వార్తామాలై – తొమ్మిదవ భాగం (వార్తై 23 – 24)

శ్రీ:     శ్రీమతే శఠకోపాయ నమః    శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః    

పూర్తి శ్రేణి

<< పూర్వపు భాగం 

శ్రీ నంపిళ్ళై పాదముల వద్ద  శ్రీ పిన్బళగియ పెరుమాళ్ జీయర్

నంపిళ్ళై మన సంప్రదాయంలో  అత్యున్నత స్థానాన్ని పొందిన ఆచార్యులు.  వారిని లోకాచార్యార్ అని కీర్తిస్తారు. తమ జీవితకాలంలో వారు అనేక కాలక్షేపాలను అనుగ్రహించారు. అందువల్ల ఆయన కాలాన్ని విశేషంగా ‘నల్లడిక్ కాలం’ (సువర్ణ యుగం) అని పిలుస్తారు. ఆయన కాలక్షేపాలలో ఎంతో మంది అన్వయించుకునే వారు,  అది నంపెరుమాళ్ గోష్ఠియేనా అని అనేకులు ఆశ్చర్యపడేవారు.

పిన్బళగియ పెరుమాళ్ జీయర్ నంపిళ్ళైకి అత్యంత ప్రియమైన శిష్యులు. ఉపదేశ రత్నమాలైలో శిష్యునికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలను వివరిస్తూ, మణవాళ మామునిగళ్ పిన్బళగియ పెరుమాళ్ జీయర్ యొక్క శిష్య లక్షణాన్ని, అలాగే నంపిళ్ళై పట్ల ఆయనకున్న ఆచార్యాభిమానాన్ని విశేషంగా కీర్తించారు. పిన్బళగియ పెరుమాళ్ జీయర్ 6000 పడి గురుపరంపరా ప్రభావంతో పాటు ఈ వార్తామాలై గ్రంథాని కూడా ప్రసాదించారు. 

వార్తామాలైలో మన పూర్వాచార్యులు అనుగ్రహించిన మన దర్శనానికీ, సంప్రదాయానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. పిన్బళగియ పెరుమాళ్ జీయర్, ఈ ఉపదేశాలను, వాటితో పాటు ఆచార్యుల జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను కూడా సంక్షిప్తంగా పొందుపరిచారు.  చారిత్రక సంఘటనలను (ఐతిహ్యాలను) గ్రంథాన్ని చదవడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అయితే, అనేక వార్తైలలో విశదంగా వివరించబడిన మన సిద్ధాంతంలోని లోతైన విషయాలను, ముఖ్యంగా చిత్, అచిత్, ఈశ్వరన్ తత్త్వాలను, అర్థం చేసుకోవడం కొంత కష్టంగా ఉండవచ్చు. ఈ విషయాలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి శాస్త్రం మరియు వేదాంతం యొక్క ప్రాథమిక విషయాలపై కొంత అవగాహన అవసరం.

ఈ గ్రంథాన్ని ప్రచురించడంతో పాటు, ఇందులోని సంక్లిష్టమైన తత్త్వ విషయాలకు విశదమైన వివరణను కూడా అందించిన పుత్తూరు స్వామివారికి కృతఙ్ఞతలు. 

క్రింద ఇవ్వబడిన వ్యాసం, శ్రీ ఉ.వే. సారథి తొథాద్రి స్వామివారు వార్తామాలై గ్రంథంపై తమిళంలో చేసిన కాలక్షేపం ఆధారంగా రూపొందించిన అనువాదం. ఈ అనువాదాన్ని చేయడానికి అవకాశం కల్పించి, దీనిని ప్రచురించే విషయంలో నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న స్వామివారికి కృతజ్ఞతలు.

వార్తై అనగా ఆచార్యులు తమ శిష్యులకు అనుగ్రహించిన ఉపదేశాలు. ఇవి గురుపరంపర ద్వారా తరువాతి తరాలకు అందుతూ వచ్చి, అనంతరం సంక్షిప్తంగా సంగ్రహించబడినవి.

ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. కొన్ని సందర్భాలలో, ఒకే విషయము వేర్వేరు వార్తైలలో కొద్దిగా భిన్నమైన వివరణలతో పునరావృతమవుతూ ఉంటుంది. దీనికి కారణం, ఒక్కొక్క ఆచార్యులు ఒకే విషయాన్ని వివరించేటప్పుడు, ప్రత్యేకమైన అంశాన్ని వేర్వేరు కోణాలను ప్రధానంగా తీసుకోవడమే.

వార్తై 23

ఈ వార్తైలో ఆత్మ యొక్క తన్మై (లక్షణాలు) విపులంగా వివరించబడ్డాయి.

ఈ వార్తై యొక్క మూలం ఎవరిదో తెలియదు. పిన్బళగియ పెరుమాళ్ జీయర్, పూర్వాచార్యులు అనుగ్రహించిన ఉపదేశాల నుండి ఈ వార్తైని సంగ్రహించి, దాని అర్థాన్ని ఇక్కడ తెలియజేశారు.

వార్తై 23 యొక్క సంగ్రహం:

  • ఆత్మ ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము, ప్రకృతి, జ్ఞానం  భిన్నమైనది.
  • ఆత్మ విభువు కాదు.
  • ఆత్మ అనిత్యము కాదు.
  • ఆత్మ ఏకాత్మా కాదు.
  • ఆత్మ శ్రీమన్నారాయణుడు తప్ప మరెవరికీ అధీనమైనది కాదు.
  • తదీయశేషత్వం అనేది శేషత్వం యొక్క చరమ పర్వం (పరమావస్థ).

మూలం 

కరణఙ్గళై ఆత్మా ఎన్బార్; ఇన్ద్రియఙ్గళై ఆత్మా ఎన్బార్; మనస్సే ఆత్మా ఎన్బార్; ప్రాణనై ఆత్మా ఎన్బార్; ఇవై తనిత్తనియే ఆత్మా ఎన్బార్; ఇతినుడైయ సముదాయమ్ ఆత్మా ఎన్బార్; ప్రకృతియై ఆత్మా ఎన్బార్; ఇదుక్కు వేఱుపట్టిరుక్కుమ్ ఆత్మా ఎన్ఱు కొళ్ళచ్చెయ్ తేయుమ్ జడమ్ ఆత్మా ఎన్బార్; క్శణికమ్ ఆత్మా ఎన్బార్; జ్ఞానమ్ ఆత్మా ఎన్బార్; విభు ఆత్మా ఎన్బార్; ఆత్మా అనిత్యమ్ ఎన్బార్; ఏకాత్మా ఎన్బార్; పరిణామి ఆత్మా ఎన్బార్; స్వతన్త్రమ్ ఆత్మా ఎన్బార్;

పారతన్త్ర్యమ్ కొళ్ళా నిఱ్కచ్చెయ్ తేయుమ్, కర్మత్తుక్కు పరతన్త్రన్ ఎన్బార్; మాతా పితాక్క ళుక్కు పరతన్త్రన్ ఎన్బార్;  పితృక్కళుక్కు  పరతన్త్రన్ ఎన్బార్; గృహఙ్గళుక్కు పరతన్త్రన్ ఎన్బార్; అగ్నిక్కు పరతన్త్రన్ ఎన్బార్; ఇన్ద్రనుక్కు పరతన్త్రన్ ఎన్బార్; బ్రహ్మా వుక్కు పరతన్త్రన్ ఎన్బా ర్; రుద్రనుక్కు పరతన్త్రన్ ఎన్బార్; ఏకాయన ఎమ్పేరుమానుక్కు పరతన్త్రన్ ఎన్బార్; ఇప్పడి బహుప్రకారఙ్గళినాలే విప్రతిపత్తి పణ్ణువర్గళ్.

ఇవై విప్రతిపత్తియాగిఱపడి ఎఙ్గనే యెన్నిల్ కాలుమ్ కైయుమ్ పోనాలుమ్ ఇరుక్కకాణ్గైయాలే కరణఙ్గళ్ ఆత్మావాగ మాట్టాదు; కణ్ణుమ్ శెవియుమ్ కెట్టాలుమ్ ఇరుక్కకాణ్గైయాలే ఇన్ద్రియఙ్గళ్ ఆత్మావాగ మాట్టాదు; మనస్సు జడమాగైయాలే ఆత్మావాగ మాట్టాదు; ప్రాణన్ వాయు విశేషమాగైయాలే ఆత్మావాగ మాట్టాదు;  ఒరుకరణత్తుక్కు వన్ద క్లేశత్తాలే, మత్తుక్కరణఙ్గళుమ్ క్లేశిక్కక్కాణ్గైయాలే- తనిత్తనియే ఆత్మావాగ మాట్టాదు; ఇవత్తినుడైయ సముదాయమాన శరీరమ్ ఆత్మావాగ మాట్టాదు;

ఎఙ్గనేయెన్నిల్; ఎన్నుడైయకాల్ ఎన్నుడైయ కై ఎనక్కు శరీరమ్ విధేయమాయ్ త్తు ఎన్గైయాలుమ్, మాతా పితాక్కళ్ శెత్తవనన్తరమ్ కాణ్గిర శరీరత్తిల్ ఒన్ఱుమ్ ముకమ్ మాఱిప్పోకామే కిడక్క, అప్పా! ఎఙ్గుప్పోనాయ్? అమ్మా ఎన్గుప్పోనాయ్? ఎన్ఱు, మున్నాళ్ ఆదరిత్తుప్పోన్ద శరీరన్తన్నై, అరై నాళిగై అగత్తిల్ కిడక్కవుమ్ పోఱాదే శవమ్ ఎన్ఱు పేరీట్టు, దర్శిత్త దోషత్తుక్కు నెయ్యుమ్ నెరుప్పుమ్ కొణ్డు కుళిక్కైయాలుమ్, అఙ్ఞరుఙ్గూడ శపశరీరత్తిల్ ఆత్మబుధ్ధి పణ్ణామైయాలే  శరీరమ్ ఆత్మావాగ మాట్టాదు; ఇవన్ ఇరున్దపోదు జ్ఞానమ్ నడైయాడుగైయాలే  జడమ్ ఆత్మావాగ మాట్టాదు; మున్బుశెయ్ తకార్యమ్ సొల్లుగైయాలే  క్షణికమ్ ఆత్మావాగ మాట్టాదు;

నాన్ ఇత్తైచ్చెయ్యానిన్ఱే ఎన్గైయాలే-జ్ఞానమ్ ఆత్మావాగ మాట్టాదు; ఆత్మా శరీరత్తిల్ నిన్ఱుమ్ పుఱప్పట్టుప్పోమ్బోతు శుత్తిలిరున్దార్కు త్తెరియామైయాలే  విభు ఆత్మావాగ మాట్టాదు; పోన జన్మమ్ శిలధర్మఙ్గళై చ్చెయ్ కైయాలే ఇజ్జన్మమ్ సుఖమాయ్ ఇరున్దోమ్; ఇజ్జన్మముమ్ శిలసుకృతఙ్గళైచ్చెయ్ తాల్ వరుకిఱ జన్మముమ్ సుఖమాయ్ ఇరుక్కలామ్ ఎన్ఱు శెయ్యక్కాణ్గైయాలుమ్, శరీరత్తై విట్టుప్పోయ్ స్వర్గాద్యనుభవమ్ పణ్ణువదాగ జ్యోతిష్టోమాది సాధనత్తిలే ఇళిగైయాలుమ్, ఆత్మా అనిత్యమాగ మాట్టాదు; ఒరు చేతనన్ సుఖిక్క ఒరు చేతనన్ దుఃఖిక్క, ఒరు చేతనన్ నలియ, ఒరు చేతనన్ నలివుపడకాణ్గైయాలుమ్ ఏకాత్మావాగ మాట్టాదు;

పిఱన్ద వన్ఱు శాకిఱ ప్రజైయినుడైయ ఆత్మావోడు, నూఱు వయస్సుప్పుక్కు శాకిఱవనుడైయ ఆత్మావోడు వాశియఱ కణ్ణుక్కు త్తెరియామైయాలే, పరిణామి ఆత్మావాగ మాట్టాదు; తనక్కు అనిష్ఠమాన దుక్కత్తై ప్పోక్కిక్కొళ్ళ మాట్టామైయాలుమ్, ఇష్ఠమాన సుఖత్తై అళైత్తుక్కొళ్ళ మాట్టామైయాలుమ్, తాన్ శెయ్ కిఱేన్ ఎన్ఱకార్యత్తై శెయ్ తుతలైక్కట్ట మాట్టామైయాలుమ్, స్వతన్త్రమ్ ఆత్మావాగ మాట్టాదు

కర్మత్తుక్కు పరతన్త్రనాగమాట్టాన్  అదు అచేతనమాగైయాలే; ఇవనుడైయ ఆపన్నివారణమ్ పణ్ణ మాట్టామైయాలే  మాతా పితాక్కళుక్కు పరతన్త్రనాగ మాట్టాన్; రక్షకత్వమ్ ఇల్లామైయాలే  పితృక్కళుక్కు పరతన్త్రనాగ మాట్టాన్; ఇప్పడి ఆగైయాలే  గృహఙ్గళుక్కు  తన్నైప్పిఱర్ పరతన్త్రనాగ మాట్టాన్; అచిత్తాగైయాలుమ్, తన్నైప్ పిఱర్ రక్షిక్క వేణ్డుగైయాలుమ్, ఆశ్రయాశియాగైయాలుమ్, అగ్నిక్కు పరతన్త్రనాగ మాట్టాన్; శాపోపహతనాగైయాలుమ్, తన్నుడైయ రాజ్యత్తై పిఱర్ కైయిలే పఱికొడుత్తు క్లేశిక్కైయాలుమ్  ఇన్ద్రనుక్కు పరతన్త్రనాగ మాట్టాన్;

మధుకైటభర్ కైయిలే వేదత్తై ప్పఱికొడుక్కైయాలుమ్, రుద్రనాలే నలియప్పడుగైయాలుమ్  బ్రహ్మావుక్కు పరతన్త్రనాగ మాట్టాన్; తాన్ అభిమానిత్త బాణనైక్కాట్టి కోడుత్తు తన్నై కొణ్డు నెగిళ నిఱై యాలుమ్, బ్రహ్మశిరస్సు తన్ కైయిలే యొట్టి క్కిడక్క, సర్వేశ్వరన్ పక్కలిలే చెన్ఱు ఎన్ ఆపత్తై పోక్కియరుళ వేణుమ్ ఎన్ఱు నోక్కి  కొళ్ళుగైయాలుమ్  రుద్రనుక్కు పరతన్త్రనాగ మాట్టాన్;

తిరుమాలే నానుమునక్కు ప్పళవడియేన్ ఎన్గైయాలే- ఏకాయననాన ఎమ్పెరుమానుక్కు పరతన్త్రనాగ మాట్టాన్; ఇని ఇవ్వాత్మావుక్కు నిలైనిన్ఱ శేషత్వమ్  నిన్ తిరువెట్టెళుత్తుమ్ కత్తు నానుత్తత్తుమ్ ఉన్నడియార్కడిమై” ఎఙ్గైయాలే తదీయ శేషత్వమేయాగ క్కడవదు.

వివరణము: 

భారత దేశంలో వివిధ తత్త్వ దర్శనాలు ఉన్నాయి. ప్రతి సిద్ధాంతంలో, ఆ సిద్ధాంతాన్ని అనుసరించే తత్త్వవేత్త ఆత్మ యొక్క స్వరూపాన్ని, ప్రకృతి యొక్క స్వరూపాన్ని, అలాగే ఆ సిద్ధాంతం ఈశ్వర తత్త్వాన్ని అంగీకరిస్తే ఈశ్వరుని స్వరూపాన్ని వివరిస్తాడు.

ఈ వివిధ అభిప్రాయాలను పరిశీలిస్తూ, ఆయా సిద్ధాంతాలను అనుసరించేవారు ఆత్మను ఎలా వివరించారో, వారి వివరణలలోని లోపాలు ఏమిటో జీయర్ చూపిస్తున్నారు. అంతేకాకుండా, మన పూర్వాచార్యులు మన సిద్ధాంతంలో ఈ ఆత్మ తత్త్వాన్ని ఎలా వివరించారో కూడా జీయర్ వివరిస్తున్నారు.

పుత్తూరు స్వామివారు ప్రతి సిద్ధాంతం ఆత్మను ఎలా వివరిస్తుందో తెలియజేస్తున్నారు. పైన పేర్కొన్న ప్రతి వార్తై, ఒక ప్రత్యేకమైన సిద్ధాంతం ఆత్మను ఎలా వివరిస్తుందో తెలియజేస్తుంది. ఉదాహరణకు, “కరణఙ్గళై ఆత్మా ఎన్బార్” అనేది ఒక ప్రత్యేక సిద్ధాంతం ఆత్మను ఎలా వివరిస్తుందో తెలియజేస్తుంది. అదేవిధంగా, మరొకరు ఇంద్రియాలే ఆత్మ అని చెబుతారు; ఇంకొక తత్వవేత్త మనస్సే ఆత్మ అని చెబుతారు. ఈ విధంగా, ప్రతి సిద్ధాంతం తన సొంత దృష్టికోణంలో తత్త్వాలను వివరిస్తుంది.

ఉదాహరణకు, నైయాయికులు సాధారణంగా అచేతనాలను ఆత్మగా పేర్కొంటారు.

కరణఙ్గళై ఆత్మా ఎన్బార్

కరణఙ్గళ్ అంటే చేతులు, కాళ్లు వంటి స్థూల అవయవాలు. సాధారణంగా కరణకళేబరం అంటే ఇంద్రియాలు (కరణం) మరియు శరీరం (కళేబరం) అని అర్థం. ఈ సంసారంలో, ఈశ్వరుడు ఆత్మకు కరణకళేబరాన్ని అనుగ్రహించి, ఎంపెరుమాన్ను పొందడానికి అవసరమైన సాధనాన్ని ఇస్తాడని చెప్పబడుతుంది. అయితే, ఇక్కడ ఇంద్రియాలు ప్రత్యేకంగా పేర్కొనబడినందున, కరణం అంటే శరీర భాగాలు అని అర్థం. కొందరు కరణఙ్గళే ఆత్మ అని భావిస్తారు.

ఇన్ద్రియఙ్గళై ఆత్మా ఎన్బార్

ఇంద్రియం అంటే కళ్ళు, చెవులు, ముక్కు మొదలైన అంతరింద్రియాలు. కొందరు ఈ ఇంద్రియాలనే ఆత్మ అని పేర్కొంటారు.

మనస్సే ఆత్మా ఎన్బార్

ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మొత్తం పది ఇంద్రియాలు ఉన్నాయి. ఈ పది ఇంద్రియాలకు నాయకునిగా మనస్సు తత్త్వం పరిగణించబడుతుంది. ఇది పది ఇంద్రియాలను నియంత్రిస్తుంది. కొందరు ఈ మనస్సునే ఆత్మ అని అంటారు.

ప్రాణనై ఆత్మా ఎన్బార్

కొందరు ప్రాణనే ఆత్మ అని అంటారు.

ఇవై తనిత్తనియే ఆత్మా ఎన్బార్

కొందరు వీటిలో ఒక్కొక్కదానినీ ఆత్మ అని పేర్కొంటారు.

ఇదినుడైయ సముదాయమ్ ఆత్మా ఎన్బార్

కొందరు ఇంద్రియాలు, ప్రాణన్, కరణన్గళ్, మనస్సు మొదలైనవి కలిగిన ఈ మొత్తం శరీరమే ఆత్మ అని అంటారు.

ప్రకృత్యై ఆత్మా ఎన్బార్

కొందరు ప్రకృతినే ఆత్మ అని అంటారు. ప్రత్యేకమైన ఆత్మ అనే ఒక వస్తువు లేదని, కళ్ళకు కనిపించేదంతా ఆత్మ అని వారు అంటారు.

ఇతుక్కు వేఱుపట్టు ఇరుక్కుమ్ ఆత్మా ఎన్ఱు కొళ్ళచ్చెయ్దేయుమ్ జడమ్ ఆత్మా ఎన్బార్

జడము అంటే జ్ఞానం లేని వస్తువులను సూచిస్తుంది. ఈ వస్తువులు ఆత్మకు భిన్నమైనవే అయినప్పటికీ, కొందరు తత్త్వవేత్తలు ఈ అచేతన వస్తువులనే (జడపదార్థాలను) ఆత్మ అని అంటారు. నైయాయిక సిద్ధాంతం ప్రకారం, ఆత్మ మోక్షాన్ని పొందినప్పుడు జడంగా మారుతుందని చెప్పబడుతుంది.

క్షణికమ్ అత్తా ఎన్బార్ 

ఈ విధంగా ఆత్మను వివరించడం బౌద్ధ మతానికి సంబంధించినది. బౌద్ధ మతం ప్రకారం, జ్ఞానం నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ క్షణంలో మనకు ఉన్న జ్ఞానం తరువాతి క్షణంలో ఉండే జ్ఞానం వలె ఉండదు. ఈ రోజు మనకు ఉన్న జ్ఞానం రేపు ఉండే జ్ఞానానికి భిన్నంగా ఉంటుంది. బౌద్ధ మతంలో నాలుగు శాఖలు ఉన్నాయి; వాటిలో ఒక్కొక్కదానికీ వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో చివరిది జ్ఞానంతో సహా అన్నీ శూన్యమే అని చెబుతుంది. అందువల్ల బౌద్ధ తత్త్వంను శూన్యవాద తత్త్వం అని అంటారు. వారి ప్రకారం జ్ఞానం క్షణికం, ప్రతి క్షణమూ మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, ఈ క్షణంలో మనం ఒక విషయాన్ని ఆలోచిస్తాము; తరువాతి క్షణంలో మరొక విషయాన్ని ఆలోచిస్తాము. ఇంతకు ముందు మనకు ఉన్న ఆలోచనతో పోలిస్తే ఇప్పుడు ఉన్న ఆలోచన మారిపోతుంది. ఈ విధంగా ప్రతి క్షణం జ్ఞానం మారుతుందనే భావన ఆధారంగా, ఆత్మ క్షణికం అని వారు అంటారు.

జ్ఞానమ్ ఆత్మా ఎన్బార్

ఈ విధంగా ఆత్మను వివరించడం అద్వైత సిద్ధాంతానికి సంబంధించినది. ఆత్మకు జ్ఞానం ఉందని వారు చెప్పరు; ఆత్మే జ్ఞానం అని చెబుతారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఆత్మకు రూపం గానీ, గుణాలు గానీ లేవు; అది జ్ఞానంగానే ఉంటుంది.

విభు ఆత్మా ఎన్బార్

విభు అంటే సర్వవ్యాపకం. ఒకే ఆత్మ అంతటా వ్యాపించి ఉందని కొందరు అంటారు. సాధారణంగా విభువు అని ఎంపెరుమాన్ను మాత్రమే అంటారు; ఆత్మను అణు తత్త్వంగా పరిగణిస్తారు. అయితే కొందరు ఆత్మే విభువు అని అంటారు.

ఆత్మా అనిత్యమ్ ఎన్బార్

కొందరు ఆత్మ అనిత్యము అని అంటారు. అంతేకాక, ఆత్మ నిత్యము కాదని, మార్పులకు లోనవుతుందని, నశించగలదని చెబుతారు. నిత్యం అంటే శాశ్వతమైనది; అనిత్యం అంటే శాశ్వతం కానిది.

ఏకాత్మా ఎన్బార్

ఒకే ఆత్మ మాత్రమే ఉందని కొందరు అంటారు. ఇది కూడా అద్వైత పక్షం. అద్వైత సిద్ధాంతం ప్రకారం ఒకే ఆత్మ ఉంది; ఆ ఆత్మే బ్రహ్మం. ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు, తన గురించి తెలుసుకుని, మిగిలినదంతా అసత్యమని తెలుసుకుంటుంది.

పరిణామి ఆత్మా ఎన్బార్

జైన మతం ప్రకారం ఆత్మ నిరంతరం మారుతూ ఉంటుంది. వారి సిద్ధాంతం ప్రకారం, ఏనుగులో ఉన్న ఆత్మ ఏనుగు పరిమాణంలో ఉంటుంది; చీమలో ఉన్న ఆత్మ చీమ పరిమాణంలో ఉంటుంది. ఏనుగు మరణించి తరువాతి జన్మలో చీమగా పుడితే, ఆత్మ కూడా దానికి అనుగుణంగా తన పరిమాణాన్ని మార్చుకుంటుంది.

స్వతన్త్రమ్ ఆత్మా ఎన్బార్

కొందరు ఆత్మ అణువు అని అంగీకరించినప్పటికీ, అది పూర్తిగా స్వతంత్రం అని, ఏ వస్తువుకూ అధీనమైనది కాదని నమ్ముతారు.

పారతన్త్ర్యమ్ కొళ్ళా నిఱ్కచ్చెయ్దేయుమ్

పారతన్త్ర్యం అంటే అధీనంగా ఉండటం. కొందరుఆత్మను అడిమై (అధీనమైనది) అని అంగీకరించి, అది పరతంత్రం, స్వతంత్రం కాదని చెబుతారు. అయితే భగవానునికి ఆత్మ పరతంత్రం అని అంగీకరించకుండా, వేరొక సిద్ధాంతాన్ని వారు ప్రతిపాదిస్తారు.

కర్మత్తుక్కు పరతన్త్రన్ ఎన్బార్

ఆత్మ కర్మకు అధీనమైనదని కొందరుఅంటారు. అందువల్ల కర్మ ఎలా నడిపిస్తే అలా జీవిస్తాడని వారు అంటారు.

మాతా పితాక్కళుక్కు పరతన్త్రన్ ఎన్బార్

ఆత్మను జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అది అధీనమైనదని కొందరుఅంటారు.

 పిత్రుక్కళుక్కు పరతన్త్రన్ ఎన్బార్

పిత్రులు అంటే వంశంలో పూర్వం జీవించిన పూర్వీకులు. ఆత్మ వారికి పరతంత్రం అని కొందరు అంటారు.

గ్రుహఙ్గళుక్కు పరతన్త్రన్ ఎన్బార్

గృహం అంటే ఇల్లు. ఆత్మ గృహానికి పరతంత్రం అని కొందరు అంటారు. ఇక్కడ గృహానికి పరతంత్రం అంటే ఆ ఇంటిలో నివసించే స్త్రీలకు పరతంత్రం అని అర్థం. ఉదాహరణకు, “నేను ఇంట్లో చెప్పి వస్తాను” అని చెప్పినప్పుడు, భార్యకు తెలియజేసి వస్తామని అర్థం. ఇక్కడ కూడా అదే విధంగా వివరించబడింది. అందువల్ల గ్రుహఙ్గళుక్కు పరతంత్రన్ అంటే గృహిణికి పరతంత్రుడు అని అర్థం. ఈ విధంగా, కొందరు ఆత్మ భార్యకు అధీనమైనదని అంటారు.

అగ్నిక్కు పరతన్త్రన్ ఎన్బార్

ఇక్కడి నుండి ఆత్మ ఇతర దేవతలకు అధీనం అని ప్రతిపాదించిన తత్వాలను ప్రస్తావిస్తున్నారు. అగ్ని ముఖ్యమైన దేవతలలో ఒకరు. యాగం, యజ్ఞంలో ఈ దేవతకు ముఖ్యమైన ఆవాహనం చేస్తాము. ఈ దేవత ద్వారా హవిస్సును సమర్పిస్తాము. ఆత్మ అగ్ని దేవతకు పరతంత్రం అని కొందరు అంటారు.

ఈ లోకంలో అనేక తత్త్వశాస్త్రాలు ఉన్నాయి. నమ్మాళ్వార్  తిరువిరుత్తం 96లో “వణఙ్గుమ్ తుఱైగళ్ పలపలవాక్కి, మదివిగఱ్పాల్ పిణఙ్గుమ్ శమయమ్ పలపలవాక్కి ” అని అంటారు.. (ప్రజలు తమ లక్ష్యాలను పొందడానికి అనేక మార్గాలను నీవు సృష్టించావు; బుద్ధి స్థాయిలు మరియు దేవతలలోని భేదాల వల్ల అనేక తత్త్వాలను సృష్టించావు.) ఈ విధంగా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న వివిధ తత్త్వశాస్త్రాలన్నీ ఇక్కడ ఒకచోట సమీకరించబడ్డాయి.

ఇన్ద్రనుక్కు పరతన్త్రన్ ఎన్బార్

ఇంద్రుడు ఒక ముఖ్యమైన దేవత. స్వర్గలోకం వరకు ఉన్న అన్ని లోకాలకు అతడు నాయకుడు. ఇతర దేవతలందరూ ఇంద్రునికి అధీనులుగా ఉంటారు. ఆత్మ ఇంద్రునికి పరతంత్రం అని కొందరు అంటారు.

బ్రహ్మా వుక్కు పరతన్త్రన్ ఎన్బార్

బ్రహ్మ సృష్టికి సంబంధించిన దేవత. ఎంపెరుమాన్ యొక్క దివ్య నాభి నుండి ఆయన జన్మించారు. ఎంపెరుమాన్ మొదట బ్రహ్మకు వేదాన్ని ఉపదేశించి, ఆయన ద్వారా వేదం ప్రపంచమంతటా వ్యాపించేలా చేశారు. బ్రహ్మను లోకగురువుగా పరిగణిస్తారు. అయితే, కొందరు ఆత్మ బ్రహ్మకు అధీనమైనది (అడిమై) అని అంటారు.

రుద్రనుక్కు పరతన్త్రన్ ఎన్బార్

రుద్రుడు బ్రహ్మకు కుమారుడైన ఒక దేవత. ఆయన ప్రపంచంలో ప్రసిద్ధుడు; ఆయనకు అనేక భక్తులు ఉన్నారు. దీనివల్ల కొందరు ఆత్మ రుద్రునికి అధీనమైనది (అడిమై) అని అంటారు.

ఈ వాదాలలో కొన్ని వేదంలోని కొన్ని భాగాలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఏర్పడినవి. శైవ ఆగమాలు కూడా ఉన్నాయి. ఆ ఆగమాలలోని విషయాల ఆధారంగా, ఆత్మ రుద్రునికి పరతంత్రం అని కొందరు అంటారు.

ఇదేవిధంగా ప్రతి వ్యక్తి తనదైన తత్త్వాన్ని కలిగి ఉంటాడు.

ఏకాయన ఎమ్పేరుమానుక్కు పరతన్త్రన్ ఎన్బార్

ఆత్మ ఏకాయన ఎంపెరుమాన్కు పరతంత్రం అని కొందరు అంటారు, అంటే శ్రీమన్నారాయణుడు కాదు, కేవలం నారాయణుడే అని. ఏకాయన మతం ఒక ప్రత్యేకమైన మతం. సాధారణంగా ద్వైతులను ఏకాయనులు అని అంటారు.

ఇప్పడి బహుప్రకారఙ్గళినాలే విప్రతిపత్తి పణ్ణువర్గళ్

ఈ విధంగా ఈ లోకంలో అనేకమంది అనేక విధాలుగా తప్పుగా అర్థం చేసుకున్నారు.

దీని ఫలితంగా ఆత్మ యొక్క నిజమైన స్వరూపాన్ని వేర్వేరు విధాలుగా అర్థం చేసుకున్నారు- ఆత్మ, శరీరం రెండూ ఒకటేనా, లేక ఆత్మ, శరీరం వేర్వేరా; ఆత్మ స్వతంత్రుడా లేదా పరతంత్రుడా అనే విషయాలలో భేదాలు ఉన్నాయి. అంతేకాక, ఆత్మ పరతంత్రుడు అయితే, ఎవరికి అధీనుడు? ఈ విధంగా ఈ లోకంలో అనేక విషయాల విషయంలో గందరగోళం ఏర్పడి, అనేక తత్త్వశాస్త్రాలు, సిద్ధాంతాలు ఉద్భవించాయి.

తరువాత, నిజమైన తత్త్వం ఏమిటి? ఈ భిన్నమైన సిద్ధాంతాలలోని లోపాలు ఏమిటి? నిజమైన తత్త్వం ఏమిటి? అనేది తెలుసుకుందాము.

ఇవై విప్రతిపత్తియాగిఱపడి ఎఙ్గనే యెన్నిల్

ఇవి ఏ విధంగా తప్పుగా అర్థం చేసుకోబడ్డాయో తరువాత వివరించబడుతుంది.

కాలుమ్ కైయుమ్ పోనాలుమ్ ఇరుక్క కాణ్గైయాలే కరణఙ్గళ్ ఆత్మా వాగమాట్టాదు

కరణాలే ఆత్మ అని కొందరు చెప్పిన విధానాన్ని ఇంతకు ముందు చూశాము. ఇక్కడ కరణాలు అంటే చేతులు, కాళ్లు మొదలైన శరీర భాగాలు. అయితే చేతులు, కాళ్లు పోయినా ఆత్మ కొనసాగి ఉండటాన్ని మనం చూస్తాము; అవయవాలు లేని వారిలో కూడా జీవితం కొనసాగుతుంది. ఆత్మ అంటే జ్ఞానం కలిగి ఉండి, కార్యాలను చేయడానికి ప్రేరేపించేది. ఆత్మ జ్ఞానం కలిగినది, చేతులు, కాళ్లు లేకపోయినా అది కొనసాగుతుంది కాబట్టి, ఈ చేతులు, కాళ్లు ఆత్మ కాలేవు.

కణ్ణుమ్ శెవియుమ్ కెట్టాలుమ్ ఇరుక్క  కాణ్గైయాలే ఇన్ద్రియఙ్గళ్ ఆత్మా వాగమాట్టాదు

కొందరు ఇంద్రియాలే ఆత్మ అని అంటారు. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు- కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. బాహ్య శరీర భాగాలే ఇంద్రియాలు కావు; ఈ శరీర భాగాలలోని అంతరంగికమైన ఇంద్రియశక్తులనే ఇంద్రియాలు అంటారు. ఉదాహరణకు, కొంతమందికి కళ్ళు ఉన్నప్పటికీ కనిపించదు. అదేవిధంగా చెవులు ఉన్నప్పటికీ కొంతమందికి వినిపించదు; నోరు ఉన్నప్పటికీ కొంతమందికి మాట్లాడటం సాధ్యం కాదు. కళ్ళు లేదా చెవులు లేకపోయినా ఆత్మ ఉండటం వలన, ఇంద్రియాలే ఆత్మ అని చెప్పలేము.

మనస్సు జడమాగైయాలే ఆత్మావాగ మాట్టాదు

ఆత్మకు జ్ఞానం ఉంటుంది. మనస్సుకు జ్ఞానం ఉండదు; అది జడము. మనకు మనస్సు ద్వారా జ్ఞానం కలుగుతుంది, కానీ మనస్సుకు స్వయంగా జ్ఞానం ఉండదు. అందువల్ల మనస్సు ఆత్మ కాదు.

ప్రాణన్ వాయు విశేషమాగైయాలే ఆత్మావాగ మాట్టాదు

ప్రాణన్ ఒక వాయు విశేషం. మన శరీరంలో ప్రాణవాయువు, అపానవాయువు మొదలైన అనేక వాయువులు ప్రవహిస్తాయి. ఇవి వాయువులు కాబట్టి ఆత్మ కాలేవు.

ఒరుకరణత్తుక్కు వన్ద క్లేశత్తాలే, మత్తుక్కరణఙ్గళుమ్ క్లేశిక్క క్కాణ్గైయాలే- తనిత్తనియే ఆత్మా వాగమాట్టాదు

ఒక కరణానికి లోపం కలిగితే, ఇతర కరణాలు కూడా ప్రభావితమవుతాయి. ఉదాహరణకు, చేతికి దెబ్బ తగిలినప్పుడు కళ్ళలో నీళ్లు రావచ్చు లేదా మనస్సులో అసౌకర్యం కలగవచ్చు. ఇవన్నీ పరస్పరం సంబంధం కలిగి ఉండటం వలన, ఒక్కొక్కటి ప్రత్యేకమైన ఆత్మ అని చెప్పలేము.

ఇవత్తినుశైయ సముదాయమాన శరీరమ్ ఆత్మావాగ మాట్టాదు

మొత్తం శరీరమే ఆత్మ అని కొందరు అంటారు. కానీ అలా చెప్పలేము. సంభాషణలో “నీ శరీరం”, “నీ చెయ్యి”, “నీ కాలు” అని అంటాము. అంటే “నీవు” నీ చెయ్యి, నీ కాలు, నీ శరీరం కంటే భిన్నమైనవాడివి. ఈ శరీరం నాకు అధీనమైనదని మనం చెప్పడం ద్వారా, “నేను” శరీరానికి భిన్నమైనవాడినని తెలుస్తుంది.

ఎఙ్గనేయెన్ని ల్; ఎన్నుడైయ కాల్ ఎన్నుడై యకై ఎనక్కు శరీరమ్ విధేయమాయ్ త్తు ఎన్గైయాలుమ్

రోజువారీ సంభాషణలో కూడా “నా శరీరం”, “నా చెయ్యి”, “నా కాలు” అని అంటాము. ఇది నీవు చెయ్యి, శరీరం కంటే భిన్నమైనవాడివని స్పష్టంగా చూపిస్తుంది. మన రోజువారీ భాషలోనే ఇది స్పష్టమవుతుంది. అంతేకాక, ఈ శరీరం నాకు అధీనమైనదని మనం చెప్పడం వలన, శరీరం “నేను” అనే దానికంటే వేరైనదని నిరూపించబడుతుంది.

మాతా పితాక్కళ్ శెత్త వనన్తరమ్ కాణ్గిర శరీరత్తిల్ ఒన్ఱుమ్ముగమ్మాఱిప్పోగామే కిడక్క , అప్పా ! ఎఙ్గుప్పోనాయ్? అమ్మా ఎఙ్గుప్పో నాయ్? ఎన్ఱు

తల్లి లేదా తండ్రి మరణించినప్పుడు ఆత్మ శరీరాన్ని విడిచిపోతుంది. శరీరంలో వెంటనే ఎటువంటి బాహ్య మార్పు కనిపించదు,  ముఖం అలాగే ఉంటుంది, ఇంకా మన తండ్రి లేదా తల్లి లాగానే కనిపిస్తారు. అయినప్పటికీ మనం “అమ్మా, ఎక్కడికి వెళ్లావు?” “నాన్నా, ఎక్కడికి వెళ్లారు?” అని అడుగుతాము.

శరీరం మన ముందే అలాగే ఉంటుంది. అయినప్పటికీ వారు ఎక్కడికి వెళ్లారని అడగాలనే మన సహజ ప్రవృత్తి ఆత్మ లేనిదని చూపిస్తుంది. మనం “తండ్రి” అని పిలిచిన ఆత్మ ఇక ఆ శరీరంలో లేదు; శరీరం మాత్రమే మిగిలి ఉంది. అందువల్ల మొత్తం శరీరాన్ని కూడా ఆత్మ అని పిలవలేము. శరీరం పూర్తిగా అలాగే ఉండి కూడా “ఎక్కడికి వెళ్లావు?” అని అడగడం ద్వారా ఆత్మ ఇక శరీరంలో లేదని తెలుస్తుంది. దీని ద్వారా ఆత్మ, శరీరం వేర్వేరు అని తెలుస్తుంది.

మున్నాళ్ ఆధరిత్తుప్పోన్ద శరీరన్దన్నై , అరై నాళిగై అగత్తిల్ కిడక్కవుమ్ పోఱాదే “శవమ్” ఎన్ఱు పేరిట్టు

తండ్రి, తల్లి లేదా మరెవరైనా బంధువులు జీవించి ఉన్నప్పుడు మనం వారిని ఆదరిస్తాము, వారితో మాట్లాడుతాము, ప్రేమతో విషయాలను పంచుకుంటాము. కానీ ఆత్మ శరీరాన్ని విడిచిన వెంటనే, నిర్దేశించిన సమయంలో అంత్యక్రియలను పూర్తి చేయాలని అంటాము. అంతేకాక, మరొక అరగంట ఆలస్యం అయినా, ఆలస్యం ఎందుకు జరుగుతోందని అడగడం ప్రారంభిస్తాము. ఆ వ్యక్తితో మన జీవితాన్ని సంతోషంగా గడిపి, అన్నింటినీ పంచుకున్నప్పటికీ, ఆత్మ శరీరాన్ని విడిచిన వెంటనే, “ఈ శరీరాన్ని ఇంతసేపు ఎందుకు ఉంచుతున్నాము?” అని అడుగుతాము. ఆత్మ శరీరాన్ని విడిచిన వెంటనే, దాదాపు వెంటనే ఆ శరీరాన్ని శవం అని పిలుస్తాము.

దర్శిత్త దోషత్తుక్కు నెయ్యుమ్ నెరుప్పుమ్ కొణ్డు కుళిక్కైయాలుమ్

శవాన్ని చూసినప్పుడు, దాని వల్ల కలిగిన తీట్టు (ఆచారపరమైన అపవిత్రత)ను తొలగించుకోవడానికి స్నానం చేయాలి. నెయ్యి దీపాన్ని వెలిగించి, స్నానం చేసిన తరువాతే లోపలికి రావాలి. ఇవి సాధారణంగా పాటించే విధానాలు. అయితే శ్రీవైష్ణవ తిరుమేనికి ఇవి స్పష్టంగా వర్తించవు, ఎందుకంటే శ్రీవైష్ణవ తిరుమేని దివ్యమైన, అమరమైన శరీరంగా పరిగణించబడుతుంది.

అఙ్ఞరుఙ్గూడ శవ శరీరత్తిల్ ఆత్మ బుధ్ధి పణ్ణామైయాలే – శరీరమ్ ఆత్మా వాగమాట్టాదు

ఒక అజ్ఞాని కూడా ప్రాణంలేని శరీరాన్ని చూసి, “అతను ఇందులో ఉన్నాడు” అని చెప్పినప్పుడు, “లేదు, అతను ఇందులో లేడు; ఇది ఇప్పుడు కేవలం ఒక శవం” అని అంటాడు. ఒక అజ్ఞాని కూడా దీనిని అర్థం చేసుకోగలడు. అందువల్ల శరీరం ఆత్మ కాదు. శరీరం, ఆత్మ ఒకటే అని చెప్పలేము, ఎందుకంటే అవి రెండూ ఒకటే అని ఎవరూ అంగీకరించరు.

ఇవన్ ఇరున్దపోదు జ్ఞానమ్ నడైయాడుగైయాలే జడమ్ ఆత్మావాగ మాట్టాదు

ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు జ్ఞానం ఉంటుంది. ఆత్మ అన్ని కార్యాలను కోరుకుని, వాటికి అనుగుణంగా వ్యవహరిస్తుంది. జ్ఞానం లేని జడ వస్తువులు ఆత్మ కాలేవు. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు జ్ఞానం వ్యక్తమవుతుంది కాబట్టి, జడపదార్థాలు ఆత్మ కాలేవు.

మున్బు శెయ్ద కార్యమ్ సొల్లుగైయాలే క్షణికమ్ ఆత్మా వాగమాట్టాదు

బౌద్ధ సిద్ధాంతం ప్రకారం క్షణికమే ఆత్మ. అయితే, ముందు రోజు జరిగిన విషయాన్ని మనం గుర్తుంచుకోగలగడం ద్వారా ఇది తప్పని తెలుస్తుంది. మన జ్ఞాపకం నశించలేదు కాబట్టి, గత జ్ఞానాన్ని మనం నిలుపుకోగలుగుతున్నాము. కొత్త జ్ఞానం పొందినప్పుడు పూర్వపు జ్ఞానం పూర్తిగా నశించి ఉంటే, మనం గతాన్ని పూర్తిగా మర్చిపోయేవాళ్ళం.

ప్రతిసారీ కొత్తగా ఏదైనా నేర్చుకున్నప్పుడు గతంలో పొందిన జ్ఞానాన్ని మర్చిపోతే, క్షణికమే ఆత్మ అని చెప్పవచ్చు. కానీ అలా జరగడం లేదు. పది సంవత్సరాల క్రితం జరిగిన విషయాలను, చిన్ననాటి విషయాలను కూడా మనం గుర్తుంచుకోగలము. అందువల్ల ఆత్మను క్షణికం అని పిలవలేము. ఆత్మ యొక్క జ్ఞానం మారవచ్చు; అంటే గతంలో మనకు ఉన్న జ్ఞానం ప్రస్తుత స్థితిలో ఉన్న జ్ఞానానికి భిన్నంగా ఉండవచ్చు, మరియు వయస్సు పెరిగేకొద్దీ అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆత్మ యొక్క జ్ఞానం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు, కానీ ఆత్మ మాత్రం మారదు.

నాన్ ఇత్తైచ్చెయ్యా నిన్ఱేనెన్గైయాలే-జ్ఞానమ్ ఆత్మా వాగమాట్టాదు

“జ్ఞానమే ఆత్మ” అనేది అద్వైత సిద్ధాంతం. జ్ఞానమే ఆత్మ, దాని తప్ప మరేమీ లేదని అది చెబుతుంది. అయితే అలా చెప్పలేము, ఎందుకంటే మనం సాధారణంగా “నాకు జ్ఞానం ఉంది”, “నేను ఈ కార్యాలను చేయాలని కోరుకుంటున్నాను” అని అంటాము. ఈ మాటలు “నేను” జ్ఞానం కంటే భిన్నమైనవాడినని తెలియజేస్తాయి. అందువల్ల జ్ఞానం ఆత్మ కాదు.

ఆత్మా శరీరత్తిల్ నిన్ఱుమ్ పుఱప్పట్టుప్పోమ్బోదు శుత్తిలిరున్దార్కు త్తెరియామైయాలే విభు ఆత్మా వాగమాట్టాదు

ఒక సిద్ధాంతం ప్రకారం ఆత్మ విభువు. విభు అంటే అంతటా వ్యాపించి ఉండటం, ఎంతో విస్తారంగా ఉండటం. సాధారణంగా ఇది బ్రహ్మానికి చెప్పబడుతుంది; కొందరు దీనిని ఆత్మకు ఆపాదించారు. అయితే ఇది సరైనది కాదు, ఎందుకంటే ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు అది కళ్ళకు కనిపించదు. ఆత్మ శరీరాన్ని విడిచిందని మనకు తెలుసు, కానీ అది ఎలా బయటికి వెళ్లిందో మనం చూడలేము. అందువల్ల ఆత్మను విభువు అని చెప్పలేము. ఆత్మ పెద్దదైన విభువు అయితే, శరీరాన్ని విడిచేటప్పుడు కళ్ళకు కనిపించాలి. అది కనిపించదు కాబట్టి విభువు అని చెప్పలేము.

పోనజన్మమ్ శిలధర్మఙ్గళై చ్చెయ్గయాలే ఇజ్జన్మ మ్ సుఖమాయిరున్దోమ్; ఇజ్జన్మముమ్ శిల సుకృతన్గళైచ్చెయ్దాల్, వరుగిఅ జన్మముమ్ సుఖమాయిరుక్కలామెన్ఱు శెయ్యక్కాణ్గైయాలుమ్, శరీరత్తైవిట్టుప్పోయ్ స్వర్గాద్యనుభవమ్ పణ్ణువదాగ జ్యోతిష్టోమాది సాధనత్తిలే ఇళిగైయాలుమ్, ఆత్మా అనిత్య మాగమాట్టాదు

ఒక సిద్ధాంతం ప్రకారం ఆత్మ అనిత్యము. అయితే సనాతన ధర్మం ప్రకారం ఆత్మ నాశనం లేనిది. భౌతిక శరీరం మారుతూ ఉన్నప్పటికీ ఆత్మ అదే విధంగా ఉంటుంది. దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. గత జన్మలలో కొన్ని కర్మలు చేయడం వల్ల ఈ జన్మలో మనం సుఖంగా జీవిస్తున్నాము. ప్రస్తుత జీవితంలో మనం అనుభవించే సుఖం గత జన్మలలో సంపాదించిన పుణ్యం వల్ల అని సాధారణంగా చెబుతారు. ఈ అవగాహన శాస్త్రం ద్వారా పొందిన జ్ఞానం నుండి వస్తుంది.

అదేవిధంగా, మంచి కార్యాలు చేస్తే తరువాతి జన్మ మంచిగా ఉంటుందని అందరికీ తెలుసు. జ్యోతిష్టోమ హోమం చేస్తే స్వర్గాన్ని పొందుతారని శాస్త్రం చెబుతుంది. దీని అర్థం హోమం చేసినవాడు ప్రస్తుత శరీరంతో స్వర్గానికి వెళ్తాడని కాదు. ప్రస్తుత శరీరం పడిపోయిన తరువాత, ఆ హోమం చేసినవాడు తరువాతి జన్మలో స్వర్గాన్ని పొందుతాడు. ఈ ప్రక్రియను అంగీకరించడం అంటే ఆత్మ నిత్యమైనది అని అంగీకరించడం. ఆత్మ నిత్యమైనదైతేనే, ప్రస్తుత శరీరం పడిపోయిన తరువాత మరొక శరీరాన్ని ధరించి స్వర్గాన్ని అనుభవించగలదు. స్వర్గాన్ని పొందడానికి ఈ కర్మలను చేసే వారిని, దాన్ని అనుభవించడానికి మరొక శరీరాన్ని పొందవలసి ఉంటుందని మనం చూస్తున్నందున, ఆత్మ నిత్యమైనది అని చెప్పవచ్చు. అందువల్ల ఆత్మ అనిత్యము కాదు.

ఒరు చేతనన్ సుఖిక్క, ఒరు చేతనన్ దుఃఖిక్క , ఒరు చేతనన్ నలియ, ఒరు చేతనన్ నలివుపడకాణ్గైయాలుమ్ ఏకాత్మా వాగమాట్టాదు

మరొక సిద్ధాంతం ప్రకారం ఒకే ఆత్మ మాత్రమే ఉంది. ఈ సిద్ధాంతాన్ని అనుసరించేవారు, ఈ ఒక్క ఆత్మే అన్ని సుఖదుఃఖాలను అనుభవిస్తుందని అంటారు. కానీ వాస్తవంలో అలా జరగడం లేదని స్పష్టంగా చూడవచ్చు. వేర్వేరు వ్యక్తులు వేర్వేరు విషయాలను అనుభవిస్తున్నారని మనం చూస్తాము. ఒకరు సుఖంగా ఉంటే మరొకరు దుఃఖంగా ఉంటారు. కొందరు వ్యాధితో బాధపడుతుంటే మరొకరు సంపదను పొందుతారు. ఒకరికి జరిగేది మరొకరికి జరగడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఒకరు మరొకరికి బాధ కలిగించడం, మరొకరు ఆ బాధను అనుభవించడం కూడా మనం చూస్తాము. దీని ద్వారా వేర్వేరు ఆత్మలు వేర్వేరు కార్యాలను చేస్తున్నాయని తెలుస్తుంది. అందువల్ల ఒకే ఆత్మ అనే సిద్ధాంతం సరైనది కాదు.

పిఱన్దవన్ఱు శాగిఱ ప్రజైయినుడైయ ఆత్మా వోడు,నూఱు వయస్సు ప్పుక్కు శాగిఱవనుడైయ ఆత్మా వోడు వాశియఱక్కణ్ణుక్కు త్తెరియామైయలే, పరిణామి ఆత్మా వాగమాట్టాదు

జైన సిద్ధాంతం ప్రకారం, ఆత్మ తాను ఉన్న శరీరాన్ని బట్టి పరిమాణాన్ని మార్చుకుంటుంది. ఉదాహరణకు, ఏనుగు శరీరంలోని ఆత్మ ఏనుగు పరిమాణంలో ఉంటుంది; చీమ శరీరంలోని ఆత్మ చీమ పరిమాణంలో ఉంటుంది. అయితే ఈ భావన సమంజసం కాదు. ఒక శిశువు పుట్టిన వెంటనే మరణించినా, మనం ఆత్మను చూడలేము. అలాగే నూరు సంవత్సరాలు జీవించిన వ్యక్తి మరణించినప్పుడు కూడా, ఆత్మ శరీరాన్ని విడిచిపోతున్నట్లు మనం చూడలేము. ఆత్మ బయటికి వెళ్లడాన్ని మనం చూడలేకపోతున్నందున, ఆత్మ పరిమాణాన్ని నిర్ణయించలేము. వాస్తవానికి అన్ని ఆత్మలు అణువులే. అందువల్ల ఆత్మ పరిమాణం మారుతుందనే భావన సరైనది కాదు.

తనక్కు అనిష్ఠమాన దుఃఖత్తై పోక్కిక్కొళ్ళ మాట్టామైయాలుమ్, ఇష్టమాన సుఖత్తై అళైత్తుక్కొళ్ళ మాట్టామైయాలుమ్, తాన్ శెయ్గిఱేన్ ఎన్ఱ కార్యత్తై శెయ్దుతలై క్కట్ట మాట్టామైయాలుమ్, స్వతన్త్రమ్ ఆత్మా వాగ మాట్టాదు

కొందరు ఆత్మ స్వతంత్రం అని అంటారు.  “నేనే నా రాజును; నన్నెవరూ నియంత్రించలేరు” అనేది వారి భావన. కొందరు దీనిని బోధిస్తారు. అయితే వాస్తవంలో ఇది సాధ్యం కాదు. ఒక వ్యక్తి బాధను అనుభవిస్తున్నప్పుడు, తనకు ఇష్టం వచ్చినట్లు ఆ బాధను తొలగించుకోలేడు, ఎందుకంటే బాధ అనేక పరిస్థితులు, కారణాల వల్ల కలుగుతుంది; దాని అంతర్లీన కారణాలు తొలగిపోయినప్పుడే అది తొలగిపోతుంది. మనం నిజంగా స్వతంత్రులమైతే, మనకు ఇష్టం వచ్చినదంతా చేయగలగాలి; మన బాధలను కూడా వెంటనే తొలగించుకోగలగాలి. చిన్న బాధలను మనం పరిష్కరించగలిగినా, పెద్ద బాధలను పరిష్కరించలేము. కొందరు తీవ్రమైన కష్టాలను అధిగమించవచ్చు, కానీ మరణం వల్ల కలిగే బాధ నుండి ఎవరూ తప్పించుకోలేరు. అదేవిధంగా, ఒక వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉండి, క్రమంగా వ్యాయామం చేసినప్పటికీ, కొన్ని వ్యాధుల వల్ల కలిగే బాధలను నిరోధించలేకపోవచ్చు. అందువల్ల ఆత్మ స్వతంత్రం కాదని నిర్ధారించవచ్చు.

అంతేకాక, మనం కోరుకున్న సుఖాన్ని కూడా తరచుగా పొందలేము, ఎందుకంటే కొన్ని బాహ్య పరిస్థితులు నెరవేరాలి. మన నియంత్రణలో ఉన్న కొన్ని విషయాలను మాత్రమే అనుభవించగలము; మన నియంత్రణకు బయట ఉన్న అనేక విషయాలు ఉన్నాయి. మనం నిజంగా స్వతంత్రులమైతే, అన్నింటినీ నియంత్రించగలగాలి. అందువల్ల ఆత్మ స్వతంత్రం కాదు.

ఆత్మ స్వతంత్రం కాదని నిరూపించే మరో ఉదాహరణ: ఒక వ్యక్తి సత్సంగానికి వెళ్లి మూడు గంటల పాటు సద్విషయాన్ని వినాలని నిర్ణయించుకున్నాడనుకుందాము. కేవలం ఒక గంట తరువాతే అతనికి నిద్ర రావచ్చు లేదా చేతులు, కాళ్లు నొప్పి పెట్టవచ్చు. మూడు గంటలు పాల్గొనాలని నిర్ణయించుకున్నప్పటికీ, అతను ఒక గంట మాత్రమే పాల్గొనగలడు. ఇక్కడ కూడా ఇదే విషయాన్ని “తాన్ శెయ్గిఱేన్ ఎన్ఱ కార్య త్తై శెయ్దుతలై క్కట్ట

మాట్టామైయాలుమ్” అని చెబుతున్నా రు, అంటే, ఒక కార్యాన్ని పూర్తిచేయాలని నిర్ణయించుకున్నప్పటికీ దాన్ని పూర్తి చేయలేకపోవడం. మనం ఒక మంచి కార్యాన్ని చేయాలని నిర్ణయించుకోవచ్చు, కానీ అడ్డంకుల కారణంగా దాన్ని కొనసాగించలేకపోవచ్చు. ఈ పరిమితుల వల్ల ఆత్మ స్వతంత్రం కాదు; ఆత్మ పరతంత్రం.

ఆత్మ భగవానుని కాకుండా ఇతర వస్తువులకు పరతంత్రం అని చెప్పే సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, పై విషయాల ద్వారా అవి ఖండించబడ్డాయి.

కర్మ త్తుక్కు పరతన్త్రనాగమాట్టాన్ అదు అచేతనమాగైయాలే

కర్మ ఒక కార్యం; అది అచేతన వస్తువు. మనం ఒక కార్యాన్ని, ఉదాహరణకు జ్యోతిష్టోమాన్ని, చేసినప్పుడు, ఆ యాగం ఫలితంగా దాన్ని చేసినవాడు కొన్ని ఫలితాలను పొందుతాడు. అయితే యాగానికి స్వయంగా జ్ఞానం లేదు; అది చేయబడినందువల్ల మాత్రమే జరుగుతుంది. ఒక యాగం స్వయంగా ఏ కార్యాన్నీ వ్యక్తం చేయదు లేదా చేయదు. అదేవిధంగా, యాగం యొక్క ఫలాన్ని కూడా యాగమే స్వయంగా ఇవ్వదు. బదులుగా, భగవాన్ యాగం యొక్క ఫలితాలను ఇస్తాడు. అందువల్ల కర్మ అచేతనం కాబట్టి, ఆత్మ కర్మకు పరతంత్రం కాలేడు.

ఇవనుడైయ ఆపన్ని వారణమ్ పణ్ణ మాట్టామైయాలే మాతా పితాక్కళుక్కు పరతన్త్రనాగమాట్టాన్

మరికొన్ని సిద్ధాంతాలు ఆత్మ తల్లి-తండ్రులకు పరతంత్రం అని చెబుతాయి. అయితే ఆత్మకు కష్టం వచ్చినప్పుడు, తల్లిదండ్రులు అన్ని సమస్యలను పరిష్కరించలేరు; తమ పరిమిత సామర్థ్యంలో మాత్రమే సహాయం చేయగలరు. అందువల్ల ఆత్మ తల్లి మరియు తండ్రికి పరతంత్రం కాలేడు.

రక్షకత్వమ్ ఇల్లామైయాలే పితృక్కళుక్కు  పరతన్త్రనాగ మాట్టాన్

పిత్రులు మనలను రక్షించగలరా, మనకు కావలసినదాన్ని అందించి మన అడ్డంకులను తొలగించగల శక్తి వారికి ఉందా అనే ప్రశ్న వస్తుంది. పితృలకు అటువంటి శక్తి లేదు. వారు మనలను ఆశీర్వదించి మనకు మేలు కోరగలరు, కానీ అన్ని పరిస్థితులలో మనలను రక్షించలేరు. అందువల్ల ఆత్మ పిత్రులకు పరతంత్రం కాలేడు.

ఇప్పడి ఆగైయాలే గృహఙ్గళుక్కు పరతన్త్రనాగ మాట్టాన్

ఇక్కడ ఆత్మ భార్యకు పరతంత్రం కాలేడని ఖండించబడుతోంది. భార్య అన్ని సమయాలలో మనలను రక్షించలేరు; అందువల్ల ఆత్మ గృహిణికి పరతంత్రం కాలేడు.

అచిత్తాగైయాలుమ్, తన్నై ప్పిఱర్ రక్షిక్క వేణ్డుగైయాలుమ్, ఆశ్రయాశియాగైయాలుమ్, అగ్నిక్కు పరతన్త్రనాగ మాట్టాన్

కొందరు తత్వవేత్తలు ఆత్మ అగ్నికి పరతంత్రం అని అంటారు.  అయితే అగ్ని అచిత్. అగ్నికి ఒక దేవత ఉన్నప్పటికీ, అగ్ని స్వయంగా అచిత్; అందువల్ల అది మనలను రక్షించలేదు. అంతేకాక, ఒక వ్యక్తి అగ్నిని వెలిగించాలి, అది మండుతూ ఉండేలా కూడా చూసుకోవాలి. అగ్నికి మరొకరు రక్షణ అవసరం కాబట్టి, అది మనలను రక్షించలేదు. అగ్ని ఆశ్రయాశి, అంటే అందులో ప్రవేశించినదాన్ని భస్మం చేసి నాశనం చేసేది. అందువల్ల ఆత్మ అగ్నికి పరతంత్రం కాలేడు.

శాపోపహతనాగైయాలుమ్, తన్నుడైయ రాజ్యత్తై ప్పిఱర్ కైయిలే పఱికొడుత్తు క్లేశిక్కై యాలుమ్ ఇన్ద్రనుక్కు పరతన్త్రనాగ మాట్టాన్

కొన్ని సిద్ధాంతాలు ఆత్మ ఇంద్రునికి పరతంత్రం అని చెబుతాయి. అయితే ఇంద్రుడు స్వయంగా ఋషి దుర్వాసుని శాపానికి గురై బాధపడ్డాడు. అతడు తన రాజ్యాన్ని కూడా కోల్పోయి, తిరుగుతూ బాధపడ్డాడు. కోల్పోయిన తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి అతడు భగవానుని ప్రార్థించవలసి వచ్చింది. అందువల్ల ఆత్మ ఇంద్రునికి పరతంత్రం కాలేడు.

మధుకైటభర్ కైయిలే వేదత్తైప్పఱి కొడుక్కై యాలుమ్, రుద్రనాలే నలియప్పడుగై యాలుమ్ బ్రహ్మా వుక్కు పరతన్త్రనాగ మాట్టాన్

మధు, కైటభ అనే ఇద్దరు అసురులు బ్రహ్మ వద్ద నుండి వేదాన్ని దొంగిలించారు. బ్రహ్మ స్వయంగా వేదాన్ని కోల్పోయి బాధపడ్డందున, అతడు ఆత్మలకు నాయకుడు కాలేడు.

అంతేకాక, బ్రహ్మ రుద్రుని చేత బాధించబడ్డాడు. రుద్రుడు బ్రహ్మ యొక్క ఒక తలను పెకలించాడు. ఈ సంఘటన వల్ల బ్రహ్మ బాధపడ్డాడు. బాధపడినందున ఆత్మ బ్రహ్మకు ఎలా అధీనంగా ఉండగలడు అనే ప్రశ్న వస్తుంది.

తాన్ అభిమానిత్త బాణనై క్కాట్టి క్కోడుత్తు త్తన్నై క్కొణ్డు నెగిళ నిఱై యాలుమ్, బ్రహ్మ శిరస్సు తన్ కైయిలే యొట్టిక్కిడక్క , సర్వేశ్వరన్ పక్కలిలే శెన్ఱు ఎన్ ఆపత్తై ప్పోక్కి యరుళ వేణుమ్ ఎన్ఱు నోక్కిక్కొళ్ళుగైయాలుమ్ రుద్రనుక్కు పరతన్త్రనాగ మాట్టాన్

బాణాసురుని సంఘటనలో, అతని కుమార్తె ఉష కృష్ణుని మనవడు అనిరుద్ధుని ప్రేమించింది. వారు కలిసి జీవించడం ప్రారంభించారు. ఇది తెలిసినప్పుడు బాణాసురుడు వారిని బంధించాడు. ఇది విని కృష్ణుడు బాణాసురునితో యుద్ధం చేశాడు. ఇంతకు ముందు రుద్రుడు బాణాసురునికి ఒక వరాన్ని ఇచ్చి, అతనికి ప్రమాదం వచ్చినప్పుడల్లా రక్షిస్తానని వాగ్దానం చేశాడు. యుద్ధ సమయంలో రుద్రుడు కృష్ణునికి ఎదురు నిలిచి ఆయనతో యుద్ధం చేశాడు. కానీ యుద్ధంలో ఓడిపోయి పారిపోయాడు. పారిపోతూ బాణాసురుని వదిలి, తాను అతన్ని రక్షించలేనని, ఇక అతని రక్షణ బాధ్యత అతనిదేనని చెప్పాడు. ఈ సంఘటన వల్ల ఆత్మ రుద్రునికి పరతంత్రం కాలేడని చెప్పవచ్చు, ఎందుకంటే రుద్రుడు తన పరిమితులకు లోబడి ఉన్నాడు.

మరో సంఘటన కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తుంది. రుద్రుడు బ్రహ్మ యొక్క ఒక తలను పెకలించినప్పుడు, ఆ రుద్రుడు బదరికాశ్రమానికి వెళ్లి ఎంపెరుమాన్ను ప్రార్థిస్తూ, “ఈ కపాలం నా చేతికి అంటుకుని ఉంది; దాన్ని వదిలించుకోవడానికి దయచేసి నాకు సహాయం చేయాలి” అని అన్నాడు. ఎంపెరుమాన్ తన దివ్య వక్షస్థలం నుండి వెలువడిన దివ్య చెమటను ఆ కపాలంపై చిలకరించగా, అది పగిలిపోయి రుద్రుడు ఆ కపాలం నుండి విముక్తి పొందాడు (కపాల మోక్షం). రుద్రుడు పరమేశ్వరుని సహాయం కోసం ఎంపెరుమాన్ వద్దకు వెళ్లడం వల్ల, ఆత్మ రుద్రునికి పరతంత్రం కాలేడని మరింత స్పష్టమవుతుంది.

తిరుమాలే! నానుమునక్కు ప్పళవడియేన్ ఎన్గైయాలే- ఏకాయననాన ఎమ్పెరుమానుక్కు  పరతన్త్రనాగ మాట్టాన్

ఆత్మ తన భార్యతో కలిసి ఉన్న పెరుమాళ్ కు కాకుండా, ఒంటరిగా ఉన్న పెరుమాళ్కు మాత్రమే పరతంత్రం అని ఒక సిద్ధాంతం చెబుతుంది. ఏకాయన అంటే పెరుమాళ్ పూర్తిగా ఒంటరిగా ఉన్న స్థితి.

తిరుప్పల్లాండు 11వ పాశురంలో ఆళ్వార్ “తిరుమాలే నానుమ్ ఉనక్కు ప్పళవడియేన్” అని అంటారు; అంటే “నేను చాలా కాలంగా నీకు పరతంత్రుడను” అని అర్థం. ఆళ్వార్ ఎంపెరుమాన్ను “తిరుమాలే” అని సంబోధించడం వల్ల, పిరాట్టితో ఎల్లప్పుడూ కలిసి ఉండే శ్రీమన్నారాయణుడైన సర్వేశ్వరుని సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మాటల ద్వారా ఆత్మ ఏకాయన ఎమ్పెరుమాన్ కు  పరతంత్రం కాదని ఆళ్వార్ స్పష్టంగా తెలియజేశారు.

* ఇని ఇవ్వాత్మావుక్కు నిలైనిన్ఱ శేషత్వమ్ నిన్ తిరువెట్టెళుత్తుమ్ కత్తు నానుత్తత్తుమ్ ఉన్నడియార్కడిమై ఎఙ్గైయాలే తదీయ శేషత్వమేయాగ కడవదు

ఆత్మ ఎవరికి పరతంత్రం? అనేది చివరి భాగంలో చెప్పబడుతోంది.

ఆత్మకు శేషత్వం అనే ఒక గుణం ఉంది. శేషత్వం అంటే పరతంత్రంగా ఉండటం. ఆత్మ శ్రీమన్నారాయణునికి పరతంత్రం అనే విషయం ఇంతకు ముందు చెప్పబడింది. అయితే తిరుమంగై ఆళ్వార్ తిరుక్కణ్ణపురం ఎంపెరుమాన్కు అంకితం చేసిన పాశురంలో మరింత ఉన్నతమైన పరతంత్రత్వం వెల్లడించబడింది. ఈ పాశురంలో ఆళ్వార్ “నిన్ తిరువెట్టెళుత్తుమ్ కత్తునాన్ ఉత్తదుమ్ ఉన్నడియార్కడిమై” అని అంటారు. (శ్రీ అష్టాక్షరాన్ని నేర్చుకున్న తరువాత, నేను నీ భక్తులకు సేవకుడినని తెలుసుకున్నాను.) దీని ద్వారా ఆత్మ చివరికి పరమేశ్వరుని భక్తులకు పరతంత్రం అని తెలుస్తుంది. తిరుమంగై ఆళ్వార్ మాటల ద్వారా ఇది స్పష్టమవుతుంది. ఆయన తిరుక్కణ్ణపురం ఎంపెరుమాన్ తో, “నీవు నాకు శ్రీ అష్టాక్షర మంత్రాన్ని ఉపదేశించావు; నేను దానిని బాగా నేర్చుకున్నాను. దాని ద్వారా నేను గ్రహించినది ఏమిటంటే, నేను నీకు మాత్రమే కాకుండా, నీ భక్తులకు కూడా అంతిమంగా పరతంత్రుడను” అని అంటారు.

శేషత్వానికి రెండు స్థాయిలు ఉన్నాయి. అవి ప్రథమ పర్వం, చరమ పర్వం అని పిలువబడతాయి. ప్రథమ పర్వం అంటే ఎంపెరుమాన్కు పరతంత్రంగా ఉండటం. చరమ పర్వం అంటే ఆయన అడియార్లకు పరతంత్రంగా ఉండటం. ఈ చివరి స్థాయి అత్యున్నతమైన అనుభూతి. మొదటి స్థాయి ప్రారంభం అయితే, చరమ పర్వం అంతిమ పరిపూర్ణత.

భాగవతులకు పరతంత్రంగా ఉండటమే తిరుమంత్రం యొక్క సారం. అందువల్ల తదీయ శేషత్వం, భాగవతులకు పరతంత్రంగా ఉండటం ఆత్మ యొక్క స్వరూపం.

ఈ విధంగా మొదటి స్థాయిలో ఆత్మ శ్రీమన్నారాయణునికి పరతంత్రం; తరువాత ఆయన అడియార్లకు పరతంత్రం. భాగవతులకు పరతంత్రంగా ఉండటం అంటే వారిని అనుసరించడం, వారి హృదయాలను అర్థం చేసుకోవడం, దానికి అనుగుణంగా ఆచరించడం.

వార్తై 24

సారాశం:

వార్తై 24 యొక్క సంగ్రహం:

  • తత్త్వత్రయం అచిత్, చిత్, ఈశ్వరన్ అనే మూడింటినీ కలిగి ఉంటుంది.
  • ఆత్మలు మూడు రకాలు- నిత్యర్లు, ముక్తర్లు, బద్ధర్లు.
  • బద్ధాత్మలు మూడు రకాలు- అర్థకామపరులు, ధర్మపరులు, మోక్షపరులు.
  • భగవాన్‌కు తమ పరతంత్రత్వాన్ని అంగీకరించినవారు మూడు రకాలు- ఐశ్వర్యార్థులు, కైవల్యార్థులు, ఎంపెరుమాన్నే పొందాలని కోరుకునేవారు (భగవానుని మాత్రమే పొందాలని ఆసక్తి కలిగినవారు).
  • ఆత్మప్రాప్తిని కోరుకునేవారు మూడు రకాలు.
  • ప్రపన్నులు మూడు రకాలు- అజ్ఞానాతాలే (జ్ఞానం లేకపోవడం వల్ల), జ్ఞానత్తాలే (జ్ఞానంతో), భక్తిపారవశ్యత్తినాలే (భక్తిలో అత్యంతగా మునిగినవారు). 

మూలం:

తత్వ త్రయమ్; అదిల్ ఆత్మతత్వత్రయమ్; అదిల్ బధ్ధాత్మాక్కళ్ త్రయమ్; అదిల్ శేషత్వ జ్ఞానముడైయార్ త్రయమ్; అదిల్ భగవశ్శేషత్వ జ్ఞానముడైయార్ త్రయమ్; ఆత్మప్రాప్తి కామర్ త్రయమ్; అదిల్ ప్రపన్నాధికారిగళ్ త్రయమ్.

వివరణము:

ఈ వార్తై లో అనేక “త్రయములు” వివరించబడుతున్నాయి. ఈ వార్తైని సరిగ్గా అర్థం చేసుకోవడానికి పుత్తూర్ స్వామివారు అందించిన వ్యాఖ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వార్తైలో అనేక అంతర్గతమైన అర్థాలు కూడా ఉన్నాయి.

తత్త్వ త్రయం

తత్త్వ త్రయం అనగా చిత్, అచిత్ మరియు ఈశ్వర తత్త్వములు. ఈ మూడు తత్త్వములు కలిసి తత్త్వ త్రయముగా చెప్పబడతాయి. “తత్త్వం” అంటే నిజమైనవి, వాస్తవమైనవి, శాశ్వతమైన వస్తువులు.

చిత్ అనగా ఆత్మ. ఆత్మలు అనేకము. ఇది మొదటి తత్త్వము.

అచిత్ రెండవ తత్త్వము. ఇది ప్రకృతి; జ్ఞానం లేని జడపదార్థమును సూచిస్తుంది.

మూడవ తత్త్వము ఈశ్వర తత్త్వము. చిత్ మరియు అచిత్ రెండూ ఆయనకు శరీరముగా ఉన్నాయి. ఆయనే శ్రీమన్నారాయణుడు, సర్వోత్తముడైన భగవాన్.

అదిల్ ఆత్మతత్త్వత్త్రయం

తత్త్వ త్రయంలో ఆత్మ తత్త్వము మూడు విధములుగా విభజించబడుతుంది. అవి: నిత్యాత్మలు, ముక్తాత్మలు, బద్ధాత్మలు. నిత్యాత్మలు అనగా నిత్యసూరులు. వారు పరమపదంలో ఎల్లప్పుడూ ఎంపెరుమాన్తో ఉంటారు; ఆయన నుండి ఎప్పుడూ విడిపోరు. వారు “అస్పృష్ట సంసార గంధ” అని చెప్పబడతారు,  అంటే సంసార సంబంధమైన వాసన కూడా వారిని ఎప్పుడూ తాకలేదు. రెండవ వారు ముక్తాత్మలు. ఒకప్పుడు సంసారంలో బాధపడిన తరువాత, చివరకు ముక్తిని పొంది పరమపదాన్ని చేరినవారు. మూడవ వారు బద్ధాత్మలు. ప్రస్తుతం ఈ సంసారంలో జీవిస్తూ, సంసారబంధంలో బాధపడుతున్నవారు. ఇదే ఆత్మ తత్త్వ త్రయం, ఆత్మలలోని మూడు రకములు.

అదిల్ బద్ధాత్మాక్కళ్ త్రయం

బద్ధాత్మలు కూడా మూడు విధములుగా విభజించబడతారు. “బద్ధాత్మ” అనే పదము ఈ సంసారంలో బంధింపబడిన వారిని సూచిస్తుంది. బంధనం అంటే బంధించబడటం.

ఆ మూడు రకములు అర్థకామపరులు, ధర్మపరులు, మరియు మోక్షపరులు. పురుషార్థములు నాలుగు, ధర్మము, అర్థము, కామము మరియు మోక్షము. సంపదను (అర్థాన్ని)  సంపాదించడంలోను, ఇతర కోరికలను కామాన్ని అనుభవించడంలోను ఆసక్తి కలిగినవారు అర్థకామపరులు, అనగా ఐశ్వర్యార్థులు. ధర్మాన్ని ఆచరించడంలో ఆసక్తి కలిగినవారు ధర్మపరులు. మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించేవారు మోక్షపరులు, అనగా ముముక్షువులు.

అదిల్ శేషత్వ జ్ఞానముడైయార్ త్రయం

భగవంతునికి లేదా ఒక ఉన్నతమైన అధికారానికి తాము శేషభూతులమని అంగీకరించేవారు కూడా మూడు రకములు. కొందరు తమకు కనిపించే అధికారులైన రాజులు, మంత్రులు మొదలైనవారికి తాము అధీనులమని భావిస్తారు. వారు ఆ అధికారులు చెప్పిన విధంగా తాము నడుచుకోవాలని అనుకుంటారు. మరికొందరు కనిపించని దేవతలైన బ్రహ్మ, రుద్ర, ఇంద్ర మొదలైనవారికి తాము అధీనులమని భావిస్తారు. ఆ దేవతలు ప్రస్తుతం తమకు కనిపించకపోయినప్పటికీ, తాము వారికి శేషభూతులమని భావిస్తారు. ఈ రెండు వర్గాలవారు తమకంటే ఉన్నతమైన ఒక శక్తికి తాము అధీనులమని అంగీకరించినప్పటికీ, తాము భగవానికే శేషభూతులము అనే విషయాన్ని అంగీకరించరు. ఎంపెరుమానికే తాము శేషభూతులమని అంగీకరించినవారే ముముక్షువులు. వారు భగవానికే తాము శేషభూతులమని అంగీకరించి, మరెవరికీ శేషభూతులుగా ఉండటాన్ని నిరాకరిస్తారు. ఆళ్వార్ చూపించిన విధంగా వారు జీవిస్తారు. 

తిరుప్పల్లాండులో ఆళ్వార్లు “తిరుమాలే! నానుమ్ ఉనక్కు ప్పళవడియేన్”, అంటే “తిరుమాలా! నేనూ నీకు ఎప్పటి నుండో సేవకుడను” అంటారు. దాని భావం, ఎంపెరుమానినే ఏకైక నాయకునిగా అంగీకరించి, మరెవరికీ శేషభూతులుగా ఉండకుండా జీవించడం. 

అదిల్ భగవచ్ఛేషత్వ జ్ఞానముడైయార్ త్రయం

తాము భగవానికే శేషభూతులము అని అంగీకరించినవారు మూడు రకములు, ఐశ్వర్యార్థులు, కైవల్యార్థులు, మరియు భగవత్ కైంకర్యార్థులు. ఈ మూడు రకాల ఆత్మలూ భగవానిని తమ శేషిగా అంగీకరిస్తాయి. ఆయనపై తమ ఆధారపడుటను కూడా అంగీకరిస్తాయి. అయితే అవి కోరుకునే ఫలము వేర్వేరుగా ఉంటుంది.

మొదటి వర్గం భౌతికమైన సంపదను కోరుకునేవారు. వారు స్వర్గలోకంలోని సుఖాలను కూడా అనుభవించాలని కోరుకుంటారు. వారి కోరికలు భౌతికమైనవే అయినప్పటికీ, వాటిని నెరవేర్చుకోవడానికి వారు భగవానినే ఆశ్రయిస్తారు.

శ్రీభగవద్గీతలో కృష్ణుడులో “చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోఽర్జున | ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ||” అంటాడు. దాని భావం, “ఓ అర్జునా! భరత వంశంలో శ్రేష్ఠుడా! నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్ను భజిస్తారు,   ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి మరియు జ్ఞాని.” ఇక్కడ చెప్పబడిన నాలుగు రకములు ఇక్కడ చెప్పబడిన మూడు వర్గాలకు అన్వయిస్తాయి.

ఐశ్వర్యార్థి అనే వర్గంలో అర్థార్థి  (కొత్త సంపదను కోరుకునేవాడు),  మరియు ఆర్తుడు (పోయిన సంపదను తిరిగి పొందాలని కోరుకునేవాడు) ఇద్దరూ చేరుతారు. జిజ్ఞాసువు అంటే ఇక్కడ కైవల్యార్థి. కైవల్యార్థులు భగవానుని కాకుండా తమ సొంత ఆత్మను సాక్షాత్కరించి, ఆ ఆత్మను అనుభవించాలని కోరుకునేవారు. జ్ఞాని అనేది భగవత్ కైంకర్యార్థికి అన్వయిస్తుంది. వీరి ఏకైక ఆసక్తి ఎంపెరుమానిని పొందడం, ఆయనకు కైంకర్యం చేయడం, ఆయనను అనుభవించడం.

అందువలన ఈ మూడు వర్గాలవారూ భగవానినే తమ నాయకునిగా, శేషిగా అంగీకరిస్తారు. అయితే వారు కోరుకునే ఫలములు వేర్వేరు. పొయ్గై ఆళ్వార్ మొదల్ తిరువందాదిలో, “ఎళువార్ విడై కొళ్వార్ ఈన్ తుళాయానై, వళువావగై నినైన్దు వైగల్ తొళువార్.”  అంటారు. దాని భావం  “ఎళువార్” అంటే ఐశ్వర్యార్థులు. సంపదను కోరుకుని, తాము కోరుకున్న సంపదను పొందిన తరువాత ఎంపెరుమాన్  ని విడిచి వెళ్లేవారు. ఉదాహరణకు, ఆస్తిని కోరుకుని భగవానిని ప్రార్థించి, ఆస్తి లభించిన తరువాత ఆయనను విడిచిపెట్టడం. “విడై కొళ్వార్” అంటే  కైవల్యార్థులు. ఎంపెరుమాన్ ని కాకుండా తమ సొంత ఆత్మను అనుభవించేవారు. వారు చివరకు ఎంపెరుమాన్ని శాశ్వతంగా విడిచి వెళ్తారు. *“వళువావగై నినైన్దు వైగల్ తొళువార్” అంటే .. ఎంపెరుమానితో ఎటువంటి వియోగమూ లేకుండా ఆయనతోనే ఉండాలని, ఆయనను అనుభవించాలని, ఆయనకు కైంకర్యం చేయాలని కోరుకునేవారు. ఈ చివరి వర్గం భగవత్ కైంకర్య ప్రాప్తిని కోరుకునేవారు.

ఆత్మప్రాప్తి కామర్ త్రయం

ఆత్మప్రాప్తిని కోరుకునేవారు మూడు వర్గములుగా విభజించబడతారు. మొదటి వర్గం అచిత్తుతో కలిసి ఆత్మను అనుభవించాలని కోరుకునేవారు. అంటే, ఈ లోకంలోనే ఉండి, యోగాన్ని అభ్యసిస్తూ ఆత్మను అనుభవించాలని కోరుకుంటారు. రెండవ వర్గం అచిత్తు నుండి ఆత్మను విడిపించి, తరువాత ఆత్మను అనుభవించాలని కోరుకునేవారు. మూడవ వర్గం భగవాన్ ఆత్మకు అంతర్యామి అని అంగీకరించి, ఆ అంతర్యామి భగవానుతో కలిసి ఆత్మను అనుభవించాలని కోరుకునేవారు.

అదిల్ ప్రపన్నాధికారిగళ్ త్రయం

చివరగా, ప్రపన్నులలో కూడా మూడు రకములు ఉన్నాయి. శ్రీవచనభూషణంలో పిళ్ళై లోకాచార్యులు ఈ విషయాన్ని చాలా చక్కగా వివరించారు. 43వ సూత్రం లో “అజ్ఞానత్తాలే ప్రపన్నర్ అస్మదాదికళ్; జ్ఞానాధిక్యత్తాలే ప్రపన్నర్ పూర్వాచార్యర్ కళ్; భక్తి పారవశ్యత్తాలే ప్రపన్నర్ ఆళ్వార్గళ్.” అంటారు. దాని భావం  ఏమిటో చూద్దాము. 

“అజ్ఞానత్తాలే ప్రపన్నర్ అస్మదాదికళ్”

మనలాంటి సాధారణ జీవులు అజ్ఞానం వలన ప్రపన్నులవుతారు. మనకు విషయాల గురించి సంపూర్ణమైన జ్ఞానం లేదు; మనకు మరే ఇతర ఉపాయమూ తెలియదు. అందువలన భగవానినే శరణు పొందుతాము.

మనం ఆత్మ స్వరూపాన్ని పూర్తిగా విచారించలేదు. అర్థపంచకం గురించి కూడా సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందలేదు.

“జ్ఞానాధిక్యత్తాలే ప్రపన్నర్ పూర్వాచార్యర్గళ్”

పూర్వాచార్యులకు ఆత్మ స్వరూపం గురించి సంపూర్ణమైన జ్ఞానం ఉంది. అర్థపంచకం గురించి, తత్త్వ త్రయం గురించి వారికి స్పష్టమైన జ్ఞానం ఉంది. ఈ విషయాలను వారు లోతుగా గ్రహించిన కారణంగా, భగవానే సర్వోత్తముడని అంగీకరించి, శరణాగతిని ఆచరించారు.

“భక్తి పారవశ్యత్తాలే ప్రపన్నర్ ఆళ్వార్గళ్”

అత్యంత ఉద్ధృతమైన భక్తి వలన ఆళ్వార్లు ప్రపన్నులయ్యారు. “భక్తి పారవశ్యత్తాలే”,  భగవానిని అనుభవించాలనే తీవ్రమైన ఆకాంక్షతో, ఆయనకు కైంకర్యం చేయాలనే కోరికతో, నిరంతరం ఆయననే ధ్యానిస్తూ, వారు శరణాగతిని ఆచరించారు.

అందువలన ప్రపన్నాధికారులు కూడా మూడు వర్గములుగా విభజించబడతారు:

తరువాతి వ్యాసంలో ఇరవై ఐదవ వార్తైని అనుభవిద్దాం.

ఆళ్వార్ ఎమ్పెరుమానార్ జీయర్ తిరువడిగలే శరణం

జీయర్ తిరువడిగలే శరణం

పిన్భళగియ పెరుమాళ్ జీయర్ తిరువడిగలే శరణం

అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజదాసన్

ఆడియో – https://1drv.ms/u/s!AhgMF0lZb6nngy8H_dg7jMDXVQvK?e=pRQUcN
వీడియో – https://youtu.be/28Bt_uzD-04
ఆంగ్లంలో – https://granthams.koyil.org/2026/08/22/varthamalai-part-9-english/

పొందుపరచిన స్థలం: https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment