ఆచార్య హ్రుదయం – 54

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 53

చూర్ణిక – 54

అవతారిక
ఇంతక ముందు నమ్మాళ్వార్ల నాలుగు ప్రబంధములకు మరియు నాలుగు వేదములకు సామ్యమును నాయనార్లు సాయించిరి. ఇక మీద అంతమాత్రమే కాకుండా వీటికి(నాలుగు ప్రబంధములకు) మరియు వేద ఉపబృంహణములకు గల సామ్యమును వివరించబోతున్నారు.

చూర్ణిక
అన్ఴిక్కే స్వరూపరూపగుణ విభూతి చేష్టితఙ్గళై విశదమాక్కుకిఴ పంచరాత్ర పురాణేతిహాసఙ్గళ్ పోలే నీలభారూపోక్తి తెరియచ్చొన్న వేదోపబృంహణమెన్బరకళ్

సంక్షిప్త వివరణ
ఎలా అయితే వేదములో చెప్పబడిన భగవానుని స్వరూప, రూప, గుణ, విభూతి మరియు చేష్టితములను శ్రీ పాంచరాత్ర ఆగమము, ఇతిహాసములు మరియు పురాణములు విస్తారముగా చేసి చెప్పునో అదే విధముగా ఈ ప్రబంధములు కూడా భగవానుని నీలమేఘశ్యామ వర్ణము, జ్యోతి స్వరూపమును వివరించు తెలుపునటువంటి వేద ఉపబృంహణము అని చెప్పెదురు.

వ్యాఖ్యానము
అనగా ఈ నాలుగు ప్రబంధములు కేవలము నాలుగు వేదములతో సమానము అని కాకుండా ఉపబృంహణములతో కూడా సమానమని చెప్పడము ఎలా సాధ్యము?

వేదము భగవానుని స్వరూప, రూప, గుణ, విభూతి, చేష్టితములను బయలుపరుచును.
వేదములో ఈ క్రింద చెప్పబడిన చోట్ల భగవానుని స్వరూపము వివరించబడినది.

– ముండక ఉపనిషత్తు “యత్త దద్రేశ్య మగ్రాహ్యమ గోత్ర వర్ణ మ చక్షుశ్శ్రోత్రం త దపాణిపాదం నిత్యం విభుమ్ సర్వగతం సుసూక్ష్మం త దవ్యయం యద్భూతయోనిం పరిపశ్యన్తి ధీరాః”(బ్రహ్మము జ్ఞానేంద్రియములకు అతీతమై ఉండును, కాలు, చేయి వంటి ఇంద్రియముల ద్వారా తెలియబడునది కాదు. గోత్రము, వర్ణము లేనిదై అంతటా వ్యాప్తించినదై, కాలు, చేయి వంటి ఇంద్రియములు లేనిదై అన్నింటిలో ప్రవేశించినదై(లోపల, వెలుపల), చాలా సూక్ష్మమైనదియై ఈ విధముగా వర్ణించబడినది “అక్షరము” అను దానితో సూచించబడినది. అట్టి బ్రహ్మమును గూర్చి జ్ఞానమును కలిగినవారు మరియు ఈ “అక్షరము”ను జగత్కారణముగా తెలుసుకొనుచున్నారు.)
– తైత్తిరీయ ఉపనిషత్తు “సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ” (బ్రహ్మము నిత్యమయినది, జ్ఞానమును కలిగినది మరియు అనంతమయినది)
– శ్వేతాశ్వతర ఉపనిషత్తు “నిష్కళం నిష్క్రియం శాంతం నిరవద్యం నిరఞ్జనం నిర్గుణం” (బ్రహ్మము దోషములు లేనిది, హేయ గుణములు లేనిది, ఆకలి లేనిది, విడదీయరానిది, కర్మ రహితమైనది)

వేదములో ఈ క్రింద చెప్పబడిన చోట్ల భగవానుని గుణములు వివరించబడినవి.

-ముండక ఉపనిషత్తు ” యస్సర్వజ్ఞః సర్వవిత్” (అంతటా వ్యాప్తించినవాడు మరియు సర్వమును(అన్నింటిని) సామాన్యముగా, విశేషముగా తెలిసినవాడు)
– శ్వేతాశ్వతర ఉపనిషత్తు “పరాస్య శక్తిః వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బల క్రియాచ” (సర్వేశ్వరుని శక్తి అనేక రూపములుగా ఉన్నది, యీతని జ్ఞానము, శక్తి, క్రియ స్వభావ సిద్ధములు)

శ్రీ పాంచరాత్రము ఈ విధముగా వివరించుచున్నది.
మొదట స్వరూపమును గూర్చి వివరించినది.

శ్రుణు తత్పరమం సూక్ష్మం సర్వజ్ఞం సర్వభృత్తధా
జ్ఞానరూపం అనాది అంతమ్ అవికారి నిరామయం
అచక్షుఃశ్రోత్ర మస్పర్శ మపాణిచరణం ధ్రువం
నామజాత్యాదిరహిత మవర్ణ మగుణం త్వపి
విశ్వశ్రవో విశ్వచక్షు ర్విశ్వపాణి  పదంపరం
అసక్త మచరం శాన్తం స్వయంజ్యోతిరనూపమం
దూరస్థ మన్తికచరం జ్ఞానగమ్యం నిరఞ్జనం
భూతభర్తృసమం జ్యోతి ర్జ్యోతిషాం తమసఃపరం
అక్షరం సర్వభూతస్తం తద్విష్ణోః పరమంపదం

అట్టి పరబ్రహ్మము యొక్క యధార్థ స్వభావమును నా నుంచి వినుము. అది సూక్ష్మమైనది, సర్వమును భరించునది, జ్ఞానమును స్వరూపముగా కలిగినది, ఆది అంతములు లేనిది, అంశములను లేనిది, నిద్ర లేనిది, కళ్ళు, చెవులు లేనిది, స్పర్శ రహితమైనది, నిత్యమైనది, నామ జాత్యాది రహితమైనది, వర్ణ రహితమైనది, అంతటా శ్రవణేంద్రియమును కలది, నేత్రేన్ద్రియము కలది, అంతటా చేయి పాదములు కలది, ఒక దానితో సంబంధించి ఉండనిది, చలనము లేనిది, శాంతమును, స్వయంప్రకాశమును కలిగినది, తానంతట తానుగా ఉండునది, నిరుపమానమైనది, దూరమున ఉండునది, దగ్గరగాను ఉండునది, జ్ఞానముతో పొందతగినద, సమదృష్టి కలిగినది, ప్రకాశించు వాటికి జ్యోతి వంటిది, లీలా విభూతికి ఆవల ఉండునది, నాశము లేనిది, అన్నింటిలో అంతర్యామిగా ఉండునది అయిన శ్రీ మహా విష్ణువు యొక్క పరాత్పరమైన రూపము.

అహిర్బుధ్న్య సంహితలో చెప్పబడిన గుణములు

అప్రాకృత గుణ స్పర్శాన్నిర్గుణం పరిగీయతే
శ్రుణు నారద షాడ్గుణ్యం గత్యమానం మయానఘ
అజడం స్వాత్మసమ్భోధి నిత్యం సర్వావగాహనం
జ్ఞానం నామగుణమ్ప్రాహుః ప్రధమం గుణచిన్తకాః
స్వరూపం బ్రహ్మణ స్తచ్చ గుణశ్చ పరిగీయతే
జగత్ప్రకృతి భావో య స్సా శక్తిః పరికీర్తితా
కర్తృత్వం నామ యత్తస్య స్వాతన్త్య్ర పరిబృంహితం
ఐశ్వర్యం నామ తత్ప్రోక్తం గుణ తత్వార్థచిన్తకైః
శ్రమహానిస్తు యా తస్య సతతం కుర్వతో జగత్
బలం నామ గుణస్తస్య కథితో గుణచినతకైః
తస్యోపాదానభావేపి వికారవిరహో హి యః
వీర్యం నామ గుణస్సోయ మచ్యుతత్వాపరాహ్వయః
సహకార్యనపేక్షాయ తత్తేజ స్సముదాహృతం

ఎట్టి దోషములు లేని ఓ నారద! ఈ పరబ్రహ్మము ప్రకృతి సంబంధములైన గుణములు లేనిదైనందున “నిర్గుణం” అని చెప్పబడినది. బ్రహ్మము యొక్క ఆరు గుణములను నా నుంచి వినుము.

– బ్రహ్మము యొక్క కళ్యాణ గుణములను ఉపాసించు పెద్దలు మొదట జ్ఞానము అను గుణమును గురించి చెప్పెదురు, అట్టి జ్ఞానము బ్రహ్మమును స్వయంప్రకాశకముగా మరియు ప్రకాశించు ప్రతి వస్తువును తెలుసుకునేలా చేయును. అట్టి జ్ఞానము బ్రహ్మము యొక్క స్వరూపముగాను మరియు గుణముగాను ఉండునది.
– ఈ జగత్తుకి మూలకారణము అయినది కనుక శక్తి అని చెప్పుదురు.
– అతని గుణములను ఉపాసించు వారు, అతనికి గల స్వతంత్య్రమును, కర్తృత్వమును గుణమును ఐశ్వర్యముగా గుర్తించెదరు.
– జగత్తుని సృజించినప్పటికీ అతనికి దానివలన శ్రమ కలుగక పోవుట అను గుణమును బలముగా చెప్పుదురు.
ఈ జగత్తు అంతటికి ఉపాదాన కారణమగు అచ్యుతునిగా పిలువబడు బ్రహ్మము యొక్క స్వరూపము మారనందున అట్టి గుణమును వీర్యము అని పిలిచెదరు.
– ఇట్టి పనులన్నీ చేయుటకు ఇతరుల సహాయము కోరకుండా ఉండు గుణమును తేజస్సు అని పిలిచెదరు.

వేదములో ప్రస్తావించబడిన భగవానుని విభూతి పురాణములలో విశదీకరించబడినది.

వేదములో ప్రస్తావించబడిన వివరణ:

-తైత్తిరీయ ఉపనిషత్తు “యతోవా ఇమాని భూతాని జాయన్తే యేన జాతాని జీవన్తి యత్ ప్రయంతి అభిసంవిశన్తి” (దేని నుండి ఈ సమస్త భూతములు పుట్టుచున్నవో దేని వలన ఆలా పుట్టినవి జీవించుచున్నవో దేనిలో అంతిమముగా ప్రవేశించుచున్నవో దానిని నీవు తెలుసుకొనవలెను. అది ఏ బ్రహ్మము)
– పురుష సూక్తము “బ్రహ్మణోస్యముఖ మాసీ ర్బాహూ రాజన్యః కృతః ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యామ్ శూద్రో జాయత”(బ్రాహ్మణుడు బ్రహ్మము యొక్క ముఖము నుండి పుట్టెను, బాహువుల నుండి క్షత్రియుడు, తొడల నుండి వైశ్యుడు, పాదముల నుండి సూద్రుడు పుట్టెను)
– వేదము “అన్తః ప్రవిష్టః శాస్తా జనానామ్” (ప్రతీ ఆత్మలో అంతర్యామిగా ప్రవేశించి నియమించు వాడు)
– పురుష సూక్తము “పాదోస్య విశ్వాభూతాని” (సమస్త భూతములు ఆయన విభూతిలో నాల్గవ భాగము)
– “సహోవాచ మహిమాన ఏవైషామ్ ఏతే త్రయస్త్రింశదేవదేవా ఇతి కతమే తే త్రయస్త్రింశదతి అష్టౌ వసవః ఏకాదశరుద్రాః ద్వాదశాదిత్యాః త ఏకత్రింశత్ ఇంద్రశ్చైవ ప్రజాపతిశ్చత్రయ స్త్రింశత్” (యాజ్ఞవల్క్యుడు ఇట్లు బదులిచ్చెను – ఈ ముప్పై మూడు దేవతలకు ఇంతక ముందు చెప్పబడిన మూడు వేళా మూడు వందల ఆరు దేవతలు దాసులుగా ఉండును. ముప్పై మూడు దేవతలు ఎవరు అనగా ఎనిమిది మంది వసువులు, పడకొండు మంది రుద్రులు, పన్నెండు మంది ఆదిత్యులు, ఇంద్రుడు, బ్రహ్మా)
– బృహదారణ్యక ఉపనిషత్తు “పౌతిమాష్యో గోపవనాన్ గోపవనః కౌశికాత్కౌశికః కౌణ్డిన్యాత్కౌణ్డిన్యః శాండిల్యాచ్ఛాండిల్యః కౌశికాస్చ గౌతమాస్చ గౌతమః అగ్ని వైశ్యా దాగ్ని వైశ్యః శాండిల్యాత్”(పౌతిమాష్యుడు గౌతముని నుంచి, గోపవనుడు కౌశికుని నుంచి, కౌశికుడు కౌండిన్యుని నుంచి, కౌండిన్యుడు శాండిల్యుని నుంచి, శాండిల్యుడు కౌశికిని నుంచి మరియు గౌతముని నుంచి, గౌతముడు అగ్నివైస్యుని నుంచి, శాండిల్యుని నుంచి అగ్ని వైస్యుడు జ్ఞానమును పొందెను.)

దీనితో బ్రహ్మము యొక్క విభూతి అయిన జగత్ సృష్ఠి మొదలగు, వర్ణములు అయిన బ్రాహ్మణ మొదలగు, వివిధ దేవత రూపములు, మహర్షుల యొక్క వంశముల గురించి వేదములో వివరింపబడినవి.

పురాణములలో విస్తారముగా చెప్పబడిన అట్టి సర్వేశ్వరుని విభూతి అమర కోశములో  చెప్పినట్టు “సర్గశ్చ ప్రతిసర్గశ్చవంశో మన్వంతరాణిచ వంశానుచరింతచైవ పురాణం పంచ లక్షణం” (సృష్టి, సంహారము, వంశములు, మన్వంతరములు (మనువు యొక్క జీవిత కాలము), వివిధ వంశములలో జరిగిన ఘట్టములు)సృష్టి మొదలగు, వంశములు, మన్వంతరములు మరియు వివిధ వంశముల యొక్క పురాణ ఘట్టములు వివరింపబడ్డాయి.

వేదములను విశుదపరుచునట్టి పురాణములలో చెప్పబడిన భగవానుని చేష్ఠితములు (లీలలు)

 తైత్తిరీయ ఉపనిషత్తు “ఉద్ధృతాసి వరాహేణ”( ఓ భూమి దేవి! నీవు వరాహ రూపుడగు సర్వేశ్వరునిచే పైకి ఎత్తబడితివి) అనియు విష్ణు సూక్తము “ఇదం విష్ణు ర్విచక్రమే  త్రేధా విదధే పదం” (మూడు విధములుగా తన పాదములను ఉంచి భగవానుడు దీనిని కొలిచెను) రామావతారం మరియు కృష్ణావతారం శ్రీ రామాయణములో వివరించినట్టు “రామాయణమ్” (రాముని చరిత్ర) మరియు మహాభారతము ” నారాయణ కథామ్” (నారాయణుని దివ్య గాథ). భగవానుని ఇతర అవతార విశేషాలు కూడా శ్రీ రామాయణము “అథ విష్ణు ర్మహాతేజా అదిత్యాం సమజాయత వామనం రూప మాస్థాయ వైరోచని ముపాగమత్ త్రీన్ క్రమా నథ భిక్షిత్వా ప్రతిగృహ్య చ మాధవః ఆక్రమ్య లోకా న్లోకాత్మా సర్వలోకహితే రతః మహేన్ద్రాయ పునః ప్రదా న్నియమ్య బలి మోజసా” (తేజోవంతుడు అయిన శ్రీ మహా విష్ణువు అదితి గర్భమున అవతరించెను. అతను వామనుని రూపమును దాల్చి వీరోచని కుమారుడు అయిన బాలి వద్దకు వెళ్లెను. ఈ సమస్త లోకములకు ఆధారభూతుడు మరియు అందరి క్షేమమును కోరు వాడు అయిన భగవానుడు మూడు అడుగుల నేల కోసము యాచించి దానిని గ్రహించి వాటిని తిరిగి మహేంద్రునికి ఇప్పించి తన శక్తిచే బాలి చక్రవర్తిని నియమించు వాడు అయ్యెను) అని ఈ విధముగా శ్రీ రామాయణములో చెప్పడము జరిగినది.

భగవానుని దశావతారముల యొక్క లీలలు ఇతిహాసములలో విస్తరించబడినవి

మహాభారతములో మోక్ష ధర్మమున శ్రీ జన్మ రహస్యమున “నారదే నైవ ముక్తస్తు ప్రత్యువాచ జనార్ధనః … పూర్వం మత్స్యో భవిష్యామి స్థాపయిష్యామి మేదినీం వేదాం శ్చైవోద్ధరిష్యామి మజ్జమానా మహార్ణవే ద్వితీయం కూర్మరూపేణ హేమకూటసమప్రభం మన్ధరం ధారయిష్యామి అమృతార్థం ద్విజోత్తమ”( ఈ విధముగా నారదుని నుంచి విని భగవానుడు ఇలా పలికినాడు – బ్రాహ్మణులలో శ్రేష్ఠమైన ఓ నారద! మొట్టమొదట నేను మత్స్యావతారమును ఎత్తుతాను, సముద్ర గర్భములో ఉన్న వేదములను బయటకి తెచ్చి ఈ భూమిని స్థిరముగా చేసెదను. ఆ తరువాత నేను కూర్మావతారమును దాల్చి హేమకూట పర్వతము వలె ప్రకాశించు మంధర పర్వతమును ధరించెదను. ఇది నా రెండవ అవతారము)

అలానే భగవానుని విగ్రహము(దివ్య రూపములు) వేదములో నారాయణ సూక్తములో “నీలతోయదమధ్యస్తావిద్యుల్లే ఖేవభాస్వరా” (నీలి మేఘము మధ్యలో మెరుపు వలె ప్రకాశించునది) అనియు ముండక ఉపనిషత్తు 2.2.7 “మనోమయః ప్రాణ శరీరోభారూపః” (మంచి బుద్ధి చేత తెలుసుకొనబడిన వాడు, ప్రాణ శరీరుండు మరియు ప్రకాశమగు దివ్య రూపమును కలవాడు) అని ఈ విధముగా చెప్పబడిన భగవద్ విగ్రహ వర్ణనమును ఆది మధ్య అంతముల యందు అనేక విధముల వర్ణించి ఉన్నందున తిరువాయిమొళి 6.9.11 “తెరియ చొన్న” (ఈ నాలుగు ప్రబంధములు) అని చెప్పినట్టు వేద ఉపబృంహణములుగా చెప్పుదురు.

మొదటి నుంచి చివరి దాకా ఈ విధముగా భగవానుని దివ్య రూపముల యొక్క వివరణములు వీరి ప్రబంధములలో కనబడును.

– తిరువిరుత్తం 2 “ముళునీర్ మగిళ్వణ్ణన్” (నీటితో నిండిన మేఘము వంటి వర్ణమును కలిగిన కృష్ణుడు) అనియు తిరువిరుత్తం 94 “మైప్పడి మేని” (ముదురు రంగులో ఉండు నల్లని మచ్చ వంటి వర్ణమును కలిగిన దివ్య రూపము)
– తిరువాశిరియం 1 “పచ్చై మేని” (పచ్చని దివ్య రూపము) మరియు తిరువాశిరియం 5 “తామరైక్కాడు” (తామర పువ్వులతో నిండిన అడవి)
– పెఱియ తిరువందాది 1 “నార్పూవైప్ పూవిన్ఴ” (విలక్షణమైన కాయాంబు అను పువ్వు నందు కలిగిన వర్ణము వలె) మరియు  పెఱియ తిరువందాది 86 “కర్ కలన్ద మేనియాన్” (మేఘముతో సదృశమైన శరీరమును కలవాడు)
– తిరువాయిమొళి 1.1.1 “తుయిరఴు సుడరొడి” (క్లేశములను పోగొట్టునటువంటి ప్రకాశవంతమైన దివ్య పాదములు) మరియు తిరువాయిమొళి 10.10.6 “పునక్కాయా నిఴత్తా” (తీర్థములో ఉండు కాయాంబు అను పువ్వు వంటి వర్ణము కలవాడు)

“తెరియ చొన్న” అనునది తిరువాయిమొళిలోనిది అయిననూ ఉపబృంహణముగా ఉండు లక్షణము ఆళ్వార్ల యొక్క తక్కిన ప్రబంధములకు కూడా కలదు. ఎలా అయితే వేదత్వము( వేదముగా ఉండుట) అనునది నమ్మాళ్వార్ల అన్ని ప్రబంధములకు అన్వయించునో అట్టి తర్కమే ఇక్కడ కూడా వర్తించును. పాంచరాత్ర, పురాణ, ఇతిహాసములు యందు ఈ ప్రబంధమునందు(తిరువాయిమొళి)  స్వరూపాది సమస్తార్థములు చెప్పబడి ఉన్నప్పటికీ ఈ అర్థములను తెలుపు విషయమే వీటికి ముఖ్య ఉద్దేశ్యము అవ్వడము చేత ఇట్టి వాటిగా చెప్పుటకు ఎట్టి బాధకము లేదు .  

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/04/20/acharya-hrudhayam-54-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment