శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< 42-ద్వారకా జీవనం మరియు నారదుని ఆనందం

ఒకసారి నారదుడు, ద్వారకా నగరానికి వచ్చినప్పుడు, శ్రీకృష్ణుడు స్వయంగా ముందుకు వచ్చి ఆయనకు స్వాగతం పలికి, ఆరాధించి, సేవ చేశాడు. నారదుడు ఎల్లప్పుడూ లోకాలన్నిటిలో సంచరిస్తూ ఉంటాడని తెలిసిన కృష్ణుడు, “పాండవులు ఎలా ఉన్నారు?” అని అడిగాడు. అప్పుడు నారదుడు, “పాండవులలో జ్యేష్ఠుడు అయిన యుధిష్ఠిరుడు ఇప్పుడు రాజసూయ యాగం చేయాలని సంకల్పించాడు” అని చెప్పాడు. అక్కడ ఉన్న యాదవులు జరాసంధుడును సంహరించాలని కోరుకున్నారు. అప్పుడు కృష్ణుడు తన మంత్రి ఉద్ధవుడు తో ఏం చేయాలో సమాలోచన చేసినప్పుడు. ఉద్ధవుడు “ముందుగా జరాసంధుడు వంటి మహాశత్రువులను సంహరించాలి. ఆ తరువాత రాజసూయ యాగం నిర్విఘ్నంగా చేయవచ్చు.” అని చెప్పాడు. కృష్ణుడు వెంటనే ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. పాండవులు ఆయనను ఎంతో ప్రేమతో ఆహ్వానించారు. ఆయన అక్కడ కొన్ని నెలలు ఆనందంగా గడిపాడు.
ఒకరోజు పాండవుల రాజసభలో కృష్ణుడు కూడా ఆసీనుడై ఉన్నాడు. ఆ సమయంలో యుధిష్ఠిరుడు తనకు రాజసూయ యాగం చేయాలనే కోరిక ఉందని ప్రకటించాడు. కృష్ణుడు దానికి సమ్మతించి ఆశీర్వదించాడు. తరువాత యుధిష్ఠిరుడు తన సహోదరులను అన్ని దిక్కులకూ పంపించాడు. వారు అనేక రాజులను జయించి అపారమైన సంపదను తీసుకొని వచ్చారు. ఆ తరువాత జరాసంధుడిని ఎలా ఓడించాలనే విషయంపై చర్చ జరిగింది. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు: “జరాసంధుడు బ్రాహ్మణులను అత్యంత గౌరవిస్తాడు. అదే విషయాన్ని ఉపయోగించి అతడిని జయిద్దాం. అతని విస్తారమైన సైన్యాన్ని ఎదుర్కొని గెలవడం కష్టం. కానీ అతడిని ఒంటరిగా యుద్ధానికి ఆహ్వానిస్తే ఓడించవచ్చు.” అప్పుడు కృష్ణుడు, భీముడు మరియు అర్జునుడు బ్రాహ్మణుల వేషంలో జరాసంధుని వద్దకు వెళ్ళి అతనిని బాగా స్తుతించారు. జరాసంధుడు వారితో, “మీ కోరిక ఏమిటో చెప్పండి; నేను నెరవేర్చుతాను” అన్నాడు. అప్పుడు కృష్ణుడు, “మాలో ఒకరితో నీవు ద్వంద్వ యుద్ధం చేయాలి” అని కోరారు. వెంటనే జరాసంధుడు వీరు నిజమైన బ్రాహ్మణులు కాదని గ్రహించి, తమ అసలు స్వరూపాన్ని వెల్లడించమని అడిగాడు. వారు తమ నిజరూపాన్ని తెలియజేయగా, జరాసంధుడు “నేను భీముడితో మాత్రమే యుద్ధం చేస్తాను” అన్నాడు.
యుద్ధం ప్రారంభమైంది. రెండు పర్వతాలు ఒకదానిపై ఒకటి దూసుకొచ్చినట్లుగా వారు భీకరంగా యుద్ధం చేశారు. ఆ యుద్ధం చాలా కాలం కొనసాగింది. ఆ సమయంలో భీముడు చూస్తుండగా, కృష్ణుడు ఒక గడ్డిపరకను తీసుకొని దానిని రెండు భాగాలుగా చీల్చి వేరు-వేరు వైపులకు విసిరేశాడు. భీముడు కృష్ణుని సంకేతాన్ని అర్థం చేసుకున్నాడు. అప్పుడు భీముడు జరాసంధుని రెండు కాళ్లను తన రెండు చేతులతో పట్టుకొని, అతని శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి వేరు-వేరు వైపులకు విసిరేశాడు. ఈ విధంగా జరాసంధుడు సంహరించబడ్డాడు. ఆ తరువాత కృష్ణుడు జరాసంధుని కుమారుడిని రాజ్యానికి రాజుగా నియమించాడు. జరాసంధుడు బంధించిన వేలాది రాజులను విడుదల చేశాడు. అనంతరం వారు ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చి ఈ శుభవార్తను యుధిష్ఠిరునికి తెలియజేశారు. యుధిష్ఠిరుడు అత్యంత ఆనందంతో రాజసూయ యాగానికి ఏర్పాట్లు ప్రారంభించాడు.
మన పూర్వాచార్యులు, ఆళ్వారుల పాశురాల వ్యాఖ్యానాలలో అనేక చోట్ల, భగవంతుణ్ణి ఎలా ధ్యానించాలి, ఎలా ఆశ్రయించాలి అనే విషయాన్ని వివరించేటప్పుడు, కాలయవనుడు, జరాసంధుడు వంటి వారి లాగా భగవంతుణ్ణి శత్రువుగా భావించి సంహరించాలని కాకుండా, ఆయనకు సేవ చేయాలనే భావంతో ధ్యానించాలి అని ఉపదేశిస్తారు.
ఈ సంఘటన యొక్క సారాంశం:
- ఎంత పరాక్రమం ఉన్నా, కృష్ణభక్తి లేకపోతే ఆ పరాక్రమానికి ప్రయోజనం లేదు.
- రాజసూయ యాగం చేసినవారు చక్రవర్తులుగా కీర్తించబడతారు. యుధిష్ఠిరుడు కూడా అలాంటి కీర్తిని పొందుటకై ఆ యాగాన్ని నిర్వహించాడు.
- తన భక్తులైన పాండవుల కొరకు కృష్ణుడు మంత్రి, మిత్రుడు మొదలైన అనేక రూపాలలో సహాయం చేస్తాడు.
మూలం : https://granthams.koyil.org/2023/10/19/krishna-leela-43-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org