మధ్య ఉన్న సంబంధాన్ని ప్రణవం స్పష్టంగా తెలియజేస్తుంది. అందువల్ల, ప్రణవం ద్వారా పాణిగ్రహణ భావాన్ని గ్రహించవచ్చు.

ఉడన్ మణ నీర్ – ఈ విషయాన్ని వివరించడానికి పుత్తూరు స్వామి వారు నాచ్చియార్ తిరుమొళి 6.10లోని పాశురాన్ని ఉదహరిస్తారు:

“మణనీర్ అఙ్గవనోడుమ్ ఉడన్ శెన్ఱు అఙ్గు ఆనైమేల్ మఞ్జనమాట్ట”

వివాహ సమయంలో తిరుమంజనం, అంటే పవిత్ర స్నానం చేయించడం జరుగుతుంది. ఇది వివాహ బంధం ఏర్పడిందని సూచిస్తుంది. ఇకపై వివాహమైన దంపతులు ఇతర ప్రత్యామ్నాయ ఆలోచనలకు తావివ్వకూడదు.

అదేవిధంగా, తిరుమంజనం జీవాత్మకు ఇతర ఉపాయాలేవీ లేవనే ఉపాయాంతర శున్యతని సూచిస్తుంది.

ఈ విషయాన్ని నమః అనే పదం తెలియజేస్తుంది. భగవానుడే ఏకైక ఉపాయమని, ఆయన తప్ప మరేదీ ఉపాయం కాదని ఈ పదం వివరిస్తుంది.

చతుర్థి కలవి  – ఇది స్త్రీపురుషుల కలయికను సూచిస్తుంది. ఈ భావం నారాయణాయ అనే పదంలో తెలియజేయబడుతుంది.

ప్రతివారు చేయవలసిన సేవ అయిన కైంకర్యాన్ని, నారాయణాయ అనే పదంలోని ‘ఆయ’ అనే చతుర్థీ విభక్తి సూచిస్తుంది.

ఈ కలయికలో పరమాత్మ, జీవాత్మ ఉంటారు. జీవాత్మ కైంకర్యాన్ని సమర్పిస్తుంది; పరమాత్మ ఆ కైంకర్యాన్ని స్వీకరిస్తారు.

స్వరూపత్తిల్ ఉణర్తియైయుమ్, స్వరక్షణత్తిల్ అశక్తియైయుమ్, ఎమ్పెరుమానై పేణుగైయైయుమ్ శోల్లు గిఱదెన్ఱు ముదలియాణ్డాన్ అనుసన్ధిత్తు అరుళువర్.

ఇది ముదలియాణ్డాన్ స్వామివారి అభిప్రాయం.

స్వరూపత్తిల్ ఉణర్తియైయుమ్– స్వరూపం  అంటే జీవాత్మ స్వరూపం. ఉణర్తి అంటే మనం పరమాత్మకు మాత్రమే దాసులమనే జ్ఞానం. ఈ జ్ఞానం ప్రణవంలో తెలియజేయబడుతుంది.

స్వరక్షణత్తిల్ అశక్తియైయుమ్– అంటే తనను తాను రక్షించుకోలేని అశక్తత. భగవానుడే ఏకైక రక్షకుడనే స్థితిని నమః అనే పదం తెలియజేస్తుంది.

ఎమ్పెరుమానై పేణుగైయైయుమ్ – ఎంపెరుమాన్ అవసరాలకు అనుగుణంగా ఆయనకు కైంకర్యం చేయడం, మంగళాశాసనం చేయడం నారాయణాయ అనే పదంలో తెలియజేయబడుతుంది.

ముదలియాణ్డాన్ స్వామివారు పై విషయాలను వివరించారు.

వార్తై 37

సారాంశం

  • జీవాత్మ ప్రకృతికి భిన్నమైనది. అది జ్ఞానస్వరూపంగా సూచించబడుతుంది.
  • అకారంలోని లుప్త చతుర్థీ ద్వారా జీవాత్మ యొక్క శేషత్వం తెలియజేయబడుతుంది.
  • జీవాత్మ అహంకారం, మమకారం లేకుండా ఉండాలి. ఈ విషయాన్ని నమః పదం తెలియజేస్తుంది.
  • నమః పదం విరోధిని, ఉపాయాన్ని తెలియజేస్తుంది.
  • అహంకారం, మమకారం తొలగిపోయిన తరువాత జీవాత్మ యొక్క స్వరూపం- భగవానునికి మాత్రమే పరతంత్రంగా ఉండటం.
  • భగవానుని దాసులకు దాసునిగా ఉండటమే అత్యున్నత స్థితి.
  • శరణాగతి చేయడం యొక్క లక్ష్యం భగవానునికి కైంకర్యం చేయడమే.
  • నారాయణ శబ్దం జీవాత్మ చేసే కైంకర్యానికి నారాయణుడే ప్రతిసంబంధి అని తెలియజేస్తుంది.
  • నారాయణాయ శబ్దం మనం చేసే కైంకర్యం ఆయనకు మాత్రమే చెందుతుందని తెలియజేస్తుంది.

వార్తై 37

ప్రకృతే: పరత్వమ్, ప్రకృతే: పరనుడైయ శేషత్వమ్, శేషత్వత్తినుడైయ అనన్యార్హతై, శేషభూతనుడైయ అహఙ్కార మమకార నివృత్తి, నివృత్తమాన స్వరూపత్తినుడైయ పారతన్త్ర్యమ్, పారతన్త్ర్య పరాకాష్ఠైయాన తదీయ శేషత్వమ్, పరతన్త్రనుక్కు అనురూపమాన ఉపాయమ్, ఉపాయ ఫలమాన కైఙ్కర్యమ్, కైఙ్కర్య ప్రతిసమ్బన్ధియైయుమ్ శొల్లుగిఱదు తిరుమన్త్రమ్.

వివరణ

ప్రకృతే: పరత్వమ్

ఇక్కడ జీవాత్మ స్వరూపం వివరించబడుతోంది. అంటే, జీవాత్మ ప్రకృతికి ఉన్నతమైనది లేదా ప్రకృతికి భిన్నమైనది.

‘పర’ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది, ‘అత్యున్నతమైనది’ అనే అర్థం. పరాపరన్, పరమన్ వంటి పదాలు పరమాత్మను సూచిస్తాయి. రెండవ అర్థం, ‘భిన్నమైనది’ అని.

జీవాత్మ ప్రకృతికి భిన్నమైనది. ప్రకృతి జ్ఞానం లేని అచిత్ పదార్థం కాగా, జీవాత్మ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల, జీవాత్మ ప్రకృతికంటే ఉన్నతమైనదని కూడా చెప్పవచ్చు.

ఈ విషయాన్ని తిరుమంత్రంలోని మకారం తెలియజేస్తుంది. మకారం జ్ఞానాన్ని కలిగిన జీవాత్మను సూచిస్తుంది. జ్ఞానస్వరూపమైన జీవాత్మను మకారం సూచించడం ద్వారా, జీవాత్మ ప్రకృతికి భిన్నమైనదని తెలియజేయబడుతోంది.

ప్రకృతే: పరనుడైయ శేషత్వమ్

జీవాత్మ ప్రకృతికి భిన్నమైనదని చూశాము. అయితే, కొన్నిసార్లు మనం మన శరీరమే ఆత్మ అని పొరబడతాము. మనం ఈ శరీరం కాదు; ఆత్మకు, శరీరానికి భేదం ఉంది. ఈ భేదాన్ని మనం స్పష్టంగా గుర్తించగలగాలి. ఇక్కడ మొదటగా వివరించబడే అంశం ఇదే.

అంతేకాకుండా, జీవాత్మ యొక్క శేషత్వం, అంటే పరమాత్మకు దాసునిగా ఉండే స్వభావం, నారాయణాయ అనే పదంలోని ‘ఆయ’ అనే ప్రత్యయం ద్వారా తెలుస్తుంది. ఈ ప్రత్యయం జీవాత్మ పరమాత్మకు దాసుడని తెలియజేస్తుంది.

శేషత్వత్తినుడైయ అనన్యార్హతై

అకారం, ఆయ అనే పదాలను పక్కపక్కన ఉంచి పరిశీలించవచ్చు.

‘ఆయ’ అనే ప్రత్యయం జీవాత్మ పరమాత్మకు దాసుడనే విషయాన్ని తెలియజేస్తుంది. అదే సమయంలో, జీవాత్మ పరమాత్మకు మాత్రమే దాసుడను అనే భావం, ప్రణవంలోని ఉకారంలో అంతర్లీనంగా ఉన్న ఏవకారం ద్వారా తెలుస్తుంది.

అహఙ్కార మమకార నివృత్తి, 

మనకు అహంకారం, మమకారం ఉండకూడదు.

అహంకారం అంటే ఈ శరీరమే ఆత్మ అని భావించడం. మమకారం అంటే మనం స్వతంత్రులమని భావించడం.

నమః అనే పదం యొక్క అర్థాన్ని గ్రహించడం ద్వారా ఈ రెండూ తొలగిపోతాయి. ఈ విధంగా, నమః అనే పదం విరోధిని, అంటే అవరోధాన్ని తొలగించడమే కాకుండా, భగవానుడే మనకు ఉపాయమని కూడా తెలియజేస్తుంది.

నమః అనే పదం ద్వారా అహంకార మమకారాల నివృత్తి ద్వారా అవరోధాలు తొలగడం తెలియజేయబడుతున్నాయి. 

నివృత్తమాన స్వరూపత్తినుడైయ పారతన్త్యమ్

అహంకారం, మమకారం తొలగిపోయిన తరువాత జీవాత్మకి తాను భగవానునికి మాత్రమే పూర్తిగా పరతంత్రంగా ఉండటం అనే నిజ స్వరూపం ప్రకాశిస్తుంది. ఈ విషయాన్ని కూడా నమః అనే పదం తెలియజేస్తుంది.

పారతన్త్ర్య పరాకాష్టైయాన తదీయ శేషత్వమ్,

భగవానునికి దాసునిగా ఉండటం ఒక స్థాయి. అయితే, భగవానుని దాసులకు దాసునిగా ఉండటమే అత్యున్నత స్థాయి.

ఇదే పరతంత్ర్యానికి పరాకాష్ఠ. ఈ అత్యున్నత స్థితిని కూడా నమః పదం తెలియజేస్తుంది.

భగవానుడు అని చెప్పినప్పుడు, ఆయన దాసులను కూడా ఏకకాలంలో సూచించినట్లే. ఉదాహరణకు, భగవానుడు తన దివ్యస్వరూపాన్ని ప్రకటించినప్పుడు, ఆయనతో పాటు నిత్యసూరులు, దివ్యమైన చక్రం, శంఖం, తన దివ్య వక్షస్థలంపై పిరాట్టి కూడా దర్శనమిస్తారు. భగవానుడు ఎల్లప్పుడూ తన దాసులతో కలిసి ఉంటాడనే విషయాన్ని ఆయన వెల్లడిస్తారు.

కాష్ఠై అంటే అత్యున్నత స్థాయి. కాబట్టి శేషత్వంలో అత్యున్నత స్థితి తదీయ శేషత్వం, అంటే భగవానుని దాసులకు దాసునిగా ఉండటం.

ఈ విషయాన్ని కూడా నమః పదం తెలియజేస్తుంది.

 పరతన్త్రనుక్కు అనురూపమాన ఉపాయమ్ఎల్లప్పుడూ భగవానునిపై ఆధారపడి ఉండే జీవాత్మకు తగిన ఉపాయం శరణాగతి.

ఈ విషయాన్ని కూడా నమః అనే పదం తెలియజేస్తుంది.

ఉపాయ పలమాన కైఙ్కర్యమ్

అంటే, మనం భగవానునికి శరణాగతి చేసినప్పుడు, ఆయనను ఏదైనా కోరుకోవచ్చు. అయినప్పటికీ, ఆయన దివ్యపాదాల వద్ద నిత్యకైంకర్యాన్ని ప్రసాదించమని కోరడం తప్ప, మరేదీ కోరుకోకూడదు.

ఈ కైంకర్యాన్ని తిరుమంత్రంలోని నారాయణాయ పదం తెలియజేస్తుంది. నారాయణాయ అనే పదం మనం భగవానునికి సంపూర్ణ దాసులమని, ఆయనకు మాత్రమే సేవ చేయాలని సూచిస్తుంది.

కైఙ్కర్య ప్రతిసమ్బన్ధియైయుమ్

ఇది కైంకర్యాన్ని స్వీకరించేవారిని సూచిస్తుంది. ఆ కైంకర్యాన్ని స్వీకరించేవారు నారాయణుడే. మనం కైంకర్యం చేసినప్పుడు, నారాయణుడే దానిని స్వీకరిస్తారు.

అంటే కాక, ‘నారాయణాయ’ అనే పదంలోని చతుర్థీ విభక్తి ప్రత్యయం, మనం ఆయన ప్రీతి కోసమే కైంకర్యం చేస్తామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.

శొల్లుగిఱదు తిరుమన్త్రమ్

ఈ విషయాలన్నింటినీ తిరుమంత్రం తెలియజేస్తుంది.

తదుపరి వ్యాసంలో ముప్పై ఎనిమిదవ వార్తై నుండి అనుభవిద్దాం.

ఆళ్వార్ ఎమ్పెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం

జీయర్ తిరువడిగళే  శరణం

పిన్బళగియ పెరుమాళ్ జీయర్ తిరువడిగళే  శరణం

అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజదాసన్

ఆడియో – https://1drv.ms/u/s!AhgMF0lZb6nnhTBv63Gk37C1Kymd?e=a4Y8ox
వీడియో –https://youtu.be/m6fCj2imQH8
ఆంగ్లంలో – https://granthams.koyil.org/2026/10/03/varthamalai-part-13-english/

పొందుపరచిన స్థలం: https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment