నమ్మాళ్వారుల దివ్య నామములు – పరబ్రహ్మ యోగి, వినవాదు ఉణర్న్ద విరగర్

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

పూర్తి ధారావాహిక

<< మునుపటి

25. పరబ్రహ్మ యోగి

పరబ్రహ్మంతో ఐక్యం చెందినవాడే యోగి. ఆ విధంగా, నమ్మాళ్వార్లు ఎల్లప్పుడూ పరబ్రహ్మంతో ఐక్యమై ఉంటారు. ‘పరబ్రహ్మం’ అనేది శ్రీమన్నారాయణుని సూచించే పదం. ‘బ్రహ్మం’ అంటే గొప్పది మరియు ఇతరులను గొప్పవారిగా చేసేది అని అర్థం. పరబ్రహ్మం అంటే అత్యున్నతమైన బ్రహ్మం, అంటే పరమాత్మ అని కూడా అర్థం. నారాయణ సూక్తంలో “నారాయణ పరబ్రహ్మ” అని చెప్పబడింది. శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మం, ఆయన ఎల్లప్పుడూ ఆళ్వార్లతో కలిసి ఉంటారు. అందుకే నమ్మాళ్వార్లు ‘పరబ్రహ్మ యోగి’గా పిలువబడతారు.

ఎంపెరుమాన్ నమ్మాళ్వార్లతో ఎల్లప్పుడూ ఎలా కలిసి ఉంటారో అర్థం చేసుకోవడానికి, ఎంపెరుమాన్ యొక్క ‘అంతర్యామి’ రూపాన్ని తెలుసుకోవాలి. ఎంపెరుమాన్ అంతర్యామిగా, అంటే జీవుల హృదయాలలో నివసించే పరమాత్మగా ఉంటారు. ఆయన సర్వవ్యాపి. అంతర్యామిగా ఆయనకు దృశ్యమానమైన రూపం ఉండదు; ఇది ఒక స్థితి. అలాగే, ఆభరణాలు, ఆయుధాలు మరియు శ్రీ మహాలక్ష్మితో కూడిన అత్యంత సుందరమైన మరియు విశిష్టమైన అంతర్యామి రూపం కూడా ఉంది. ఈ విధంగా, ఎంపెరుమాన్ యోగుల హృదయాలలో కొలువై ఉంటారు. కాబట్టి, యోగి అయిన నమ్మాళ్వార్, ఎల్లప్పుడూ ఎంపెరుమాన్ గురించి ధ్యానిస్తూ, ఎంపెరుమాన్ని ఆరాధిస్తూ ఉంటారు. నమ్మాళ్వార్ల హృదయంలో ఎంపెరుమాన్ తన దివ్య దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మితో కలిసి దృశ్యమాన రూపంలో ఉంటారు. అందుకే నమ్మాళ్వార్లు ‘పరబ్రహ్మ యోగి’గా పిలువబడతారు.

26. విణవాదు ఉణర్న్ద విరగర్

‘విరగర్’ అంటే పరమ లక్ష్యాన్ని చేరుకునే మార్గం తెలిసినవాడు అని అర్థం. ఎంపెరుమానే ఆ మార్గం (ఉపాయం), ఎంపెరుమానే ఆ లక్ష్యం (ఉపేయం). ఎంపెరుమాన్ని పొందడానికి ఎంపెరుమానే మార్గమని నమ్మాళ్వార్లకు తెలుసు.

‘విణవాదు’ అంటే [జ్ఞానాన్ని పొందడానికి] ఎవరినైనా ప్రశ్న అడగడం అని అర్థం. నమ్మాళ్వార్లు ఎప్పుడూ ఎవరినీ ఏమీ అడగలేదు. అయినప్పటికీ, ఆళ్వార్లు అడగకపోయినా, ఎంపెరుమానే స్వయంగా వచ్చి ఆళ్వార్లకు ‘మయర్వఱ మదినలం’ (దోషరహితమైన జ్ఞానం మరియు అత్యున్నత భక్తి) అనే వరాలను ప్రసాదించారు.

‘విణవాదు’ అంటే అడగకుండా అని అర్థం. ‘ఉణర్న్ద’ అంటే గ్రహించినవాడు లేదా తెలుసుకున్నవాడు అని అర్థం. ‘విరగర్’ అంటే ఉపాయం (మార్గం) తెలిసినవాడు అని అర్థం. అంటే, భగవానుని చేరుకోవడానికి ఎంపెరుమానే మార్గం అనే ఉపాయాన్ని ఆళ్వార్లు గ్రహించారు. భగవానుని అనుగ్రహం వల్లే ఆళ్వార్లు ఈ విషయాన్ని తెలుసుకోగలిగారు. ఆళ్వార్లు ఈ జ్ఞానాన్ని కోరకపోయినా, ఎంపెరుమానే స్వయంగా వచ్చి ఆ జ్ఞానాన్ని మరియు భక్తిని నమ్మాళ్వార్లకు ప్రసాదించారు. అందుకే నమ్మాళ్వార్లు ‘విణవాదు ఉణర్న్ద విరగర్’ అని పిలువబడతారు.

వీడియోలింక్:  https://youtube.com/shorts/zI6TnrS83Hg?si=1ZRcwTi9lxT30K5r

ఆంగ్లంలో: https://granthams.koyil.org/2026/07/22/nammazhwars-divine-names-parabrahma-yogi-vinavadhu-unarndha-viragar/  

అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్

ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – ప్రసూన  రామానుజ దాసి

https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.

ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org

Leave a Comment