కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 59 – పరమపదానికి తిరిగి వెళ్ళుట

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 58 – వైదికుడి కుమారులను తిరిగి తెచ్చుట

కృష్ణుడు, ఈ భూలోకంలో నూరేళ్ళు నివసించి అనేక మందికి అనుగ్రహించాడు. ఆ తరువాత తన దివ్య తేజోమయమైన పరమపదానికి తిరిగి చేరాలని సంకల్పించాడు. ఇప్పుడు ఆయన పరమపదానికి ఎలా చేరుకున్నాడో అనుభవిద్దాం.

మహాభారత యుద్ధం పూర్తయిన తరువాత, ధృతరాష్ట్రుని భార్య గాంధారి, “నా కుమారులు నాశనమైనట్లే యాదవ వంశమూ నాశనమవుతుంది” అని శపించింది. కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరించాడు. కృష్ణుడు పరమపదానికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించినప్పుడు, దాని ప్రభావం యాదవ వంశంలో కనిపించింది. యాదవులందరూ ధర్మాన్ని మరచి, భౌతిక సుఖాలలో మునిగిపోయారు. ఒకసారి కొందరు ఋషులు వస్తుండగా, యాదవులు సాంబుని కడుపుకు ఒక ముసలాన్ని (రోకలి) కట్టి, “ఇతడు ఏ బిడ్డను ప్రసవించబోతున్నాడు?” అని పరిహాసంగా అడిగారు. వారి అవహేళనను గ్రహించిన ఋషులు, “ఇతడు ఒక ముసలాన్ని ప్రసవిస్తాడు; అదే మీ వంశాన్ని నాశనం చేస్తుంది” అని శపించారు. యాదవులు భయపడి ఆ ముసలాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి సముద్రంలో పారవేశారు. ఆ ముక్కలు సముద్ర తీరంలో అడవి గడ్డిగా మొలిచాయి. ఒక లోహపు ముక్క మాత్రం ఒక చేప మింగింది. తరువాత అది ఒక వేటగాడైన జరుడి చేతికి చేరింది.

ఇదిలా ఉండగా ద్వారకలో అనేక అశుభ సూచనలు కనిపించాయి. కృష్ణుడు అందరికీ ఆ స్థలాన్ని విడిచి వెళ్ళడం మంచిదని చెప్పాడు. ప్రజలు ఒక్కొక్కరుగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. యాదవులు మద్యం సేవించి మత్తులో ఉండగా, వారిలో ఘోరమైన కలహం చెలరేగింది. వారు సముద్రతీరంలో పెరిగిన ఆ గడ్డిని పీకి, ఒకరిపై ఒకరు దాడి చేసి చంపుకోవడం ప్రారంభించారు. కొందరు బలరామునిపై కూడా దాడి చేయగా, కృష్ణుడు మరియు బలరాముడు వారిని సంహరించారు. తరువాత బలరాముడు ఒక చోట కూర్చొని ధ్యానంలో లీనమై పరమపదాన్ని చేరాడు. కృష్ణుడు అక్కడి నుండి ప్రభాస తీర్థానికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయసాగాడు. అప్పుడే వేటగాడు, జర, అక్కడికి వచ్చాడు. దూరం నుండి కృష్ణుని దివ్య పాదాలను చూసి, వాటిని జింక తలగా తలచి. తన బాణానికి ఆ లోహపు ముక్కను అమర్చి, కృష్ణుని పాదబొటనవేలిపై గురిపెట్టి బాణం వేశాడు. దగ్గరకు వచ్చాక తన పొరపాటును గ్రహించి, కృష్ణుని క్షమించమని వేడుకున్నాడు. అయితే కృష్ణుడు అతనిని ఓదార్చి, “నీ ద్వారా నా లీలను ముగించి పరమపదానికి చేరుతున్నాను” అని అన్నాడు. ఆ తరువాత తన దివ్య స్వరూపంతోనే పరమపదానికి ఆరోహణం చేయసాగాడు. ఆ సమయంలో కృష్ణుని సారథియైన దారుకుడు అక్కడికి వచ్చి ఎంతో దుఃఖించాడు. కృష్ణుడు తన దివ్య పాదాలను అతని తలపై ఉంచి ఆశీర్వదించి, పరమపదానికి చేరాడు.

దారుకుడు ద్వారకకు తిరిగి వెళ్ళి, కృష్ణుడు పరమపదాన్ని చేరిన వార్తను అందరికీ తెలియజేశాడు. అందరూ తీవ్రంగా దుఃఖించారు. అర్జునుడు ద్వారకలోని స్త్రీలను, వృద్ధులను సురక్షితంగా బయటకు తీసుకువెళ్ళాడు. ఆ తరువాత సముద్రం ద్వారక నగరాన్ని చుట్టుముట్టి ముంచివేసింది.

నమ్మాళ్వార్ తిరువాయ్మొళిలో ఇలా పేర్కొంటారు: “పోయ్ విణ్ మిసై తన ధామమే పుగ మేవియ సోది” (తన కార్యాన్ని పూర్తిచేసి, పరమాకాశంలో ఉన్న తన స్వధామమైన పరమపదాన్ని చేరిన పరంజ్యోతి).

సంఘటనలోని సారాంశం:

  • భగవంతుని అవతారానికి ప్రధాన కారణం జీవాత్మలపై ఉన్న కరుణ వల్ల వాటిని రక్షించాలనే ఆయన సంకల్పం. ఇతర కారణాలన్నీ ఉపకరణాలు మాత్రమే. అలాగే ఆయన పరమపదానికి తిరిగి వెళ్ళడానికి ప్రధాన కారణం ఆయన సంకల్పమే. గాంధారి శాపం, వేటగాడు బాణం వేయడం మొదలైనవి కేవలం ఉపకరణాలు మాత్రమే.
  • యాదవులు, కృష్ణుని బంధువులైనా, ఆయన పరమాత్మ స్వరూపాన్ని గ్రహించలేదు. కేవలం శారీరక బంధుత్వాన్ని మాత్రమే భావించారు. అందువల్ల భగవంతుడు వారికి తనతో కలిసి ఉండే సుఖాన్ని ఇచ్చి, తగిన సమయంలో ఆ లీలను ముగించాడు. అయితే విదురుడు, అక్రూరుడు వంటి కొద్దిమంది మాత్రమే ఆయన నిజ స్వరూపాన్ని గ్రహించి శాశ్వతమైన ఆనందాన్ని పొందారు.
  • భగవంతుడు పరమపదానికి తిరిగి వెళ్ళినప్పుడు తన దివ్య మంగళ విగ్రహంతోనే వెళ్ళాడు. అవతారకాలంలో ఆయన శరీరం మనుష్యుని శరీరంలా (లేదా ఇతర అవతారాల్లో ఆ జాతికి చెందిన శరీరంలా) కనిపించినప్పటికీ, అది ఎల్లప్పుడూ దివ్యమైన, అప్రాకృతమైన దేహమే.

మూలం : https://granthams.koyil.org/2023/11/04/krishna-leela-59-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment