కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 56 – మహాభారత యుద్ధం – భాగం 3

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 55 – మహాభారత యుద్ధం – భాగం 2

ద్రోణుడు మహా పరాక్రమశాలి. అతనిని ఎలా సంహరించాలో కూడా కృష్ణుడే పాండవులకు ఉపదేశించాడు. ద్రోణుడు తన కుమారుడైన అశ్వత్థామపై అత్యంత మమకారం కలవాడు. అశ్వత్థామ మరణించాడని తెలిసితే ద్రోణుడు యుద్ధశక్తిని కోల్పోతాడు. అయితే అశ్వత్థామ చిరంజీవి; అతనిని సులభంగా చంపడం సాధ్యం కాదు. అందువల్ల “అశ్వత్థామ” అనే పేరుగల ఒక ఏనుగును చంపి, ఆ వార్తను ద్రోణునికి తెలియజేయమని కృష్ణుడు ఉపాయం చెప్పాడు. కృష్ణుని సూచన ప్రకారం భీముడు “అశ్వత్థామ” అనే ఏనుగును సంహరించి, “అశ్వత్థామ చనిపోయాడు” అని ద్రోణునికి ప్రకటించాడు. అది విని ద్రోణుడు తీవ్రంగా కలత చెందినా, యుధిష్ఠిరుని నోటి నుంచే నిజాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు. యుధిష్ఠిరుడు ఎల్లప్పుడూ సత్యవాది కాబట్టి, అతని మాటనే ద్రోణుడు నమ్ముతాడు. ద్రోణుడు అడిగినప్పుడు, వేరే మార్గం లేక యుధిష్ఠిరుడు “అవును, ఇది నిజమే” అని చెప్పాడు. అది విన్న ద్రోణుడు తన ఆయుధాలన్నింటినీ విడిచిపెట్టాడు. వెంటనే ద్రుపదుని కుమారుడైన ధృష్టద్యుమ్నుడు ద్రోణుని సంహరించాడు. ఈ విధంగా ద్రోణుడూ యుద్ధంలో మరణించాడు. తన తండ్రి మరణవార్త విన్న అశ్వత్థామ తీవ్రమైన కోపంతో అత్యంత శక్తివంతమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు కృష్ణుడు అందరికీ తలవంచి నమస్కరించమని ఆజ్ఞాపించాడు. అందరూ అలాగే చేశారు. దాంతో నారాయణాస్త్రం వారిని ఏమాత్రం హాని చేయకుండా వెళ్ళిపోయింది.

తరువాత కర్ణుడు కౌరవసేనకు సేనాధిపతిగా నియమితుడయ్యాడు. అతడు పాండవసేనకు ఎంతో నష్టం కలిగించాడు. ఇదే సమయంలో, భీముడు దుశ్శాసనుడిని సంహరించి, అతని రక్తాన్ని ద్రౌపదికి తీసుకువచ్చాడు. ద్రౌపది ఆ రక్తాన్ని తన జుట్టుకు రాసుకొని, తన ప్రతిజ్ఞలలో ఒకదాన్ని నెరవేర్చుకుంది.

కృష్ణుని సలహా ప్రకారం కుంతీ, కర్ణుడి వద్దకు వెళ్ళి, అతడే తన కుమారుడన్న రహస్యాన్ని వెల్లడించింది. అలాగే పాండవులను సంహరించవద్దని అతడిని ప్రార్థించింది. అప్పుడు కర్ణుడు, “అర్జునుడు తప్ప మరెవ్వరినీ నేను చంపను” అని ప్రతిజ్ఞ చేశాడు. చివరకు అతడు అర్జునుడిచేత యుద్ధంలో మరణించాడు.

చివరగా యుద్ధం పద్దెనిమిదవ రోజున భీముడు, దుర్యోధనుడు భీకరమైన గదాయుద్ధంలో పాల్గొన్నారు. అప్పుడు కృష్ణుడు దుర్యోధనుని తొడపై దెబ్బకొట్టి సంహరించమని భీమునికి సంకేతం ఇచ్చాడు. ఆ సంకేతాన్ని అర్థం చేసుకున్న భీముడు దుర్యోధనుని తొడపై గదాతో బలంగా కొట్టి సంహరించాడు.

ఆ తరువాత అశ్వత్థామ పాండవుల శిబిరానికి వెళ్ళి, ఉపపాండవులను (పాండవుల ఐదుగురు కుమారులను) పాండవులేనని పొరపడి సంహరించాడు. ఈ విధంగా పాండవులు మరియు కౌరవులలో కొద్దిమంది మినహా, ఈ మహాభారత యుద్ధంలో పాల్గొన్న చాలా మంది వీరులు మరణించారు.

నమ్మాళ్వారు తమ తిరువాయ్మొళిలో ఈ మహత్తర యుద్ధాన్ని నిర్వహించిన భగవంతుని మహిమను ఇలా వర్ణిస్తున్నారు:“తీర్ప్పారై యామ్ ఇని ఎఙ్ఙనం నాడుదుం? అన్నైమీర్! ఓర్ప్పాల్ ఇవ్వొణ్ణుదల్ ఉఱ్ఱ నల్ నోయ్ ఇది తేరినోమ్; పోర్ప్పాగు తాన్ సెయ్దు అన్ఱైవరై వెల్విత్త మాయప్పోర్ తేర్ప్పాగనార్క్కు ఇవళ్ సిందై తుఴాయ్త్ తిసైక్కిన్ఱదే.” ([స్నేహితురాలి భావం లో] ఓ తల్లులారా! ఈమెకు వచ్చిన వ్యాధిని ఇప్పుడు ఎవరు నివారించగలరు? పరిశీలించి చూస్తే, ఈ సుందర నుదుటిగల యువతికి ఒక మహోన్నతమైన ప్రేమవ్యాధి సోకిందని తెలుసుకున్నాను. యుద్ధరంగంలో అర్జునునికి సారథిగా నిలబడి, తన అద్భుతమైన యుక్తులతో ఐదుగురు పాండవులకు విజయాన్ని సాధింపజేసిన, ఆ మాయవి అయిన సారథి, కృష్ణుని పట్ల ఈమె మనస్సు పూర్తిగా మోహించి తల్లడిల్లుతోంది).

ఈ సంఘటనలోని సారాంశం :

  • కృష్ణుడు పాండవులకు రక్షకుడిగా, మంత్రిగా, స్నేహితుడిగా నిలిచి, వారికి తగిన ఉపాయాలను చెప్పి మహాభారత యుద్ధాన్ని నడిపించి భూభారాన్ని తొలగించాడు.
  • ద్రౌపది అనుభవించిన అవమానం, దుఃఖాన్ని తొలగించడానికి ఈ మహాయుద్ధాన్ని నిర్వహించాడు. తన భక్తులపై ఎవరైనా అపచారం చేస్తే, వారిని శిక్షించడానికి భగవంతుడు ఎంతటి మహత్తర కార్యాన్నైనా చేయడానికి వెనుకాడడు.

మూలం : https://granthams.koyil.org/2023/11/01/krishna-leela-56-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment