శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

నంపిళ్ళై గారు – తిరువల్లిక్కేణి
61.ఎమ్బెరుమానార్ దర్శనస్తరిల్ ఎత్తనైయేనుమ్ కల్వియిల్లాద స్త్రీప్రాయరుమ్ దేవతాంతరంగళై అడుప్పిడు కల్లోపాదియాగ నినైత్తిరుక్కుమ్.

శ్రీ రామానుజ దర్శనాన్ని (శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని) అనుసరించే వారిల ఎలాంటి శాస్త్రాధ్యయనము లేదా అక్షరాస్యత లేని ఒక సాధారణ స్త్రీ అయినా సరే, శ్రీమన్నారాయణుడినే సర్వోన్నత పరమ ప్రభువుగా (ఏకైక పరదైవంగా) భావిస్తుంది; ఇతర అన్యదేవతలందరినీ వంటపొయ్యి కింద ఆధారంగా పెట్టే రాళ్లతో సమానంగా తృణప్రాయంగా మాత్రమే పరిగణిస్తుంది తప్ప ఎన్నడూ వారిని ఆశ్రయించదు.
గమనిక – శ్రీమన్నారాయణుడే సర్వోన్నత పరమ ప్రభువు (ఏకైక పరదైవము). బ్రహ్మ, రుద్రాది సమస్త దేవతలూ ఆ స్వామికి లోబడి ఉండే శేషభూతులే (దాసులే). వారందరూ తమ స్వంత కర్మలకు బద్ధులై ఉండడమే కాక, రజో-తమో గుణాలతో కూడుకుని ఉంటారు. తొండరడిప్పొడి ఆళ్వార్లు తమ తిరుమాలై 10వ పాశురంలో ఈ పరమ రహస్యాన్ని వివరిస్తూ – ‘భగవానుడు తన అపారమైన నిర్హేతుక కృపతో, ఇంకా తన యందు పరిపూర్ణ శరణాగతిని పొందలేని అపరిపక్వ జీవుల శ్రేయస్సు కోసమే ఈ అన్యదేవతలను నియమించాడు. అటువంటి జీవులు కనీసం ఆయా దేవతలనైనా ఆశ్రయించి పాపభీతిని కలిగి ఉంటూ, క్రమక్రమంగా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించి, అంతిమంగా విష్ణుభక్తిని పొందుతారు. ఒకవేళ ఈ దేవతలు కూడా లేకపోయినట్లయితే, అటువంటి వారు సులభంగా నాస్తికులుగా మారిపోయి సంపూర్ణంగా అధఃపాతాళానికి పతనమైపోతారు’ అని సెలవిచ్చారు. కాబట్టి, ఇతర దేవతలు ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం (అజ్ఞానుల క్రమశిక్షణ కోసం) మాత్రమే నియమించబడ్డారని స్పష్టంగా గ్రహించిన శ్రీ రామానుజ దర్శన అనుయాయులు వంటపొయ్యి కింద పెట్టే రాయి కేవలం ఒక సాధనంగా మాత్రమే ఉపయోగపడుతూ దానిపట్ల ఎలాంటి వ్యామోహం ఉండదో, అలాగే ఈ అన్యదేవతల పట్ల కూడా ఎటువంటి ఆకర్షణ లేదా ఆశ్రయ భావన లేకుండా కేవలం శ్రీమన్నారాయణుని పాదపద్మాల యందే అనన్య నిష్ఠతో ఉంటారు.
62.మోక్షఫలమ్ సిద్ధిక్క వేణుమ్ ఎన్ఱిరుక్కిఱవర్గళ్ క్షుద్ర దేవతైగళైప్ పిన్ శెల్లార్గళిఱే

పరమపదం – నిత్యానంద నిలయము మరియు ముముక్షువుల యొక్క పరమ ప్రాప్యము (చరమ లక్ష్యము).
మోక్షాన్ని సాధించడమే పరమ లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి (ముముక్షువు), అల్పఫలాలనిచ్చే క్షుద్ర దేవతల (అన్యదేవతల) వెంట ఎన్నటికీ వెళ్లడు.”
గమనిక – ఉపేయము (గమ్యము) అనగా పురుషార్థము – అనగా ఒక చేతనుడు ఆశించే/కోరుకునే పరమ ప్రయోజనము. సాధారణంగా పురుషార్థాలు నాలుగు విధాలుగా ఉంటాయి. అవి ధర్మము (శాస్త్రోక్త విధుల సక్రమ ఆచరణ), అర్థము (సంపద/ఐశ్వర్యము), కామము (ప్రాపంచిక/భోగ కోరికలు), మరియు మోక్షము (సంసార విముక్తి/శాశ్వత మోక్షానందము). శ్రీమన్నారాయణునికి ‘ముకుందుడు’ (మోక్షప్రదాత) అని పేరు.ఆ స్వామి తప్ప మరెవ్వరూ మోక్షాన్ని అనుగ్రహించలేరు. ఇతర అన్యదేవతలు కేవలం తమను నమ్ముకున్నవారి అల్పమైన, అనిత్యమైన ప్రాపంచిక కోరికలను మాత్రమే తీర్చగలరు. కాబట్టి, శాశ్వత మోక్షాన్ని ఆశించే ముముక్షువులు కేవలం శ్రీమన్నారాయణుడిని మాత్రమే ఆశ్రయించి ఆయన పాదపద్మాల వద్దే శరణాగతి చేస్తారు. వారికి అన్యదేవతల పట్ల ఎటువంటి ఆకర్షణ గానీ, అనుబంధం గానీ ఉండదు.
63.గరుడధ్వజన్, గరుడవాహనన్ ఎన్ఱు శొల్లప్పడుమవనాయిర్ర్టు మోక్ష ప్రదనానవన్.

గరుడ వాహనం మీద నంపెరుమాళ్ళు
గరుడధ్వజుడు (గరుడ పతాకం కలవాడు) మరియు గరుడవాహనుడు (గరుత్మంతునిపై అధిరోహించేవాడు) అని శాస్త్రాలలో కీర్తించబడే ఆ శ్రీమన్నారాయణుడు మాత్రమే ముక్తిని (మోక్షాన్ని) ప్రసాదించగల ఏకైక పరమ ప్రభువు.
గమనిక – గరుత్మంతుడు వేదాత్మగా ప్రసిద్ధి చెందాడు.అనగా వేదములకు ఆత్మ వంటివాడని (సాక్షాత్ వేద స్వరూపుడని) అర్థం. అటువంటి గరుడుడు నిరంతరం శ్రీమన్నారాయణుడినే తనపై మోస్తూ ఉంటాడు కాబట్టి సకల వేదాల చేత ప్రతిపాదించబడే ఏకైక పరమ ప్రతిపాద్య వస్తువు (లక్ష్యము) కూడా శ్రీమన్నారాయణుడే అని నిస్సందేహంగా సుస్పష్టమవుతోంది.
64. “కారణంతు ధ్యేయః” ఎన్గిఱపడియే జగత్కారణ వస్తువేయిఱే ఉపాస్యమావదు.

శాస్త్రము ‘కారణంతు ధ్యేయః’ అని ఘోషిస్తోంది. దీని అర్థం ఏమనగా – సృష్టి, స్థితి మరియు సంహారము (లయము) అను సమస్త జగద్వ్యాపారములకు ఏ తత్త్వమైతే మూలకారణమో ఆ జగత్కారణ పరబ్రహ్మ మాత్రమే మనందరి చేత నిరంతరం ధ్యానింపదగిన / ఉపాసింపదగిన ఏకైక పరమ ఆరాధ్య దైవము.
గమనిక – తైత్తిరీయోపనిషత్తు ‘యతో వా ఇమాని భూతాని జాయన్తే యేన జాతాని జీవన్తి యత్ ప్రయన్త్యభిసంవిశన్తి తద్ విజిజ్ఞాసస్వ తద్ బ్రహ్మేతి’ అని చాటుతోంది – ఏ పరతత్త్వము నుండి సమస్త ప్రాణులు ఆవిర్భవిస్తున్నాయో, పుట్టిన ప్రాణులన్నీ దేనిచేత పోషింపబడి జీవిస్తున్నాయో, ప్రళయకాలంలో సమస్త చరాచర జగత్తు దేనియందు లీనమై ప్రవేశిస్తుందో ఆ తత్త్వాన్నే తెలుసుకోవడానికి జిజ్ఞాస పడాలి, ఆ పరవస్తువే ‘బ్రహ్మము’. శ్రీమన్నారాయణుడే పంచభూతాత్మకమైన సమష్టి సృష్టిని స్వయంగా నిర్వర్తించి, చతుర్ముఖ బ్రహ్మకు అంతర్యామిగా శక్తిని ప్రసాదించి నానావిధ జీవరాశుల వ్యష్టి సృష్టిని చేయిస్తున్నాడు. ఆయనయే సాక్షాత్ మహావిష్ణువుగా సర్వలోకాలను నిరంతరం పోషిస్తూ పాలిస్తున్నాడు. ప్రళయవేళలో రుద్రుడికి, అగ్నికి సంహారక శక్తులను ప్రసాదించి సమస్త సంహారాన్ని చేయించి, అంతిమంగా వారిని సైతం తన ఉదరంలో లయం చేసుకుంటున్నాడు. కాబట్టి, సమస్త విశ్వానికి శ్రీమన్నారాయణుడే సర్వకారణమైన మూలపురుషుడని మరియు ఆ స్వామి ఒక్కడే సర్వుల చేత ఉపాసింపదగిన, ఆరాధింపదగిన ఏకైక పరబ్రహ్మ అని సుస్పష్టమవుతోంది.
65.మోక్ష ప్రదనుమాయ్ సర్వనియంతావుమాన సర్వేశ్వరనుక్కు అడిమై పుగువదే కర్తవ్యమ్.

శ్రీమన్నారాయణుకి నిరంతరం సర్వవిధ కైంకర్యాలు సమర్పించే ఆదిశేషుడు – ప్రతి జీవాత్మ భగవంతునికి ఎలా కైంకర్యం చేయాలి, ఏ విధంగా నిరంతర సేవలో నిమగ్నమవ్వాలి అనే స్వరూపానురూప దాస్యానికి పరమోత్కృష్టమైన ప్రత్యక్ష నిదర్శనం.
మోక్షాన్ని అనుగ్రహించే ఏకైక మోక్షప్రదాతయు, సమస్త చరాచర జగత్తును శాసించే సర్వనియంతయు అయిన ఆ శ్రీమన్నారాయణునికి దాస్యం చేయడమే (నిత్య కైంకర్యం చేయడమే) ప్రతి జీవాత్మ యొక్క పరమ కర్తవ్యము.
గమనిక – శ్రీమన్నారాయణుడే సర్వులకూ సహజ సిద్ధమైన నిత్య శేషి. జీవాత్మ తన స్వార్థ ప్రయోజనాల కోసమో లేదా కర్మబద్ధులైన ఇతర అన్యదేవతల కోసమో దాస్యం చేయడానికి బదులుగా తన ప్రభువైన ఆ సర్వేశ్వరునికే నిరంతరం దాస్యం చేయడం (కైంకర్యం సమర్పించడం) అత్యంత సహజసిద్ధమైన పరమ ధర్మము.
66.శెయ్య వేండువదొన్ఱిల్లై.అవనుడైమైయై అవనుక్కాగ ఇశైయ అమైయుమ్
మనం స్వప్రయత్నంతో సాధించవలసినది ఏదీ లేదు. జీవాత్మ సర్వేశ్వరుడైన భగవానుని స్వంత ఆస్తి (సొత్తు) అనే పరమ సత్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తే చాలు.
గమనిక – చేతనులు (జీవాత్మలు), అచేతనాలు (జడ పదార్థాలు) సమస్తమూ ఆ సర్వేశ్వరుడైన భగవానుని స్వంత ఆస్తి (సొత్తు). జీవాత్మలు కేవలం ఈ పరమ సత్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తే చాలు. జీవుడు తనకున్న ఈ నిత్య సంబంధాన్ని ఎప్పుడైతే గుర్తించి స్వీకరిస్తాడో, అప్పుడు భగవంతుని అపారమైన నిర్హేతుక కృప అతనిపై ప్రసరించడానికి అది ఒక్కటే సరిపోతుంది.దీనిని విశదీకరిస్తూ మన పూర్వాచార్యులు ఒక అద్భుతమైన దృష్టాంతాన్ని (రాజపుత్ర న్యాయాన్ని) అనుగ్రహించారు. ఒక చిన్న రాజకుమారుడు తన తండ్రి అయిన చక్రవర్తితో కలిసి వేటకు వెళ్తాడు. దురదృష్టవశాత్తు ఆ రాజకుమారుడు అడవిలో తండ్రి నుండి తప్పిపోగా, రాజు విచారంతో అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోతాడు. అడవిలో తప్పిపోయిన ఆ బాలుడిని ఒక బోయవాడు చేరదీసి, వేటగాడిగా పెంచి పెద్దచేస్తాడు. ఆ రాకుమారుడు తానే ఒక బోయవాడినని భావిస్తూ తన రాజవంశ మూలాలన్నింటినీ పూర్తిగా మరచిపోతాడు. కాలక్రమంలో, చిన్నతనంలో ఆ రాజకుమారుడిని చూసిన రాజపురోహితుడో లేదా మంత్రో అడవిలో అతడిని కలిసి, అతని అసలైన రాజవంశ గుర్తింపును వెల్లడిస్తాడు. ఆ క్షణంలో, ఆ రాజకుమారుడు తన తండ్రితో గల సహజ సంబంధాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తే చాలు వెంటనే అతనికి సమస్త రాజభోగాలు, రాజ్య పట్టాభిషేకం సహజంగా లభిస్తాయి.అదేవిధంగా, అనాదిగా ఈ సంసారంలో చిక్కుకుపోయిన జీవాత్మ తాను స్వతంత్రుడినని (స్వస్వాతంత్ర్య భ్రమ), కేవలం ఈ దేహమే తానని (దేహాత్మ అభిమానం) తప్పుగా భావిస్తున్నాడు. కానీ సదాచార్యుని ద్వారా భగవంతుని పట్ల తనకున్న పరిపూర్ణ పారతంత్య్రాన్ని (సహజ శేషత్వాన్ని) గుర్తించి, ఆ సంబంధాన్ని అంగీకరించిన మరుక్షణమే భగవానుని దివ్య కృపా ప్రవాహం అతనిపై స్వయంగా వర్షిస్తుంది.
67.అవన్ కొడుత్త ఉపకరణంగళైక్ కొండు అప్రాప్త విషయంగళిల్ పోగాదే, ‘తందనీ కొండాక్కినై’ ఎన్గిఱపడియే వగుత్త విషయత్తుక్కే శేషమాక్కిక్ కొండు కిట్టుగై.
మన శరీరము మరియు ఇంద్రియాలు ఆ సర్వేశ్వరుడైన భగవానుని చేత ప్రసాదించబడిన అమూల్యమైన ఉపకరణాలు. వాటిని స్వరూప విరుద్ధమైన ఇతర లౌకిక భోగాలలో వ్యర్థం చేయడానికి బదులుగా అత్యంత సముచితమైన, స్వరూపానురూపమైన ఆ భగవంతుని నిత్య కైంకర్యంలోనే (సేవలోనే) వినియోగించాలి.
గమనిక – భగవానుడే సర్వాధారమైన యజమాని (శేషి), జీవాత్మలందరూ ఆయనకు నిత్య దాసులు (శేషభూతులు). జీవాత్మలు తమ సమస్త ఇంద్రియాలను శ్రీమన్నారాయణుని దివ్య సేవలోనే వినియోగించడం అత్యంత సహజసిద్ధమైన ధర్మం. జీవులు పెరుమాళ్ళకి నిత్య కైంకర్యం చేయడాన్ని సులభతరం చేసేందుకే భగవానుడు దేహేంద్రియాలను ప్రసాదించాడు.నమ్మాళ్వార్లు తమ తిరువాయిమొళి (2.3.4)లో ‘తందనీ కొండాక్కినై’ అని గానం చేస్తూ ఎంబెరుమాన్ పట్ల తమ అనంతమైన కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు. ఆళ్వార్లు ఇలా అంటారు.‘అనాది కాలం నుండి నేను ఈ ఘోర సంసారంలో పడి అలమటించాను. అటువంటిది ఈనాడు నీవే స్వయంగా నా వద్దకు తరలివచ్చి నా హృదయంలో తేజోమయంగా ప్రకాశిస్తున్నావు. నీ ఈ అపార కృపకు నేను ప్రత్యుపకారంగా నా కృతజ్ఞతను ఎలా తీర్చుకోగలను? సరే, నన్ను నేనే నీకు సమర్పించుకుందామనుకున్నాను. కానీ నేనలా సమర్పించడమూ కుదరదు. ఎందుకంటే నన్ను, నావనుకున్న సమస్తాన్ని ఎప్పుడో నీవే స్వంతం చేసుకున్నావు (నీవే యజమానివి). ఈ శరీరాన్ని నాకిచ్చినదీ నీవే, ఇప్పుడు నీవే నన్ను నీ స్వంత కైంకర్యంలో వినియోగించుకుంటున్నావు’. దీనిపై స్వామి నంపిళ్ళై గారు తమ ‘ఈడు’ (ఈడు ముప్పత్తారాయిరప్పడి) దివ్య వ్యాఖ్యానంలో ఒక అద్భుతమైన పరమ రహస్యాన్ని ఆవిష్కరించారు. భగవంతుని సంకల్పమే కేవల కారణమైతే అందరూ పరమపదానికి వెళ్ళిపోవాలి కదా అనే ‘సర్వ ముక్తి ప్రసంగాన్ని’ నివారించేందుకే శాస్త్రాలు జీవుడు ఆత్మసమర్పణ చేయాలని ఒక హేతువుగా చెబుతాయి. కానీ జీవాత్మ యొక్క యథార్థ సహజ స్వరూప దృష్ట్యా చూస్తే అసలు ఆత్మసమర్పణ అనేది చేయనే కూడదు! నంపిళ్ళై గారు ఇంకా వివరిస్తూ, జీవాత్మ అజ్ఞానంలో మునిగి ఉన్నప్పుడు ‘నన్ను నేను భగవంతునికి సమర్పిస్తున్నాను’ అని ఆత్మసమర్పణ చేస్తాడనీ,అదే జీవుడు తన అసలైన స్వరూప పారతంత్ర్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడు, తాను ఆత్మసమర్పణ చేసినందుకు తానే సిగ్గుపడి, పశ్చాత్తాపపడుతూ , ‘ఆయన సొత్తైన వస్తువును ఆయనకే ఇస్తూ, ఏదో కొత్తగా నా స్వంత వస్తువును ఇస్తున్నట్లు భావించడం ఎంతటి మోసం, దగా!’ అని పరితపిస్తాడని సెలవిచ్చారు.
68.ఏకాంత భోగత్తుక్కాగప్ పోన్ద పిరాట్టి అశోకవనికైయిలే ఇరున్దాప్ పోలే తోట్రా నిన్ఱదాయిట్రు స్వరూప జ్ఞానం పిఱన్ద పిన్బు దేహత్తిలే ఇరుక్కిఱ ఇరుప్పు.

శ్రీ సీతా పిరాట్టి శ్రీరామచంద్రునితో ఏకాంతంగా ఆనందించేందుకే ఆయనను అనుసరించి అరణ్యానికి వెళ్ళింది. కానీ దురదృష్టవశాత్తు ఆ అపురూపమైన అవకాశాన్ని కోల్పోయి, చివరకు అశోకవనంలో బందీగా చిక్కుకుని విరహ వేదనతో విలపించింది. అదేవిధంగా, ఈ సంసారంలో ఉన్న జీవాత్మకు భగవంతునితో గల సహజ దాస్య సంబంధం బోధపడిన తర్వాత కేవలం ఈ ప్రాకృత శరీరంలో బంధింపబడి ఉండటమే తీవ్రమైన దుఃఖదాయకంగా మారుతుంది.
69.తిఱన్దుకిడన్ద వాసల్తోఱుమ్ నుళైన్దు తిరియుమ్ పదార్థమ్ పోలే, కర్మానుగుణమాగ దేవాది శరీరంగళ్ తోఱుమ్ ప్రవేశిత్తుత్ తిరియుమ్.
తలుపులు తెరిచి ఉన్న ఏ ఇంటి వాకిట్లోకైనా యథేచ్ఛగా దూరి తిరిగే ఒక కుక్క వలె జీవాత్మ కూడా తన పూర్వ సంచిత కర్మలకు అనుగుణంగా దేవతలు, మనుష్యులు, తిర్యక్కులు (జంతు-పక్ష్యాదులు), స్థావరాలు (చెట్లు-చేమలు) మొదలైన నానావిధ శరీరాలలోనికి ప్రవేశిస్తూ, ఈ సంసార చక్రంలో తన అంతంలేని ప్రయాణాన్ని నిరంతరం సాగిస్తూనే ఉంటాడు.
తన స్వంత పాప-పుణ్య కర్మలకు అనుగుణంగానే ప్రతి జీవుడు ఒక నిర్దిష్టమైన శరీరాన్ని పొందుతాడు. ఈ లోకంలో లెక్కలేనన్ని విభిన్న జీవరాశుల జాతులు కనిపిస్తూనే ఉన్నాయి. జీవిత చరమ ఘడియలలో (అంతిమ క్షణాలలో) మానవుడు ఏ భావాన్ని లేదా దేనిని తీవ్రంగా కాంక్షిస్తాడో, వచ్చే జన్మలో ఆ రూపమే పొందుతాడని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చాడు.మనుస్మృతిలో కూడా దీనిని విశదీకరిస్తూ – ఒక మానవుడు తన మనస్సు ద్వారా అపరాధం (పాపం) తలపెడితే, అతడు ఉన్నతమైన ఆలోచనకు ఏమాత్రం తావులేని చండాల జన్మను పొందుతాడు. వాక్కు ద్వారా అపరాధం చేస్తే, స్పష్టమైన మానవ సంభాషణకు ఆస్కారం లేని పక్షి జాతిగా జన్మిస్తాడు. ఇక శరీరము (చేష్టల) ద్వారా భౌతిక అపరాధం చేస్తే, కదలికకు సైతం వీలులేని స్థావరమైన చెట్లు-చేమలుగా జన్మిస్తాడు అని చెప్పబడింది.
70.భక్తిమానుక్కుమ్ భక్తి యుండు. ప్రపన్ననుక్కుమ్ భక్తి యుండు. రుచియై యొళియ ప్రపత్తి పణ్ణక్కూడాదే.
భక్తి అనగా భగవంతుని యందు కలిగే పరమ ప్రేమ మరియు గాఢమైన అనురాగం. భక్తియోగాన్ని అవలంబించే ‘భక్తిమానుడు’ మరియు భగవంతునికే సంపూర్ణంగా ఆత్మసమర్పణ చేసిన ‘ప్రపన్నుడు’ – వీరిద్దరి యందూ భక్తి ఉంటుంది. ఆ ప్రాథమిక భక్తి (భగవత్ ప్రీతి/రుచి) లేనిదే ఎవరూ భగవంతునికి శరణాగతి చేయలేరు. ఒకవేళ భగవంతునిపై ఏమాత్రం భక్తి లేకుండా శరణాగతి చేసినా, దానివలన ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.
గమనిక – వీరిద్దరి నడుమ గల తాత్త్విక భేదం ఏమనగా – భక్తియోగాన్ని నిష్ఠతో ఆచరించే ‘భక్తిమానునికి’ భక్తియే మోక్షాన్ని సాధించే ఉపాయము (సాధనము). కానీ సర్వవిధాల భగవంతునికే ఆత్మసమర్పణ చేసిన ‘ప్రపన్నునికి’ సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఏకైక ఉపాయము. ఆ ప్రపన్నుని యందుండే భక్తి అనేది స్వామికి చేసే దివ్య కైంకర్యం (సేవ) మీద పొంగిపొరలే రుచి (గాఢమైన ప్రేమపూర్వక అనురాగం) మాత్రమే.
ఆంగ్లంలో : https://granthams.koyil.org/2013/08/12/divine-revelations-of-lokacharya-7/
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – ప్రసూన రామానుజ దాసి
https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.
ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org