అవతారిక
ఈ అసాధారణమైన పనిలో (కైంకర్యములో) నిమగ్నమైన వారికి సాధారణమైన పనులు(కర్మములు) సహజముగానే ఎలా వీడిపోవునో నాయనార్లు ఇక్కడ చెప్పుచున్నారు.
చూర్ణిక
జాత్యాశ్రమ దీక్షైకళిల్ భేదక్కుమ్ ధర్మజ్గళ్పోలే అత్తాణిచ్చేవకత్తిల్ పొతువానతు నళువుమ్
సంక్షిప్త వివరణ
ఎలా అయితే కొన్ని ధర్మములు జాతి, ఆశ్రమ, దీక్షల యందు భేదములు కలవో కైంకర్యమున నిమగ్నమైనప్పుడు సాధారణ కర్మము విడిచిపోవును.
వ్యాఖ్యానము
అనగా – ఆపస్తంబ సూత్రములో చెప్పినట్టు “స్వకర్మ బ్రాహ్మణస్య అధ్యయనమ్, అధ్యాపనమ్, యజనమ్, యాజనమ్, దానమ్, ప్రతిగ్రహణమ్, దాయాద్యం సిలోంచః అన్యశ్చ అపరిగృహీతం ఏతాన్యేవ క్షత్రియస్య అధ్యాపన యాజన ప్రతిగృహణాని పరిహార్యాణిః దండయుద్ధాధికారం క్షత్రియవత్ వైశ్యస్య దండయుద్ధవర్జం కృషి గోరక్షణ వాణిజ్యాధికం గ్రాహ్యం” (బ్రాహ్మణ విధులు ఏమి అనగా అధ్యయనము(వేదమును చదువుట), అధ్యాపనము(వేదమును బోధించుట), యజనము(తాను యజ్ఞమును చేయుట), యాజనము(ఇతరులకు యజ్ఞమును చేయించుట), దానము(దానము చేయుట), ప్రతిగ్రహణము(దానము స్వీకరించుట), వంశ పారంపర్యముగా వచ్చు ఆస్తిని స్వీకరించుట, పొలము నుంచి ధాన్యమును సేకరించుట ఎవరి చేత తీసుకొనబడని మిగులు పండ్లను, మూలములను మాత్రమే తీసుకొనుట. ఇక క్షత్రియులకు, బ్రాహ్మణ విధులలో వేదమును భోదించుట, ఇతరుల కొరకు యజ్ఞములను చేయించుట, ఇతరుల నుంచి దానమును స్వీకరించుట అనేవి తప్ప తక్కినవైన వేద అధ్యయనము, తాను యజ్ఞమును ఆచరించుట దానము చేయుట వర్తించును. ఈ మూడు కాక యుద్ధము చేయుట మరియు దండించుట క్షత్రియ విధులు. ఇక వైశ్యులకు క్షత్రియ విధులు అయిన దండించుట, యుద్ధములు చేయుట తప్ప తక్కినవి వర్తించును. ఇవి కాకుండా వ్యవసాయము చేయుట, గోవులను సంరక్షించుట మరియు వాణిజ్యము వైశ్య విధులు. బ్రాహ్మణులకు అధ్యయనము, అధ్యాపనము, యజనం, యాజనము, ప్రతిగ్రహణము, అనేవి తప్పనిసరి విధులు. క్షత్రియులకు, వైశ్యులకు అధ్యయనము, యజనము, దానము అనేవి తప్పనిసరి విధులు, అధ్యాపనము, యాజనము, ప్రతిగ్రహణము చేయతగని విధులు. వీటిలో క్షత్రియులకు దండన మరియు యుద్ధము చేయుట అనేవి విశిష్ఠమైన విధులు.
వైశ్యులకు సాగు చేయుట, గోసంరక్షణ మరియు వాణిజ్యము అనేవి విశిష్ఠమైన విధులు. శూద్రులకు ఆపస్తంబ సూత్రములో చెప్పినట్టు “శుశ్రూషా శూద్రస్య ఇతరేషామ్ వర్ణనామ్” ( శూద్రులు ఇతర వర్ణములలో వారికి వారి కార్యములందు సహాయము చేయుట తప్పనిసరి విధి). త్రైవర్ణికులకు సహాయము చేయుట విధి. ఈ విధముగా ఒక వర్ణమున ఒకడికి తప్పనిసరి అయిన విధి వేరొక వర్ణమున ఒకడికి విడువతగిన విధి.
బ్రహ్మచారిగా ఉన్న దశలో భిక్షం స్వీకరించుట, సమితాధానము మొదలగు విధులు గృహస్థ దశలో విడువవలెను. గృహస్థ దశలో అగ్నిహోత్రము, అతిధి సత్కారములు స్వీకరింపతగిన విధులు. వానప్రస్థ దశలో మనుస్మృతిలో చెప్పినట్టు “సన్త్యజ్య గ్రామ్యమ్ ఆహారం సర్వంచైవ పరిచ్చదం”( పల్లె లేదా నగరములలో ఉండు వారు అవలంబించు వస్త్ర ధారణ మరియు ఆహార అలవాట్లు విడువవలెను). పూర్వాశ్రమములో వర్తించు వండిన ఆహారము, వస్త్రములు మొదలగు వాటిని త్యజించి మరియు మనుస్మృతిలో “వసీత చర్మ చీరం వా …”(జంతువు యొక్క చర్మము లేదా చెట్టు మొదళ్ళను వస్త్రముగా ధరించుట) జంతు చర్మము లేదా చెట్టు మొదళ్లను వస్త్రముగా ధరించుట, జడలు ధరించి ఉండుట, గడ్డమును, గోర్లను కలిగి ఉండుట, అరణ్యములలో లభ్యమైనవే ఆహారముగా స్వీకరించుట మొదలగు తప్పనిసరి విధులు. సన్యాస ఆశ్రమములో ఏవి అయితే పూర్వాశ్రమములో వర్తించునో(అగ్నిహోత్రము, అతిధి సత్కారము, జడలు ధరించుట) మొదలగు వాటిని త్యజించవలెను. మనుస్మృతి “అనగ్ని రనికేతస్యాత్” (అగ్నిహోత్రమును ఆచరించకుండా ఉండుట మరియు ఒక స్థలమును ఆవాసముగా ఏర్పరచుకొనకుండా ఉండుట) అగ్ని కార్యముతో సంబంధము లేకుండా ఉండుట ఒక స్థిరమైన ఆవాసము లేకుండుట మరియు ఎవరి సహకారమును ఆశించకుండా ఉండుట అను విధులను ఆచరించవలెను. ఈ విధముగా ప్రతి ఆశ్రమములో ధర్మమూ వేరుగా ఉన్నదని తెలుస్తున్నది.
జ్యోతిష్ఠోమా కర్మను ఆచరించుటకై దీక్షను తీసుకున్నవాడికి నాలుగు వర్ణములలో, ఆశ్రమములలో తప్పక ఆచరించవలసిన నిత్య కర్మలను విడిచి జ్యోతిష్ఠోమాది యజ్ఞములను మాత్రమే చేయతగినది. దీనితో దీక్షలో కూడా ధర్మ భేదములు స్పష్టమవుతున్నవి.
అందువలన బ్రాహ్మణ మొదలగు వర్ణములలో, బ్రహ్మచర్య మొదలగు ఆశ్రమములలో, జ్యోతిష్ఠోమాది యజ్ఞముల దీక్షా విధులలో భేదములు కలవు. అలానే అసాధారణ విగ్రహము(అర్చా)గా కలిగిన సర్వేశ్వరునికి చేయు అసాధారణ కైంకర్యములలో నిమగ్నమైన వారికి తిరుప్పల్లాండు 8 “అత్తానిచ్చేవగమ్”(అవిఛ్చిన్న కైంకర్యము)లో చెప్పినట్టు దేవతలలో అంతర్యామిగా వేంచేసి ఉన్న పరమాత్మకు చేయు సాధారణమైనట్టి కర్మము సహజముగా తొలగిపోవును. “ఉఴుంగువాన్ కైప్పణ్డామ్” (నిద్రలో జారుకుంటున్న వాడి చేతిలో ఉన్న వస్తువు వాడికి తెలియకుండానే జారిపోవునో).
దీనితో వర్ణాశ్రమములలో నిష్ఠతో నిమగ్నమైనవారికి వారికి తగ్గ ధర్మము తప్ప తక్కినవి నిషేధింపబడినట్లు స్వరూప యాధాత్మ్యమును గుర్తించిన వారికి వారి స్థితికి తగిన ధర్మము తప్ప తక్కినవి తామంత తామే సహజముగానే విడిచిపోవును.
ఇది ఇలా ఉండగా శిష్ఠులైన వారు(ఆచార్యులు) కర్మమును ఎందుకు ఆచరించెదరు అని అడుగగా అది తమ యొక్క అనుష్ఠానము ఆచరించి లోకమున ఉన్న వారు(కైంకర్యమున నిలకడ లేని వారు) నశించిపోకుండా ఉండవలెను అనే వారి వాత్సల్యము చేత. కైంకర్యమందు నిలకడ లేకపోవుట చేత కర్మములను త్యజించి నాశము పొందుట. వారు కర్మములను ఇతరుల కోసము ఆచరించెదరు శ్రీ భగవద్గీత 3.23 “యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్ధ సర్వశః” (ఓ అర్జునా! సర్వేశ్వరునినైన నేను కర్మాచరణమందు నిశ్చలముగా మరియు బద్ధకముతో లేకపోవుట చేత జనులు అందరును నన్నే అన్ని విధములుగా అవలంబించుదురు) మరియు శ్రీ భగవద్గీత 3.24 “ఉత్సీదేయురిమే లోకాః నకుర్యాం కర్మచే దహం సంకరస్య చ కర్తాస్యా ముపహన్యా మిమాః ప్రజాః” (నేను కర్మను ఆచరించకపోతే ప్రపంచములోని జనులు నాశనమగును. నేనే వర్ణ సంకరమును కలుగజేయును (నిష్ఠుల వంశములలో అశుద్ధతను నేనే కలుగజేయును). ఈ విధముగా వారి పతనమునకు నేనే కారకుడను).
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-31-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org