శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

కృష్ణుడు, సాందీపని ముని వద్ద విద్యాభ్యాసం చేస్తున్న కాలంలో, సుదాముడు, అతని సహపాఠి. అతడిని కుచేలుడు అని కూడా అంటారు. కృష్ణుడు మరియు సుదాముడు ఎంతో సన్నిహిత మిత్రులు. సుదాముడు, తన భార్యతో కలిసి అత్యంత దారిద్ర్య జీవితాన్ని గడుపుతున్నాడు.
ఒకసారి అతని భార్య అతనితో ఇలా చెప్పింది: “మనకు తినడానికి కూడా ఎంతో కష్టంగా ఉంది. నీ స్నేహితుడు కృష్ణుడు ద్వారకాధీశుడు. అతని వద్దకు వెళ్లి కొంత ధనం దానం రూపంలో తీసుకురావచ్చు కదా!” అని. అప్పుడు సుదాముడు “మనము ఎందుకు ఎవరి దగ్గరైనా వెళ్లి యాచించాలి? ఉన్నదానితోనే జీవించవచ్చు” అని చెప్పాడు. అయినప్పటికీ ఆమె మరల మరల బలవంతం చేయడంతో, మరే మార్గమూ లేక కృష్ణుణ్ణి కలవడానికి బయలుదేరాడు. తన మిత్రుణ్ణి కలవడానికి ఖాళీ చేతులతో వెళ్లకూడదని భావించి, కొంత అటుకులను ఒక చిన్న వస్త్రంలో కట్టి వెంట తీసుకెళ్లాడు.
ద్వారకకు చేరుకున్న తరువాత కృష్ణుని రాజభవనానికి వెళ్ళాడు. ఆ సమయంలో రుక్మిణీదేవి కృష్ణునికి సేవ చేస్తున్నది. సుదాముడు వచ్చినట్టు గమనించిన కృష్ణుడు వెంటనే తన సింహాసనం మీద నుండి లేచి, ద్వారం వరకు పరుగెత్తి వెళ్ళి అతన్ని ఆలింగనం చేసుకొని ఆహ్వానించాడు. తరువాత సుదాముణ్ణి తన సింహాసనంపై కూర్చోబెట్టి అతని పాదాలను కడిగాడు. రుక్మిణీదేవి చామరంతో వీచి సేవ చేసింది. ఆ తరువాత వారు తమ విద్యార్థిదశలో జరిగిన అనేక సంఘటనలను పరస్పరం స్మరించుకొని ఆనందించారు.
తరువాత కృష్ణుడు సుదాముణ్ణి చూసి “నా కోసం ఏమి తీసుకొచ్చావు?” అని అడిగాడు. ఎంతో సంకోచంతో సుదాముడు తన దగ్గర ఉన్న అటుకుల మూటవైపు చూస్తుండగా, కృష్ణుడు దానిని గమనించాడు. వెంటనే ఆనందంతో ఆ మూటను తీసుకొని అందులోని ఒక అటుకుల ముద్దను తన నోటిలో వేసుకున్నాడు. రెండవ ముద్దను తీసుకోబోతుండగా రుక్మిణీదేవి అతన్ని ఆపింది. తరువాత కృష్ణుడు “నీవు వచ్చిన ఉద్దేశ్యం ఏమిటి?” అని అడిగాడు. అయితే సుదాముడు కృష్ణుని వద్ద ఏమీ అడగాలని కోరుకోలేదు. అందువల్ల “చాలా రోజులుగా నిన్ను చూడలేదు. అందుకే నిన్ను దర్శించుకోవడానికి మాత్రమే వచ్చాను” అని చెప్పాడు. అప్పుడే కృష్ణుడు, సుదాముని చిన్న గుడిసె గొప్ప రాజభవనంగా మారాలని సంకల్పించాడు. వెంటనే అది నిజమైంది.
సుదాముడు, కృష్ణుణ్ణి వీడి తిరిగి తన గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ తన చిన్న ఇల్లు ఉన్న స్థానంలో ఒక మహత్తరమైన రాజభవనాన్ని చూశాడు. అతని భార్య అందమైన వస్త్రాభరణాలతో అలంకరించుకొని బయటకు వచ్చి అతనికి స్వాగతం పలికింది. ఇవన్నీ కృష్ణుని కృప వల్లనే జరిగాయని సుదాముడు గ్రహించాడు. అయినప్పటికీ అతడు మునుపటిలాగే వైరాగ్యభావంతోనే జీవించాడు.
ఈ సంఘటన యొక్క సారాంశం:
- ఎంపెరుమాన్ తన భక్తులపై అపారమైన ప్రేమ కలిగివున్నవాడు. భక్తులు తమను తాము ఎంత అల్పులుగా భావించినా, ఆయన వారిని అత్యున్నతులుగా భావిస్తాడు.
- మనము భగవంతుని వద్దకు వెళ్లి ఏదైనా కోరితే, మనము అడిగినంత మాత్రమే లభిస్తుంది. కానీ ఆయన స్వయంగా ప్రసాదిస్తే, మనం కోరిన దానికంటే అనేక రెట్లు ఎక్కువగా అనుగ్రహిస్తాడు.
- కృష్ణుడు, ఒక అటుకుల ముద్ద తిన్న తరువాత రుక్మిణీదేవి ఆయనను ఆపింది. దీనికి కారణంగా ఇలా భావించవచ్చు – “ఒకే ముద్దకు ఇంతటి సంపదను అనుగ్రహిస్తే, మరిన్ని ముద్దలు తింటే ఇంకా అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు సుదాముడు అంతటి మహాసంపదను ఎలా నిర్వహించగలడు?” అని ఆమె భావించి ఉండవచ్చు.
మూలం : https://granthams.koyil.org/2023/10/22/krishna-leela-46-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org